ఏప్రిల్‌లో 8.3 శాతానికి ద్రవ్యోల్బణం • 42 నెలల గరిష్టానికి చేరిక
న్యూఢిల్లీ : దేశ ప్రధాని మోడీ ఆర్థిక విధానాలు ప్రజల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే అధిక ధరలతో ప్రజలు ఆదాయాలు కోల్పోగా.. ఇటీవల పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ సంక్షోభం కారణంగా ఇంధన ధరలు భారీగా పెరగడంతో ఏప్రిల్ నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యుపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏకంగా 8.3 శాతానికి ఎగబాకింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఇది కేవలం 0.85 శాతంగా ఉండగా, ఈ ఏడాది మార్చిలో 3.88 శాతంగా నమోదయ్యింది. ధరలను అరికట్టడంలో కేంద్రం విఫలం కావడంతో ఏప్రిల్‌లో అమాంతం పెరిగి 42 నెలల గరిష్ట స్థాయికి చేరడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం. భారత ఆర్థిక వ్యవస్థ రికార్డుల్లోనే హోల్‌సేల్ ద్రవ్యోల్బణం ఇంత వేగంగా పెరగడం ఇదే మొదటిసారని గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ బార్క్లేస్ పేర్కొంది.
చమురు సెగలు
పశ్చిమ ఆసియా యుద్ధం కారణంగా ముడి చమురు దిగుమతులు భారత్‌కు భారంగా మారాయి. ఏప్రిల్‌లో ఇంధనం, విద్యుత్ విభాగంలో ద్రవ్యోల్బణం మార్చిలో ఉన్న 1.05 శాతం నుండి ఏకంగా 24.71 శాతానికి చేరింది. ముడి చమురు ద్రవ్యోల్బణం 88.06 శాతంగా చోటు చేసుకుంది. ఇది 2021 అక్టోబర్ తర్వాత ఇదే అత్యధికం. పెట్రోల్ ధరలు 32.40 శాతం, డీజిల్ 25.19 శాతం పెరగ్గా, ఎల్‌పిజి ధరలు మార్చిలో (-)1.54 శాతంగా ఉండగా, ఏప్రిల్‌లో 10.92 శాతం ఎగిశాయి.
తయారీ ప్రభావం..
కేవలం ఇంధనమే కాకుండా లోహాలు, రసాయనాలు, వస్త్రాల వంటి తయారీ వస్తువుల ధరలు పెరగడంతో కీలక డ్రవ్యోల్బణం కూడా 5 శాతానికి చేరింది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం 1.98 శాతంగా ఉండగా.. ఆహారేతర వస్తువుల ధరలు 12.18 శాతానికి పెరిగాయి. మార్చి నెలలో ఇవి 11.5 శాతంగా ఉన్నాయి. తయారీ వస్తువుల ద్రవ్యోల్బణం కూడా 4.62 శాతానికి ఎగబాకింది.
మున్ముందు మరిన్ని సవాళ్లు..
ముందుముందు ఈ పరిస్థితి మరింత క్లిష్టంగా మారవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. మే నెలలో ద్రవ్యోల్బణం 9 శాతానికి చేరే అవకాశం ఉందని ఇండియా రేటింగ్స్ అంచనా వేస్తోంది. అంతర్జాతీయ పరిస్థితులు ఇలాగే కొనసాగితే మే నెలలో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 5 మేర పెరిగే అవకాశం ఉందని బార్క్లేస్ పేర్కొంది. యుద్ధంతో పాటు ఎల్ నినో ప్రభావం వల్ల పంటలు దెబ్బతినే అవకాశం ఉండటం కూడా ధరల పెరుగుదలకు మరో ముప్పుగా పరిణమించేలా కనిపిస్తోంది.








కామెంట్‌లు (0)