ప్రజాశక్తి-కడియం (తూర్పు గోదావరి) : ఆంధ్రా పేపర్ లిమిటెడ్ కడియం యూనిట్ లో కార్మికులకు జీతాలు పెంచాలని, వేతన ఒప్పందం జరపాలనే డిమాండ్స్ తో గత 15 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నారు. స్పందించని యాజమాన్యం నిరంకుశ వైఖరిని నిరసిస్తూ …. అక్రమ లాకౌట్, సస్పెన్షన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ, సోమవారం కడియం మిల్లు వద్ద నుండి కడియం దేవి చౌక్ సెంటర్, వేమగిరి జాతీయ రహదారి కూడలి మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. అనంతరం సమస్యలు పరిష్కరించాలంటూ కార్మికులంతా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి కి వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు టి.అరుణ్ మాట్లాడుతూ …. పేపర్ మిల్లు యాజమాన్యం , కార్మికుల పట్ల అత్యంత నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని, యాజమాన్య వైఖరిని దుయ్యబట్టారు. వేతన ఒప్పందం గడువు ముగిసి మూడు సంవత్సరాల అయినా , నేటికి వేతన ఒప్పందం జరపకుండా, కార్మికులకు జీతాలు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. గత సంవత్సర కాలంగా కాంట్రాక్ట్ కార్మికులతో పలు దఫాలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో కార్మికులు ఏప్రిల్ 27 నుండి రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని తెలిపారు. 15 నుంచి 20 సంవత్సరాలు సర్వీస్ ఉన్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయకుండా, వేతనాలు పెంచకుండా, ఓవర్ టైం కు కూడా డబల్ వేతనం ఇవ్వకుండా కార్మికులను అత్యంత తీవ్రంగా యాజమాన్యం దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. పర్మినెంట్ కార్మికులకు కూడా నేటికి వేతనం ఒప్పందం జరపలేదన్నారు. యాజమాన్యం ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమ లాకౌట్ పెట్టి కార్మికులను బలవంతంగా బయటికి నెట్టారని విమర్శించారు. గత పది రోజులుగా నాలుగు దఫాలు లేబర్ డిపార్ట్మెంట్ వద్ద చర్చలకు హాజరైన యాజమాన్యం, సమస్యల పరిష్కారం చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలని, ఏకపక్షంగా పెట్టిన లాకౌట్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వేతన ఒప్పందం జరపాలని, కార్మికులకు జీతాల పెంచాలని, అక్రమ్ లాకౌట్ ఎత్తివేయాలని, అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలని, యాజమాన్యం నిరంకుశ వైఖరి నశించాలని కార్మికుల పెద్ద ఎత్తున నినాదాలతో ర్యాలీ, ధర్నాలో హోరేత్తించారు. ఈ ధర్నాకు సిఐటియు తూర్పుగోదావరి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం. సుందర్ బాబు, బి.పవన్ లు హాజరై కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కార్మికులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వందల కోట్ల రూపాయలు లాభాలు వస్తున్న కార్మికుల జీతాలు పెంచని యాజమాన్య వైఖరిని ఖండించారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్మికులందరూ ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి.పూర్ణిమ రాజు, భగత్, ఐఎఫ్టియు జిల్లా నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు , ఎస్.కిరణ్, మిల్లు పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
పేపర్ మిల్లు కార్మికుల భారీ బైక్ ర్యాలీ, ధర్నా
11 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 11, 2026, 05:36 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)