test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అమెరికా ఆంక్షలకు క్యూబా లొంగిపోదు

16 మే, 2026

cuba
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 17, 2026, 12:01 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

- ఎలాంటి దాడినైనా ఐక్యంగా ప్రతిఘటిస్తాం
- క్యూబా విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగజ్ పారిల్లా
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో  : అమెరికా ఆంక్షలకు క్యూబా లొంగిపోదని విదేశాంగ మంత్రి బ్రూనో రోడ్రిగజ్ పారిల్లా స్పష్టం చేశారు. అమెరికా సామ్రాజ్యం క్యూబాపై విధించిన క్రూరమైన కొత్త ఆంక్షల కారణంగా దేశంలో పిల్లలు సామూహికంగా చనిపోతున్నారని అన్నారు. శనివారం నాడిక్కడ సుర్జిత్ భవన్‌లో నేషనల్ క్యూబన్ సాలిడారిటీ కమిటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమెరికా తన జాతీయ భద్రతకు క్యూబా సవాలుగా నిలుస్తోందని దుష్ప్రాచారం చేస్తూ ..ఆ అబద్ధాన్ని వ్యాప్తి చేస్తూ నౌకాదళ, ఇంధన ఆంక్షలను, ఆర్థిక దిగ్బంధాన్ని కొనసాగిస్తూ క్యూబా జాతి మొత్తాన్ని నిర్మూలించాలనే కుటిల పన్నాగాలను అమెరికా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు. అమెరికా సాగిస్తున్న దుర్మార్గపు దిగ్బంధన చర్యల కారణంగా దేశంలో శిశు మరణాల రేటు రెట్టింపు అయ్యాయని, మందుల కొరత కారణంగా 12,000 మంది పిల్లలకు శస్త్రచికిత్సలు నిర్వహించలేకపోయామని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది పౌరులు శస్త్రచికిత్స కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. అమెరికా ప్రత్యక్ష సైనిక దాడికి సిద్ధమవుతోందన్నారు. క్యూబా ప్రజలు ఎలాంటి దాడినైనా ఐక్యంగా ప్రతిఘటిస్తారని తెలిపారు. ఇంధన ఆంక్షల కింద క్యూబా ఎలా నిలబడగలుగుతోందో చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. క్యూబా తన మొత్తం చమురు వినియోగంలో సగాన్ని స్వతహాగా ఉత్పత్తి చేసుకుంటోందని తెలిపారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు కలిగిన దేశాలలో ఒకటిగా పేర్కొన్నారు. మిత్ర దేశాలు సౌరశక్తి ప్రాజెక్టులను అమలు చేయడంతో ఆంక్షలను అధిగమించడానికి సహాయం చేస్తున్నాయని తెలిపారు. అమెరికా ఒత్తిళ్లకు, దిగ్బంధనాలకు క్యూబా ఏమాత్రం వెనుకంజ వేయబోమని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని ప్రతిఘటించి ముందుకెళ్తామే మినహా సామ్యవాద మార్గాన్ని విడిచిపెట్టబోమని, వదులుకోబోమని స్పష్టం చేశారు. మూడు దశాబ్దాల క్రితం సిపిఎం క్యూబాకు ఇచ్చిన 20,000 టన్నుల ఆహార ధాన్యాలను కూడా ఆయన కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. దానిని క్యూబా విప్లవ సేనాని ఫిడెల్ కాస్ట్రో 'భారతదేశపు ఆహారం' అని పిలిచారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో క్యూబా రాయబారి జువాన్ కార్లోస్ మార్సన్ అగ్యిలేరా, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు అరుణ్ కుమార్, సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ, ఆర్ఎస్‌పి ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య, ప్రపంచ శాంతి మండలి అధ్యక్షులు పల్లవ్ సేన్ గుప్తా, పలు దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఆంక్షల సడలింపే అసలైన సాయం..
అంతకుముందు బ్రిక్స్‌ ‌విదేశాంగ మంత్రుల సమావేశంలో శుక్రవారం ఆయన ప్రసంగించారు. ’అంతర్జాతీయ పాలనా సంస్కరణలు, బహుళపక్ష వ్యవస్థ’’ అనే అంశంపై జరిగిన సమావేశంలో రొడ్రిగజ్‌ మాట్లాడుతూ చమురుపై ఆంక్షలతో సహా అనేక రకాలుగా అమెరికా ఇబ్బందులను సృష్టిస్తోందని, వీటన్నింటినీ దీటుగా ఎదుర్కొంటూ కూడా క్యూబా, సోషలిజం దిశగా తనదైన పంథాను నిర్మించుకుందని, ఇతర పేద దేశాల ప్రజల అభివృద్ధికి ఇతోధికంగా సాయపడుతోందని చెప్పారు. వంద మిలియన్ల డాలర్ల విలువైన మానవతా సాయాన్ని క్యూబాకు అందచేస్తామని మొట్టమొదటి సారిగా అమెరికా ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించిందని, అయితే ఇప్పటివరకు కూడా ఆ సాయం నగదు రూపంలోనే లేదా మరే రకంగానా అనేది వెల్లడించలేదని ఆయన పేర్కొన్నారు. లేదా ఇంధనం, ఆహారం, మందులు వంటి ప్రజల అత్యవసరాలను తీర్చే రూపంలోనా అన్నది కూడా తెలియరాలేదన్నారు. ఆర్థికపరమైన చర్యల ద్వారా మొత్తంగా క్యూబన్లపై కక్ష తీర్చుకుంటున్న ఒక దేశం ఉదారంగా చేసినట్లుగా కనిపిస్తున్న ఈ ప్రకటనలోని డొల్లతనాన్ని గుర్తించినప్పటికీ క్యూబా ప్రభుత్వం ఎన్నడూ విదేశీ సాయాన్ని తిరస్కరించలేదని గుర్తు చేశారు. క్యూబా ఆర్థిక, సామాజిక వ్యవస్థల్లో ప్రతీ రంగాన్ని దారుణంగా దెబ్బతీస్తున్న ఆంక్షలను సడలించడమే క్యూబన్లకు అమెరికా చేయగలిగే అత్యుత్తమ సాయమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఐక్యరాజ్య సమితిని వాస్తవమైన ప్రజాస్వామ్యీకరణ దిశగా బలోపేతం చేయాల్సి వుందని క్యూబా అభిప్రాయపడుతోందన్నారు. అంతేకానీ విచక్షణారహితంగా వనరులను కుదించడం దిశగా కాదని అన్నారు. అతిపెద్ద మొత్తంలో ఐక్యరాజ్య సమితికి విరాళాలు అందచేసే దేశాలు బేషరతుగా సకాలంలో బకాయిలు చెల్లించాలని కోరారు. ప్రపంచానికి అవసరమైన సంస్కరణలను సమర్ధించేందుకు ప్రతి అంతర్జాతీయ వేదికపైనా తమ గళాన్ని వినిపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్