test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పెట్టుబడుల ఎరతో అమెరికాలో అదాని లంచం కేసు రద్దు!

15 మే, 2026

adani bribery case
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 16, 2026, 12:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- పది బిలియన్‌ డాలర్ల పెట్టుబడికి అదాని అంగీకారం
- న్యాయవాదుల బృందానికి నేతృత్వం వహించిన ట్రంప్‌ వ్యక్తిగత లాయర్‌

​న్యూఢిల్లీ : సోలార్‌ ‌ విద్యుత్‌ ‌ప్లాంట్ల ఏర్పాటు కోసం లంచం ఇవ్వడంతో పాటు, మోసం చేసినట్లుగా (క్రిమినల్‌) అమెరికాలో నమోదైన క్రిమినల్‌ ‌కేసుల నుండి భారీ పెట్టుబడులను ఎరగా వేసి గౌతమ్‌ అదాని బయటపడనున్నారు. దేశవ్మాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించిన పరిణామాలు అమెరికాలో వేగంగా చోటుచేసుకుంటున్నాయి. పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించిన సమాచారం ప్రకారం ఈ మేరకు అమెరికా జస్టిస్‌ ‌డిపార్ట్‌‌మెంట్‌ ‌దాదాపుగా అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ‌ట్రంప్‌ ‌వ్యక్తిగత న్యాయవాదుల్లో ఒకరైన రాబర్ట్‌జె.గియఫ్రా జూనియర్‌ ‌నేతృత్వంలోని న్యాయవాదుల బృందాన్ని తన తరపున వాదించేందుకు అదాని ఇటీవల నియమించుకున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి, అదానికి ఉన్న సన్నిహిత సంబంధాలు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌‌తోనూ మోడీకి సన్నిహిత సంబంధాలున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ‌వ్యక్తిగత న్యాయవాది అదాని తరుపున వాదించడం ప్రారంభించిన తరువాతే కేసు రద్దు దిశలో అడుగులు పడటం గమనార్హం, నవంబర్ 2024 లో అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్లు అదానీపై ఈ కేసులను నమోదు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ అనుమతుల కోసం భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్‌ ‌డాలర్లు (రూ.2100 కోట్లు) లంచాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయాన్ని దాచిపెట్టి అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుండి 3 బిలియన్‌ డాలర్ల కంటే ఎక్కువ నిధులు సేకరించారని అమెరికా ఆరోపించింది. ఈ కేసులో ఆంధ్ర ప్రదేశ్‌ ‌పేరుతో పాటు, అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌‌ మోహన్‌‌రెడ్డికి సంబంధించిన ప్రస్తావన రావడం కలకలం రేపింది. దీనికి సంబంధించి గౌతమ్‌ అదానితో పాటు, ఆ గ్రూపునకు చెందిన సాగర్‌ అదానీ, వినీత్‌ ‌జైన్‌ ‌తదితరులపై లంచం ఇవ్వడంతో పాటు, సెక్యూరిటీస్‌ ‌ఫ్రాడ్‌, వైర్‌ ఫ్రాడ్‌ ‌తదితర కేసులను అధికారులను నమోదు చేశారు. న్యాయవాదుల బృందం మారిన తరువాత పెట్టుబడుల అంశాన్ని ముందుకు తీసుకువచ్చారు. ఈ ప్రతిపాదన ప్రకారం అమెరికన్‌ ఆర్థిక వ్యవస్థలో పది బిలియన్‌ ‌డాలర్లు (సుమారుగా 85 వేల కోట్ల రూపాయలు) పెట్టుబడులుగా పెట్టడానికి అదాని అంగీకరించారు. ఈ పెట్టుబడులతో 15వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని కూడా చెప్పారు. అయితే, ఈ కేసు నడుస్తున్నంత కాలం అదానీ పెట్టుబడులు పెట్టలేరని ఆయన తరపున వాదించిన న్యాయవాది రాబర్ట్ గియుఫ్రా జస్టిస్ డిపార్ట్‌మెంట్‌కు వివరించారు. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసులను ఉపసంహరించుకోవడానికి జస్టిస్‌ ‌డిపార్ట్‌‌మెంట్‌ అంగీకరించింది.

జరిమానాతో సరి...!
ఈ క్రిమినల్‌ కేసుతో సమాంతరంగా నడుస్తున్న సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (ఎస్‌ఇసి) సివిల్ ఫ్రాడ్ దావాను అదానీ కోర్టు వెలుపల పరిష్కరించుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ కలిసి సంయుక్తంగా 18 మిలియన్‌ ‌డాలర్లు (దాదాపు రూ.170 కోట్లు) జరిమానా చెల్లించడానికి అంగీకరించారు. ఈ ఒప్పందం ప్రకారం తాము ఎలాంటి తప్పు చేసినట్లు అంగీకరించడం కానీ, లేదా ఆరోపణలను తిరస్కరించడం కానీ చేయట్లేదని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. అమెరికాలో కేసు రద్దు కావడంతో మన దేశంలో నమోదైన కేసులు కూడా అదే బాట పడతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్