ఆఫ్రికా : ఎబోలా వైరస్ విజృంభణ ఆఫ్రికా ఖండంలో విస్తరిస్తుండటంతో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేగింది. ఇప్పటికే ఈ ప్రాణాంతక ఎబోలా వైరస్ తో ఆఫ్రికా ఖండంలోని కాంగోలో 88 మంది మరణించగా, మరో 300 మంది ఈ వైరస్ బారిన పడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. కాంగో, ఉగాండా దేశాల్లో ఎబోలా కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాప్తిని అదుపు చేసేందుకు, ప్రపంచ దేశాలను అప్రమత్తం చేసేందుకు దీనిని ‘గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ’ (అంతర్జాతీయ ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి) గా ప్రకటిస్తూ డబ్ల్యూహెచ్‌ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’ ….
కాంగో, ఉగాండా దేశాలలో ఇప్పటివరకు 300కు పైగా అనుమానిత ఎబోలా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకు 88 మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. కాంగోలో మొదలైన ఈ వైరస్ సరిహద్దులు దాటి పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వేగంగా విస్తరించింది. దీనివల్ల ప్రపంచ దేశాలకు తక్షణ ముప్పు లేకపోయినా.. కాంగో పొరుగు దేశాల్లో వేగంగా వ్యాపించే ప్రమాదముందని హెచ్చరించింది. ఇతర దేశాల్లో ఇప్పటికే పలు కేసులు నమోదైనట్లు తెలిపింది. 1976లో కాంగోలో ఎబోలాను తొలిసారిగా గుర్తించినప్పటి నుంచి ఇది 17వ సారి వ్యాప్తి చెందడమని వెల్లడించింది. ప్రాథమిక నమూనాలలో అధిక పాజిటివిటీ రేటు.. వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరంగా మారిందని పేర్కొంది. అంతర్జాతీయ ప్రయాణాలు, సరిహద్దుల ద్వారా ఇది ఇతర దేశాలకు వ్యాపించకుండా నిరోధించేందుకు అత్యవసర చర్యలు అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే డబ్ల్యూహెచ్‌ఓ అంతర్జాతీయ నిపుణుల కమిటీ సమావేశమై ప్రస్తుత పరిస్థితులను సమీక్షించిన అనంతరం.. దీనిని ‘పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్’ (PHEIC) గా ప్రకటించింది. దీనివల్ల బాధిత దేశాలకు అంతర్జాతీయ నిధులు, వ్యాక్సిన్లు, వైద్య సహాయం వేగంగా అందుతాయి.
వైరస్ లక్షణాలు ….
ఎబోలా అనేది అత్యంత ప్రమాదకరమైన వైరస్. ఇది సోకినవారిలో తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, వాంతులు, విరేచనాలతో పాటు అంతర్గతంగా, బాహ్యంగా రక్తస్రావం జరుగుతుంది. ఇది సోకిన రోగుల శరీర ద్రవాల (రక్తం, లాలాజలం వంటివి) ద్వారా ఒకరి నుంచి ఒకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ బారిన పడిన వారు సరైన చికిత్స తీసుకోకపోతే రోజుల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తుంది.
వెంటనే అరికట్టడం అసాధ్యం : ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఈ వైరస్‌కు ప్రత్యేకంగా అమోదించిన చికిత్సలు, వ్యాక్సిన్‌లు లేకపోవడం వల్ల దీనిని వెంటనే అరికట్టడం కూడా అసాధ్యమని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. జాతీయ విపత్తు అత్యవసర నిర్వహణ యంత్రాంగాలను క్రియాశీలం చేయాలని, సరిహద్దుల వెంబడి స్క్రీనింగ్ చేపట్టాలని ప్రపంచ దేశాలకు సూచించింది. అదే సమయంలో వైరస్ భయంతో సరిహద్దులను మూసివేయవద్దని, ప్రయాణ, వాణిజ్య ఆంక్షలు విధించవద్దని కోరింది. వైరస్ లక్షణాలు ఉన్నవారు ఇతర దేశాలకు వెళ్లొద్దని పేర్కొంది. వ్యాధి నిర్థారణ అయిన వారిని వెంటనే క్వారంటైన్ చేసి.. వారితో సంబంధం ఉన్నవారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని కాంగో ప్రభుత్వానికి సూచించింది.








కామెంట్‌లు (0)