బీరూట్ : లెబనాన్ దక్షిణ ప్రాంతం పై ఇజ్రాయిల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అమెరికా మధ్యవర్తిత్వంతో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయిల్ పదేపదే ఉల్లంఘిస్తూ ఈ దాడులకు తెగబడుతుంది. బుధవారం సాయంత్రానికి గత 24 గంటల్లో వివిధ ప్రాంతాలపై జరిపినదాడుల్లో 19 మంది మృతి చెందగా, మరో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ వివరాలను వెల్లడించింది. తీరప్రాంత టైర్ ప్రావిన్స్‌లోని దేర్ ఖనూన్ అల్ నహర్ గ్రామంపై జరిగిన దాడిలో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలతో సహా 10 మంది మరణించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఈ దాడిలో ఒక చిన్నారితో సహా ముగ్గురు గాయపడ్డారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ దాడిలో ఒక ఇల్లు ధ్వంసమైంది, శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు. వీరి మృతదేహాలను కొన్ని గంటల తర్వాత బయటకు తీశారు. అదేవిధంగా మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం దక్షిణ నగరమైన నబాటియేపై జరిగిన మరో వైమానిక దాడిలో నలుగురు మరణించారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలతో సహా మరో 10 మంది గాయపడ్డారు. ఇక, కఫర్ సిర్ గ్రామంలో జరిగిన మూడవ దాడిలో ఒక మహిళతో సహా ఐదుగురు మరణించారు. మరో వైపు లెబనాన్ పై దాడుల విషయంపై ఇజ్రాయిల్ ఇంకా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. కాల్పుల విరమణ ఒప్పందం ఉన్నప్పటికీ దాదాపు ప్రతిరోజూ ఇజ్రాయిల్ దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇజ్రాయిల్ దాడుల కారణంగా లెబనాన్ లో దాదాపు పది లక్షలకు పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. వీరిలో కొందమంది రహదారుల వెంబడి, మధ్యధరా సముద్ర తీరంలో గుడారాలలో తలదాచుకుంటున్నారు.
దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయిల్ దాడులు
21 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 21, 2026, 07:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)