test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionనిత్యావసరాల ధరల మంట!

30 మే, 2026

prices
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 11:58 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆందోళన

  • ఇంధన ధరలతో గుబులు

  • బలహీనమైన రుతుపవనాల భయాలు

న్యూఢిల్లీ : పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవలి చమురు ధరల అమాంతం పెరుగుదల, సాధారణం కంటే బలహీనంగా ఉన్న రుతుపవనాల కారణంగా రాబోయే రోజుల్లో దేశంలో నిత్యావసర ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ రిపోర్ట్‌‌లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి లో అంతరాయాలు ఎంతకాలం కొనసాగుతాయనే అంశంపైనే భారతదేశ బాహ్య మార్కెట్, ధరల భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నివేదిక స్పష్టం చేసింది.

రవాణ ఖర్చుల ఒత్తిడి

అంతర్జాతీయ మార్కెట్లో ముడి ఇంధన ధరల ఒత్తిడి తీవ్రంగా పెరగడం, దేశీయంగా ఇటీవలి ఇంధన ధరల పెంపుదల వంటి అంశాలు రాబోయే నెలల్లో వినియోగదారులపై అదనపు భారాన్ని మోపనున్నాయి. ఈ ధరల పెరుగుదల ప్రభావం క్రమంగా రవాణా, ఇంధనం, ఆహార రంగాలపై పడి తద్వారా రిటైల్ ద్రవ్యోల్బణం మరింత పెరగడానికి దారితీస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. ఇంధన ఖర్చులు పెరిగినప్పుడు వస్తువుల రవాణా వ్యయం కూడా పెరిగి మార్కెట్లో అన్ని వస్తువుల ధరలు ప్రియమవడానికి ఇది కారణమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.

​గ్రామీణ డిమాండ్‌‌కు దెబ్బ

ఈ ఏడాది దేశంలో బలహీనమైన రుతుపవనాలతో వర్షపాతంలో గణనీయమైన లోటు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయ సంక్షోభ పరిస్థితులకు ఈ వర్షభావం తోడైతే, దేశంలో ఆహార ద్రవ్యోల్బణం తలెత్తే ప్రమాదం ఉందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. నిత్యావసరాలు, ఆహారపదార్థాల ధరలు పెరిగితే, అది గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తిని తగ్గించనుంది. ఇది దేశ వృద్ధి రేటును దెబ్బతీయనుంది. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ఇంధన ధరలు, అంతర్జాతీయ మార్కెట్లో బలహీనపడుతున్న రూపాయి విలువ, పెరుగుతున్న ఉత్పాదక వ్యయాలు, తక్కువ వర్షపాత సూచనల నేపథ్యంలో ప్రభుత్వం విధానపరంగా నిరంతర పర్యవేక్షణ, అప్రమత్తత వహించాల్సిన అవసరం ఉందని నివేదిక నొక్కి చెప్పింది. అయితే.. ప్రస్తుతానికి భారత ఆర్థిక వ్యవస్థ స్వల్పకాలికంగా ఒడిదొడుకులను తట్టుకునే శక్తిని కలిగి ఉందని తెలిపింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్