పర్వతాలు కేవలం ప్రకృతి సహజ వైభవం మాత్రమే కాదు, అనేక జనజాతులు, స్థానిక సంస్క ృతులకు నైతిక కేంద్రాలు. పర్వతాలలో నివసించే ప్రజలు తమ ప్రత్యేకమైన సంప్రదాయాలు, భాషలు, జ్ఞానాన్ని తరతరాలుగా సంరక్షిస్తూ వస్తున్నారు. అయితే, ప్రజలు తరచుగా దారిద్య్రం, వైద్య సదుపాయాల కొరత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. నేటి పర్యావరణ పరిస్థితుల్లో పర్వతాలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అందువల్ల, పర్వతాల పరిరక్షణ మనందరి బాధ్యత. సుస్థిరమైన వ్యవసాయ పద్ధతులు, పర్యాటకం, పర్యావరణ సమతుల్యతను కాపాడే ప్రయత్నాల్ని మనం ప్రోత్సహించాలి. పర్వత ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడానికి మార్గాలు వెతకాలి. ప్రతి ఏడాది డిసెంబర్ 11వ తేదీన అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని జరుపుకుంటాము. ఇది పర్వతాల ప్రాముఖ్యతను ప్రపంచానికి గుర్తుచేసే రోజు. 2003లో ఐక్యరాజ్యసమితి ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కథనం..
పర్వతాలు మన గ్రహానికి రక్షక కవచాల్లాంటివి. అవి ప్రపంచంలోని మంచినీటి వనరులను సగానికి పైగా అందిస్తాయి. కోట్లాది మంది ప్రజల జీవనాధారం ఈ పర్వత నదుల మీదే ఆధారపడి ఉంటుంది. ఇవి అడవులు, వృక్షాలు, జంతువుల అపార వైవిధ్యానికి నెలవుగా నిలిచి, జీవవైవిధ్యాన్ని కాపాడుతున్నాయి. వాతావరణ మార్పు వల్ల హిమనదులు కరగడం, అడవుల నరికివేత, మట్టి కరుగుడు, ప్రకృతి వైపరీత్యాలు వంటి పర్యావరణ సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలు పర్వతాలపై మాత్రమే కాకుండా, ప్రపంచ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి.
అంతర్జాతీయ పర్వత దినోత్సవం మనల్ని మనం తెలుసుకునే ఒక అవకాశం. పర్వతాల వల్ల మనకు లభించే వనరుల కృతజ్ఞతలు తెలుపుకోవడం, వాటిని రక్షించే దిశగా ముందడుగు వేయడం ఈ దినోత్సవం యొక్క నిజమైన లక్ష్యం. పర్వతాల భవ్యత, భధ్రతను భవిష్యత్ తరాలను కాపాడుదాం.

ఎత్తయిన శిఖరాలు..
మనదేశంలో ఎత్తయిన శిఖరాల్లో కాంచన్‌జంగా ఒకటి. ఇది మనకు, నేపాల్‌కు సరిహద్దు ప్రాంతంలో ఉంది. 8,586 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే మూడవ ఎత్తయిన శిఖరం. ఈ శిఖరం మనదేశంలోని సిక్కిం రాష్ట్రంలోని గొప్ప హిమాలయ శ్రేణిలో భాగం. ఈ పర్వతం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని డార్జిలింగ్ పట్టణం అందమైన దృ శ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో నందాదేవి శిఖరం రెండవ ఎత్తయిన పర్వతం. గర్వాల్ హిమాలయ ప్రాంతంలో 7,816 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది అందమైన వృక్షజాలం, జంతుజాలానికి నిలయంగా ఉంటుంది. దేశానికి రక్షణగా మరికొన్ని శిఖరాలు ఉన్నాయి.
రక్షణగా హిమాలయాలు..
హిమాలయాలు మనదేశంలో అనేక జీవనదులకు పుట్టినిల్లు. ఎన్నో పుణ్యక్షేత్రాలకు నిలయం. అంతేకాదు విదేశాల నుంచి దేశానికి రక్షణగా ఉన్నాయి. పర్వతారోహకులు ఇక్కడున్న ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడంపైనే ఎక్కువ మక్కువ చూపుతారు. ఇప్పుడు ఈ ప్రాంతం కాలుష్యంతో నిండిపోవడంతో ఓజోన్ పొర దెబ్బతింటోంది. దీంతో భూమి వేడెక్కి, హిమనీ నదులతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న పర్వతాలలో ఉన్న మంచు కరిగి, ఆకస్మిక వరదలు వస్తున్నాయి. సుందర్‌లాల్ బహుగుణ వంటి పర్యావరణ ప్రేమికులు హిమాలయ పర్వతాలను రక్షించి, ప్రకృతి అందాలను కాపాడాలని కొన్నేళ్లు ఉద్యమాన్ని నడిపారు. ఇక్కడ మరిన్ని వేసవి విడిది కేంద్రాలను ఏర్పాటు చేసి, పర్యాటకులకు తగిన సదుపాయాలు, భద్రత కల్పించాలి. వారి సంఖ్య పెరిగితే విదేశీ మారక ద్రవ్యం లభిస్తుంది. ప్రకృతిని ప్రేమించినప్పుడే వాటిని రక్షించగలం. చాలామంది క్లీన్ అండ్ గ్రీనింగ్ పేరుతో పర్వతాలపై ఉన్న ప్లాస్టిక్, చెత్తను తొలగించే కార్యక్రమాలు చేస్తున్నారు.

చైనాలో ప్రాముఖ్యత.. పరిరక్షణ..
చైనాలో టిబెట్, యున్నాన్, సిచ్వాన్ వంటి పర్వత ప్రాంతాలలో అనేకమంది నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజల ప్రధాన జీవనోపాధి వ్యవసాయం, పశుపోషణ. వీరు యాక్ పశువులను పెంచుతూ బార్లీ, గోధుమలు వంటి పంటలను పండిస్తారు. ప్రభుత్వం ఇటీవల ఆర్థిక సహాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహిస్తోంది. దీనితో కొంతమందికి ఉపాధి అవకాశాలు కలిగినా, పర్వత ప్రజల సంప్రదాయ జీవనశైలి మారిపోయే ప్రమాదమూ ఉంది. వాతావరణ మార్పులతో హిమనదులు కరగడం, నీటి వనరులపై ఒత్తిడి వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి.
చైనాలో టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే అతిపెద్ద పీఠభూమి. ఇది ఆసియాకు ”జల గోపురం”గా పేరొందింది. ఎందుకంటే ఇక్కడ నుంచే భారతదేశం, చైనా, బంగ్లాదేశ్‌లలోకి ప్రవహించే అనేక ప్రధాన నదులు ఉద్భవించాయి. టిబెట్ పీఠభూమి ప్రపంచ వాతావరణ వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇక్కడి హిమనదులు, మంచు నిల్వలు అనేక నదీ వ్యవస్థలకు జీవనాధారం. అయితే, వాతావరణ మార్పు వల్ల ఈ హిమనదులు వేగంగా కరుగుతున్నందున, దీర్ఘకాలికంగా నీటి వనరులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తూర్పు కనుమల ప్రాంతం ప్రధాన పర్వత శ్రేణి. ఇక్కడ బహుళ సంఖ్యలో ఆదివాసీ సమాజాలు, ముఖ్యంగా బగత, కోయ, కొండారెడ్డి, సవర లాంటి జనజాతులు నివసిస్తున్నారు. వారి జీవనోపాధి ప్రధానంగా ”పోడు” అని పిలువబడే మారుమూల వ్యవసాయంపై ఆధారపడి ఉంటుంది. ఈ పద్ధతిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తారు. అడవిలో నుండి తేనె, కర్ర, వేరువేరు మూలికలను సేకరించడం కూడా వారి ఆదాయ వనరు. అయితే అటవీ చట్టాలు, సాగుకు అనుకూలమైన భూమి తగ్గిపోవడం వలన వారి జీవనంపై సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం వారికి పంచాయతీల ద్వారా కొన్ని వసతులు చేస్తున్నప్పటికీ విద్య, ఆరోగ్య సదుపాయాలు కల్పించడంలో ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
తూర్పు కనుమల ప్రాంతం జీవవైవిధ్యంతో నిండి ఉంది. ఈ పర్వతశ్రేణులు చాలా ముఖ్యమైన నీటి పారుదల వ్యవస్థలకు నీటిని సరఫరా చేస్తాయి. పర్యావరణ ప్రాముఖ్యతతో తూర్పు కనుమలు అనేక నదులు, సెలయేరులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలోని అడవులు, నేల కాలుష్యాన్ని కాపాడటమే కాకుండా, వర్షాలను ఆకర్షించడంలోనూ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇది ప్రాంతీయ వ్యవసాయం, జలవిద్యుత్ ఉత్పాదనకు ఆధారంగా ఉంది. ఈ ప్రాంతంలో అనేక వన్యజీవి సంరక్షణ కేంద్రాలు, జీవావరణ నిల్వలు ఏర్పాటు చేయబడ్డాయి. అటవీ నిర్మూలన, మట్టి కరుగుడు, అక్రమ గని తవ్వకాలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ, స్థానిక సంఘాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు కొంతమేరకు ఉపయోగపడుతున్నాయి.

ట్రెక్కింగ్.. ట్రెండింగ్..
నిలువెత్తుగా నిలిచి, ప్రకృతి యొక్క అత్యంత అందమైన భూభాగాలలో పర్వతాలు ఒకటి. ఇంత అందమైన ప్రకృతిని ఇష్టపడేవారు పర్వత ప్రాంతాలపై ట్రెక్కింగ్ ఇప్పుడొక ట్రెండింగ్ అంటే అతిశయోక్తి కాదు. ట్రెక్కింగ్ మనసుకు తెలియని అనుభూతిని కలిగిస్తుంది. ఈ మధ్యకాలంలో చాలామంది పర్వతారోహకులు ఎక్కువగా ట్రెక్కింగ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. పర్యాటక సంస్థల వారు గ్రూపులుగా ట్రెక్కింగ్‌కి తీసుకుని వెళుతుంటారు. కొన్ని విద్యాసంస్థలు పిల్లలను ట్రెక్కింగ్ చేసేందుకు ప్రోత్సహిస్తున్నాయి. ఈ ప్రయాణంలో మధ్యలో పచ్చని లోయలు, మెలికలు తిరుగుతున్న గాట్ రోడ్లు, మంచుతో కప్పబడిన శిఖరాలు, అక్కడక్కడ పచ్చని గ్రామాలు, మరెన్నో ప్రకృతి దృశ్యాలు. ఇవన్నీ వారి జీవితంలో సరికొత్త అనుభూతులుగా నిలిచిపోతాయి. రాత్రి కాగానే దారి మధ్యలో గుడారాలు వేసుకుని, అక్కడే తింటూ, నిద్రపోయి, మళ్లీ లేచాక ప్రయాణం కొనసాగించడం.. ఇలా కొన్నిరోజులు చేసే ప్రయాణం నిజంగా ట్రెక్కింగ్ ఓ థ్రిల్లింగ్ అనే చెప్పాలి..
కేరళ జీవవైవిధ్యంలో హాట్‌స్పాట్..
కేరళలోని పశ్చిమ కనుమల భాగంలో అనేక ఆదివాసీ సమూహాలు నివసిస్తున్నాయి. వారిని స్థానికంగా ”ఆదివాసి”లు అని పిలుస్తారు. వీరిలో ఇరుల, కాడర్, కురిచియా వంటి జాతులు ఉన్నాయి. వారి జీవనం ప్రకృతితో మమేకమై సాగుతుంది. సాంప్రదాయిక వ్యవసాయం, సేకరణ వారి ప్రధానజీవిక. కేరళలో ప్రత్యేకించి వైద్య మూలికల సేకరణ, వాటి నుండి తయారు చేసే ఉత్పత్తులు ఒక ముఖ్యమైన ఆర్థిక వనరు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుతో వారికి మరికొంత మద్దతు లభిస్తుంది.

పశ్చిమ కనుమలు కేరళకు అవసరమైన ఎక్కువ వర్షపాతాన్ని పొందడానికి కారణమవుతున్నాయి. ఇది రాష్ట్రం యొక్క వ్యవసాయం (ముఖ్యంగా కొబ్బరి, వేరుశెనగ, మసాలా పంటలు), తాగునీటి అవసరాలను పూర్తిచేస్తుంది. ఈ పర్వతాలు అనేక నదులకు పుట్టినిల్లు. అనేక మూలికలు, వైద్య మొక్కలకు నెలవు. పశ్చిమ కనుమలను రక్షించడానికి అనేక జాతీయ ఉద్యానవనాలు, వన్యజీవి సంరక్షణ కేంద్రాలు, జీవావరణ సంస్థలు స్థాపించబడ్డాయి. అటవీ నిర్మూలన, అక్రమ నిర్మాణాలు, ఏకపంట వ్యవసాయం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నారు. అయినా స్థానికులు, ప్రభుత్వం, పర్యావరణవేత్తలు కలిసి సుస్థిర పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా ఈ సవాళ్లను అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు.
చైనా, తెలుగు రాష్ట్రాలు, కేరళలోని పర్వతాలు ఆ ప్రాంతాల ప్రజల భౌతిక, సాంస్క ృ తిక జీవితంలో గాఢంగా ఇమిడి ఉన్నాయి. మొత్తంమీద ఈ మూడు ప్రాంతాల్లోనూ పర్వత ప్రజలు తమ సంప్రదాయ జ్ఞానాన్ని, సంస్క ృతిని కాపాడుకోవడంతో పాటు, ఆధునిక అవసరాల కోసం సవాళ్లను ఎదుర్కొంటున్నారు. వారి జీవనోపాధిని మెరుగుపరచడానికి సంస్క ృ తిని కాపాడే విధంగా సుస్థిర అబివృద్ధి కార్యక్రమాలు చాలా అవసరం. పర్వతాలు ప్రకృతి యొక్క అమూల్యమైన వారసత్వాలు, పర్యావరణ వ్యవస్థల యొక్క మూలస్తంభాలు. చైనా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, కేరళలో పర్వతాలు వివిధ రకాల ప్రాముఖ్యతలను కలిగి ఉండి, వాటిని సంరక్షించడం ఇప్పటి తరానికి ఒక పెద్ద సవాలు. కేరళలోని పశ్చిమ కనుమల ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత జీవవైవిధ్యం కలిగిన ”హాట్ స్పాట్”గా గుర్తించబడింది. ఇది అనేక ప్రత్యేకమైన, అంతరించిపోతున్న జాతులకు నిలయం. ఈ పర్వత వ్యవస్థలను సంరక్షించడం కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదు, బదులుగా ప్రస్తుత, భవిష్యత్ తరాల శ్రేయస్సు మన కర్తవ్యం.
ప్రియాంక మనోజ్
9866371283








కామెంట్‌లు (0)