FacebookEmailWhatsAppXTelegram
‘అందమైన లోకమని.. రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు’ ఈ పాత సినిమా పాట గుర్తుందా..? ఆ వెంటనే రచయిత ‘అంత అందమైనదేమి కాదు’ అని కూడా తేల్చివేస్తారు. రంగురంగులున్నా, అందంగా ఉందని అందరూ అంటున్నా, అంత అందమైనది ఎందుకు కాదో.. ఆ తరువాత చరణాల్లో ఒకదాని తరువాత ఒకటిగా వివరణ ఇస్తారు. పశ్చిమబెంగాల్‌లోని సుందరవనాలు (సుందర్ బన్) కూడా అంతే! పర్యాటకులకు సుందర్‌బన్ అద్భుతమైన దృశ్యకావ్యం. ‘యమహోనగరి కలకత్తా పురి’ కి అత్యంత సమీపంలో గంగా, బ్రహ్మపుత్ర, మేఘన నదులు బంగాళాఖాతంలో కలిసే అద్భుతమైన ప్రాంతం. ప్రపంచంలోనే అతిపెద్దదైన మడ అడవుల నిలయం. నీళ్లపైన తేలియాడే వనాలతో నిండిన అడవులు. రాజసం ఉట్టిపడే రాయల్ బెంగాల్ పులులు! ఈ ప్రాంతానికే పరిమితమైన అపూర్వ జీవరాశి! కంటినిండా చూడటానికి ఇంకేం కావాలి? కానీ, ఇక్కడే ఎవరికీ పట్టని అంతులేని వ్యథ కూడా అక్కడే ఉంది. వాతావరణ మార్పుల కారణంగా ఈ అడవులనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న స్థానికుల బతుకుల్లో చోటుచేసుకుంటున్న పెను విషాదం దీనికి కారణం. ప్రతి ఏడాది అక్టోబర్ 13ను ‘అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినం’గా జరపాలన్నది ఐక్యరాజ్యసమితి పిలుపు! ఆ నేపథ్యంలో సుందర్‌బన్‌లో చోటుచేసుకుంటున్న విపత్తులను, అక్కడి ప్రజానీకం ఎదుర్కొంటున్న కష్టాలపైనే ఈ కథనం.
భారత్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న సుందర్‌బన్‌కు ప్రపంచ పర్యాటక పటంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. యునెస్కో ఈ ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ప్రపంచంలోనే అతి పెద్ద మడ అడవులు (ఏకదళ వృక్ష సముదాయాలు) ఉన్న ప్రాంతమిది. ఇక అంతులేని జీవవైవిధ్యం ఈ అడవుల సొంతం. రాయల్ బెంగాల్ టైగర్లు, ఉప్పు నీటి మొసళ్లు, కొండ చిలువలు, డాల్ఫిన్‌లు, లెక్కలేనన్ని పక్షిజాతులు. అంతేనా.. వీటన్నింటితో పాటు మనుష్యులు కూడా! ఒక్క భారత భూభాగంలోనే 45 లక్షల మంది నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువశాతం మంది ఆ ప్రాంతంలో దొరికే సహజ వనరులపై ఆధారపడి బతుకుతున్నారు. చేపలు పట్టడం, రొయ్యలు, పీతల వేట, వ్యవసాయం, తేనె సేకరణ వీరి ప్రధాన ఆదాయవనరు. జనాభాలో ఎక్కువ భాగం గ్రామీణ సమూహాలే ఉంటాయి. వీరిలో అత్యధిక శాతం మంది దారిద్య్రరేఖకి దిగువన జీవిస్తున్నారు. వాతావరణ మార్పుల కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు వీరి జీవితాలను కష్టాల సుడిగుండాల్లో పడేస్తున్నాయి. ఈ కష్టనష్టాలపైనే ‘ఎర్త్ జర్నలిజం నెట్‌వర్క్ (ఇజెఎన్)’ ఇటీవల దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన జర్నలిస్టులతో సుందర్‌బన్‌లో వర్క్‌షాప్ నిర్వహించింది.
వాతావరణ మార్పులపై కవరేజిని మరింత విస్తృతం చేయడంతో పాటు, బాధితులు ఎదుర్కొంటున్న ఆర్థికేతర నష్టాల తీవ్రతను చర్చించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ వర్క్‌షాపులోనే ‘అందమైన అడవిలో.. స్థానికులు ఎదుర్కొంటున్న అంతులేని వ్యథలు’ ఎన్నో చర్చనీయాంశమయ్యాయి.
ఐక్యరాజ్యసమితి పిలుపు వెలుగులో..
ప్రతి సంవత్సరం అక్టోబరు 13న ‘అంతర్జాతీయ విపత్తు ప్రమాద తగ్గింపు దినం’ జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి కొన్ని సంవత్సరాల క్రితం పిలుపునిచ్చింది. ప్రతి ఏడాది ఒక్కో నినాదమిచ్చి, ఆ మేరకు కార్యక్రమాలు చేపట్టాలని ప్రపంచ దేశాలను ఐక్కరాజ్య సమితి కోరింది. దానిలో భాగంగానే ఈ ఏడాది ‘విపత్తులకు కాదు.. ఎదుర్కోవడానికి నిధులు’ (ఖీబఅస =వరఱశ్రీఱవఅషవ.. చీశ్‌ీ ణఱఝర్‌వతీర) అని పిలుపునిచ్చింది. విపత్తులు వచ్చిన తరువాత కాదు.. ఆ ముప్పును ఎదుర్కోవడానికి నిధులు సమకూర్చాలన్నది ఈ నినాద సారాంశం. సముద్ర మట్టం పెరగుదల సుందర్‌బన్‌కు పొంచి ఉన్న అతి పెద్ద ముప్పు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ధ్రువప్రాంతాల మంచు కొండలు వేగంగా కరుగుతున్నాయి. ఈ కారణంగా 170చ.కి.మీ భూభాగం ఇప్పటికే సముద్రంలో కలిసిపోయింది. తాజా అంచనాల ప్రకారం ఈ శతాబ్దం చివరికి సముద్ర మట్టం సగటున ఒక మీటరు వరకూ పెరిగే అవకాశం ఉంది. ఇది సుందర్‌బన్ మొత్తం మునిగిపోవడానికి కారణమవుతుంది. దాదాపు 200 ద్వీపాలలో 100కి పైగా ద్వీపాలు బంగాళాఖాతంలో మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే మునిగిపోయిన భూభాగం కారణంగా సుమారు 15 లక్షల మంది, తమ నివాసాలను శాశ్వతంగా వదిలి వెళ్లవలసి వచ్చింది. ఈ సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. ముంచుకొస్తున్న ఈ ముప్పును ఎదుర్కోవడానికి తీసుకుంటున్న చర్యలేమిటి? అసలు ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలేమిటి? ఐక్యరాజ్యసమితి పిలుపు ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది కదా!

తుపానులు.. నష్టం..
రెండు దశాబ్దాలుగా సుందర్‌బన్ ప్రాంతం పెద్ద తుపానుల బారిన పడింది. ఐలా(2009), బుల్‌బుల్(2019), అంపాన్(2020), యాస్(2021), రెమాల్(2024) వంటివి ఇక్కడి ప్రజలను, ప్రాణులని తీవ్రంగా ప్రభావితం చేశాయి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ‘ఐలా’ తుపానుకి పెద్తఎత్తున వరదలు సంభవించాయి. ఇళ్లు దెబ్బతిన్నాయి. ఉప్పు నీరు పొలాల్లోకి చేరి పంటలన్నీ ధ్వంసమయ్యాయి. స్వచ్ఛమైన తాగునీరు కరువైంది. ఈ తుపానులో సుమారు 190 మంది మరణించినట్లు అంచనా వేశారు. లక్షలాది మంది ప్రజలు ప్రభావితమయ్యారు.
గడిచిన 30 ఏళ్లల్లో సంభవించిన తుపానులకు, వరదలకి సుందర్‌బన్ ప్రాంతం సుమారు 100 కిలోమీటర్ల భూభాగాన్ని కోల్పోయింది. తుపానులు వచ్చిన ప్రతిసారీ తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక్కడ ఎక్కువశాతం మంది నిరుద్యోగులు, తక్కువ ఆదాయమార్గాలు ఉన్నవారు. చేపల వేట తప్ప వీరికి మరో ఉపాధి మార్గం లేదు. భూమి ఉన్నా దాని మీద ఎటువంటి హక్కులూ లేవు. ఇంకా ఇక్కడ మౌలిక వసతులు, వనరుల లేమి కొట్టొచ్చినట్లు కనపడుతుంది. ఈ పరిస్థితుల్లో తుపానుల ప్రభావంతో జీవనోపాధి లేక, ప్రజలు ఎక్కువగా వలసలకి మొగ్గు చూపుతున్నారు. అలా వలసవెళ్లిన కుటుంబాల నుండి కొంతమంది మహిళలు వర్క్‌షాప్‌కి వచ్చినప్పుడు వాళ్లందరూ ఒకటే బాధ వ్యక్తం చేశారు. కుటుంబాలు విడిపోయి, తీవ్ర మానసిక వేదన అనుభవిస్తున్నట్లు చెప్పారు. గిరిజన మహిళ సుప్రియ గిరి మాట్లాడుతూ.. ‘మాది వ్యవసాయ కుటుంబం. తుపానులు వచ్చినప్పుడు ఉప్పు నీరు గ్రామాల్లోకి, పొలాల్లోకి చేరింది. లవణీయత పెరిగి పంటలు సరిగ్గా పండలేదు. దీంతో నా భర్త బెంగళూరు ఫ్యాక్టరీ పనికి వెళ్లాడు. ఇక్కడ నేను, పిల్లలు మిగిలాం’ అని చెప్పారు. సుప్రియకి నిండా ఇరవై ఏళ్లు కూడా ఉన్నట్లు అనిపించలేదు. ఈ చిన్న వయసులోనే ఆమెపై ఇద్దరు బిడ్డల పోషణ, కుటుంబాన్ని సాకడం, భర్త నుండి విడిగా ఉండడం వంటి భారాలు పడ్డాయి. ఈ పరిస్థితులన్నీ ఆమె మానసిక స్థితిపై తీవ్రంగా ప్రభావం చూపిస్తాయని వర్క్‌షాప్ నిర్వాహకుల్లో ఒకరైన జయంత బసు వివరించారు.
చందోల్, సుప్రియ మిదా, శివానీ గిరి, మీనాదేవి వంటి దాదాపు పది మంది మహిళలు వర్క్‌షాప్‌లో తమ బాధలు చెప్పుకున్నారు. వాళ్ల భర్తలంతా ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన ఈ మహిళల్లో చాలామంది వ్యవసాయ పనులు చేసుకుంటూనే పచ్చళ్లు అమ్ముకుంటూ, టూరిస్టులకి మార్గనిర్దేశం చేస్తూ రకరకాల చిన్న చిన్న పనుల్లో ఆదాయమార్గాలు వెతుక్కుంటున్నారు. ఐలా (2009లో) తుపాను వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వం ఈ కుటుంబాలలో ఒక్కొక్కరికి 16 కేజీల బియ్యం చొప్పున పంపిణీ చేస్తున్నట్లు జయంత్ చెప్పారు. అయితే ఈ సాయం వారి పరిస్థితులని ఏమాత్రం మెరుగుపరచదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వన్యమృగాల దాడులు..
సుందర్‌బన్.. పులులు, మొసళ్లు వంటి అనేక అడవి జంతువులకి ఆవాసంగా ఉంది. దీంతో చేపల వేటకి వెళ్లే ప్రజలు తరచూ వన్యమృగాల దాడులకు గురవుతుంటారు. మైనమాట్ అధ్యయనం ప్రకారం 2008-2022 మధ్య కాలంలో 275 పులుల దాడులు జరిగాయి. వాతావరణ మార్పులు చేపల వేటపై పెను ప్రభావాన్ని చూపిస్తున్నాయి. తీరంలో లభించే చేపజాతులు దొరక్క, ప్రజలు అడవి వెంట ఎక్కువదూరం ప్రయాణం చేయాల్సి వస్తోంది. పులులు ఉండే చోటుల్లో కూడా వేట కొనసాగించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వేట కోసం ప్రాణాలను పణంగా పెట్టిన ఎందరో మత్య్సకారులు అక్కడ కనిపిస్తారు.
వాతావరణ మార్పులతో గత దశాబ్దంలో సుందర్‌బన్ ప్రాంతంలో ఏడాదికి సగటున మూడు సెంటీమీటర్ల సముద్రమట్టం పెరిగింది. ఇది ప్రపంచ సగటు కంటే చాలా వేగంగా పెరిగింది. ఫలితంగా సుందర్‌బన్‌లోని అనేక ద్వీపాలు సముద్రంలో మునిగిపోయాయి. వేలాది మంది ప్రజలు తమ నివాసాలను కోల్పోయారు. స్థానిక పర్యావరణ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. మడ వృక్షాలు నీటిలో కొట్టుకుపోయాయి. దీంతో ఆవాసాలు కోల్పోయిన అడవి జంతువులకి, మనుషులకి మధ్య దూరం తగ్గిపోయింది. దీంతో పులుల దాడులు పెరిగిపోయాయి.
‘టైగర్ విడోస్’
వ్యవసాయ భూములు కోల్పోయిన పురుషులు చేపల వేటకి వెళ్లి, పులులకి బలవుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో భర్తని కోల్పోయిన స్త్రీలు పెరుగుతున్నారు. వీరిని ‘టైగర్ విడోస్’ అని పిలుస్తారు. మన దేశ సుందర్‌బన్ ప్రాంతంలో సుమారు 3000 నుండి 4000 మధ్య టైగర్ విడోస్ ఉన్నారని అంచనా.
ప్రతి ఏడాది పులుల దాడికి 30 నుండి 50 మంది బలవుతున్నారు. భర్తల మృతితో పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబాల్లోని స్త్రీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులని ఎదుర్కొంటున్నారు. సామాజిక కళంకం వారిని మానసికంగా మరింత కుంగదీస్తోంది. ప్రభుత్వ పరిహారం, న్యాయ సహాయం పొందడంలో కష్టాలను ఎదుర్కొంటున్నారు.
సుందర్‌బన్‌లో ఏ గ్రామంలో చూసినా ‘టైగర్ విడోస్’ కనిపిస్తారు. వీరంతా 30 నుండి 50 ఏళ్ల లోపువారు. రాజాత్ జుబ్లీ పాతో పారీ గ్రామంలో నివసిస్తున్న ఓ మహిళ భర్త 20 ఏళ్ల క్రితం పులిదాడిలో మరణించాడు. అయితే అతని శవం దొరకలేదు. దీంతో ప్రభుత్వం డెత్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. అతను చనిపోయేనాటికి పిల్లలు బాగా చిన్నవాళ్లు. దీంతో తను పడ్డ వేదనని ఆ మహిళ ఇలా వివరించింది. ‘నా భర్త బతికుంటే పిల్లలని బాగా చదివించుకునే దాన్ని. అతను లేకపోవడం వల్లే నా బిడ్డలు చిన్నచిన్న పనులు చేసుకుని పొట్ట పోసుకుంటున్నారు’ అని చెబుతున్నప్పుడు కూడా ఆమె కన్నీళ్ల పర్యంతమైంది. ప్రభుత్వం దృష్టిలో ఆమె భర్త మరణించినట్లు ఎటువంటి ధ్రువపత్రం లేకపోవడం వల్ల ఈ మహిళకి ప్రభుత్వం నుండి ఎలాంటి పరిహారం అందలేదని వర్క్‌షాప్ నిర్వాహకులు చెప్పారు. జీవనాధారం కోల్పోయి, సామాజిక కళంకంతో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇలాంటి మహిళలు అక్కడ ఎంతోమంది ఉన్నారు.
పులి నాపై దాడి చేసింది
తీరంలో చేపలు దొరక్క ఎక్కువ దూరం ప్రయాణం చేస్తున్న మత్య్సకారులకు పులులు తారసపడడం అక్కడ సర్వసాధారణం. అలా 18 ఏళ్లుగా చేపల వేట చేస్తున్న ఆశిష్ దాస్ తన ప్రయాణంలో ఎన్నోసార్లు పులులను చూశాడు. ఒకసారి పులి అతనిపై దాడి కూడా చేసింది. తృటిలో ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. ఈ ఘటన జరిగి మూడేళ్లు కావస్తోంది. ఇప్పటికీ ఆ సంఘటన అతన్ని పట్టిపీడిస్తోంది. వేటకి వెళ్లేందుకు సరైన వలలు, పడవలు లేకపోవడం వల్లే పులుల నుండి కాపాడుకోలేకపోతున్నామని ఆశిష్ వాపోయాడు. సాధారణంగా చేపల వేట కోసం మత్య్సకారులు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చాలామంది కార్మికులు లైసెన్స్ లేకుండానే వేట కొనసాగిస్తారు. అలాంటివారు పులి దాడిలో గాయపడినా, మరణించినా వారికి ప్రభుత్వం నుండి పరిహారం అందదు. అయితే ఆశిష్‌కి లైసెన్స్ ఉంది. అయినా పరిహారం అందలేదు. ప్రమాదం జరిగినప్పుడు తోటి మత్య్సకారులు ఫోనులో అధికారులకు సమాచారం అందించారు. నిషేదిత ప్రాంతంలో సెల్‌ఫోను వినియోగించినందున ఆశిష్ పరిహారానికి నోచుకోలేదు. ఫలితంగా చికిత్స కోసం అతను ఇల్లు, ఉన్న కాస్త పొలాన్ని అమ్మేశాడు. ఇంకా చికిత్స పూర్తికాలేదు. తలపై శస్త్రచికిత్సలు చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అతని మానసిక పరిస్థితి కూడా దెబ్బతింది.
విద్యావ్యవస్థ కుదేలు..
సుందర్‌బన్ బాలీ ద్వీపంలో ఉన్న ‘సుందర్‌బన్ ఎకో ఫారెస్ట్ రిసార్ట్’ నుండి 40 నిమిషాలు బోటు మీద ప్రయాణం చేస్తే ‘సిల్వర్ జూబ్లీ’ ఐలాండ్ వస్తుంది. అక్కడ ఐలాండ్ పేరుతోనే 25 ఏళ్లుగా ప్రాథమికోన్నత పాఠశాల పనిచేస్తోంది. తుపానులు వచ్చినప్పుడు ఈ స్కూలుని పునరావాస కేంద్రంగా ఉపయోగిస్తున్నారు. పునరావాస శిబిరం ఉన్నన్ని రోజులూ స్కూలు నిర్వహణ జరగదు. పైగా వలసల వల్ల పిల్లలు చదువుకి దూరమవుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానం వల్ల పిల్లలు చాలా ఫోర్స్‌గా తొమ్మిదవ తరగతి వరకూ వచ్చేస్తున్నారు. అయితే వారిలో విద్యా నైపుణ్యం తగిన స్థాయిలో ఉండడం లేదు. గతంలో ఉన్న హాజరు శాతానికి ఇప్పుడు స్కూలుకి వస్తున్న పిల్లల సంఖ్య చూస్తే, ఆందోళన కలిగించేలా ఉంది. ‘ఒకప్పుడు 1500 మంది ఉన్న సంఖ్య ఇప్పుడు 650కి పడిపోయింది’ అని మాస్టార్లు చెప్పారు.
పటిష్టమైన మౌలిక వసతులు లేవు..
రోడ్లు, భవనాలు, ఆస్పత్రులు, విద్యుత్ సరఫరా వ్యవస్థలు వంటి మౌలికవసతులు విపత్తులను తట్టుకోగలవిగా ఉండాలి. కానీ సుందర్‌బన్‌లో ఆవిధమైన ప్రత్యేక రక్షణా చర్యలు ఎక్కడా కనిపించలేదు.
చీకటిపడితే అక్కడి రోడ్లన్నీ అంథకారమవుతున్నాయి. చిన్న చిన్న టార్చ్‌లైట్ల వెలుగులోనే మహిళలు, పిల్లలు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్తున్నారు. వన్యమృగాలు, విషసర్పాలు సంచరించే అలాంటిచోట ఈ పరిస్థితి చాలా ప్రమాదకరం.
ఆరోగ్య రక్షణ అంతంతమాత్రమే..
ఇక్కడి ప్రజలకి ఆరోగ్య రక్షణ ఏ స్థాయిలో అందుతుందో అక్కడి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని చూస్తే అర్థమవుతుంది. సాధారణ జలుబు, దగ్గు, గర్భిణీలకి మాత్రమే ఇక్కడ వైద్యం అందుతోంది. ఏదైనా సీరియస్ కేసు వస్తే పడవ మీద గంటసేపు ప్రయాణం చేసి, గొసాబా జిల్లా ఆస్పత్రికి వెళ్లాల్సిందే! ఇక్కడ తాగునీటి కొరత ఎక్కువగా ఉంది. సుమారు 400 నుండి 500 అడుగుల లోతు వరకు పైపులైను వేస్తున్నారు. అయినా సరఫరా అంతంతమాత్రమే. దీంతో గుంటల్లో నీరే స్నానాలు, బట్టలు ఉతకడం వంటి ఇతర కుటుంబ అవసరాలకు వాడతారు. ఫలితంగా చర్మవ్యాధులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ వచ్చే తుపానులు, కుటుంబాలు విడిపోవడం, మహిళలపై అధిక భారం పడడం వల్ల ఎక్కువగా స్త్రీలు మానసికంగా కుంగిపోతున్నారు. దీంతో ‘ఈ ప్రాంతంలో విధిగా ”మానసిక ఆరోగ్య అవగాహన శిబిరం” నిర్వహిస్తున్నాం’ అని పిహెచ్‌సిలోని ఆశా కార్యకర్త చెప్పారు.
ఆందోళనకర రీతిలో జీవవైవిధ్యం..
సముద్రమట్టం పెరుగుదల, ఉప్పెన ప్రభావం, వర్షాల మార్పులు వంటివి సుందర్‌బన్ ప్రాంతంలో వాతావరణ సంబంధిత నష్టాలకు కారణమవుతున్నాయి. ఈ మార్పులు పర్యావరణ సమతుల్యతని దెబ్బతీస్తున్నాయి.
జీవవైవిధ్యంలో వస్తున్న ఆందోళనకర మార్పులు పర్యావరణ అసమతుల్యతకి దారితీస్తాయి. ఫలితంగా దీర్ఘకాల వ్యాధులు సంభవిస్తాయి. జీవన ప్రమాణాలు తగ్గుతాయి. మనుషుల్లోనే కాదు, ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న అన్ని ప్రాణులకు ఇది వర్తిస్తుంది. కొన్ని అరుదైన జాతులు అంతరించిపోతున్నాయి. వాతావరణ మార్పులు, జీవవైవిధ్యంపై ఎంతటి ప్రభావం చూపిస్తున్నాయో పశ్చిమబెంగాల్ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ డాక్టర్ హెచ్.ఎస్. దేబ్‌నాథ్ ఇలా వివరించారు ‘సుందర్‌బన్ జీవవైవిధ్యానికి ఎక్కువగా గురవుతున్న ప్రాంతం. ఇక్కడ మడ అడవులు తగ్గిపోతున్నాయి. అరుదైన వృక్ష సంపద కనుమరుగైపోతోంది. తుపానులు, వరదలు,
తీరం కోత, నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం వంటివన్నీ ఇక్కడి జీవవైవిధ్యంపై గణనీయమైన మార్పులను చూపిస్తున్నాయి’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సంస్కృతి, సాంప్రదాయాలు అంతరించిపోతున్నాయి..
వాతావరణ మార్పుల వల్ల వలసలు పెరిగి, సుందర్‌బన్ ప్రజలు తమ సాంప్రదాయ జీవన విధానాలను, పండుగలని, వృత్తులని వదులుకోవాల్సి వస్తోంది. విపత్తులు వారి కుటుంబాలని విడగొడుతున్నాయి. సమాజంలో ఒంటరితనం పెరిగిపోతోంది. ‘మోనో బీబీ’ వీరి ఆరాధ్య దేవత. అలాగే పలు సాంస్కృతిక కళారూపాలు ఈ ప్రాంతవాసుల ఆనవాళ్లు. వలసల వల్ల కళాకారులు లేక ఆయా సాంప్రదాయాలు ఇప్పుడు కనిపించడం లేదు. పూర్వీకులు పూజించిన, ప్రత్యేక వారసత్వం అనుసరించిన ఎన్నో ఆచారాలు, ఆలయాలు.. తుపానులకు, వరదలకు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయినట్లు గ్రామస్తులు వాపోయారు. ‘నీటిలో లవణీయత పెరిగి పంటలు పండక వ్యవసాయ కుటుంబాల వారే ఎక్కువగా వలసలు వెళ్తున్నారు. ఫలితంగా వ్యవసాయంతో ముడిపడి ఉన్న ఎన్నో సాంప్రదాయాలు అక్కడ కనిపించకుండా పోయాయి’ అని ఈ ప్రాంత సాంస్కృతిక వారసత్వం కనుమరుగవ్వడంపై అధ్యయనం చేసిన జోధ్‌పూర్ యూనివర్శిటీకి చెందిన తులిన్ ఘోష్ వివరించారు.

లక్ష్యం దిశగా అడుగులు వేయాలంటే..
సుందర్బన్ తీర ప్రాంతంలో వాతావరణ మార్పుల కారణంగా సంభవించే నష్టాలను ముందస్తుగా గుర్తించాలి. వాటిని ఎదుర్కొనడానికి సమగ్ర విధానాలు రూపొందించాలి. ఈ విధానాలు సమాజం, సాంస్కృతిక, సామాజిక, వాతావరణ సంబంధిత అంశాలని పరిగణనలోకి తీసుకోవాలి.
మడ అడవుల సంరక్షణ.. పునరుద్ధరణ : తుపానుల ప్రభావాన్ని తగ్గించే ప్రకృతి ఆధారిత చర్యలను అంటే కోల్పోయిన వనాల చోట కొత్త వృక్షాలని నాటాలి. వాటి సంరక్షణని బాధ్యతగా వ్యవరించాలి. ఇది తొలి అడుగుగా ఉండాలి.
ధ్రుడమైన తీర ప్రాంతాలు : సముద్ర నీటిమట్టం పెరగడం వల్ల తీరప్రాంతాలు కోతకి గురవ్వకుండా దక్షిణ మోడల్ డిజైన్లు, నీటి ప్రవాహాల మేనేజ్మెంట్ తీరాలను గమనించాలి.
ముందస్తు హెచ్చరికలు : తుపాను హెచ్చరికలు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి. సురక్షిత ప్రాంతాలకు జనాలు వేగంగా తరలివెళ్లే చర్యలు తీసుకోవాలి.
ఇంటి నిర్మాణాలు : సుందర్బన్ ఇళ్లన్నీ ఇటుకరాతి కట్టడాలు. తుపాను ప్రభావానికి ఇవి కొట్టుకుపోకుండా కాంక్రీట్ వంటి కట్టడాలని ప్రోత్సహించాలి.
శాస్త్ర ఆధారిత ప్రణాళికలు : సముద్ర మట్టం పెరుగుదల, వర్ష సరఫరా మార్పులు, ఉప్పెన ప్రవాహం మార్పులపై అధ్యయనాలు వేగవంతం చేయాలి. ‘హ్యుమంటేరియన్ ప్రాక్టీస్ నెట్‌వర్క్’ కొన్ని అధ్యయనాల ప్రకారం సుందర్బన్ ప్రాంతంలో సముద్ర నీటిమట్టం వార్షిక పెరుగుదల 5.37 మి.మీ నుండి 12 మి.మీగా ఉంది.
విపత్తులకు ఎక్కువగా ప్రభావితమయ్యే దేశాల్లో మనదేశం ఒకటి. ప్రతి ఏడాది తుపాన్లు, వరదలు, భూకంపాలు, అగ్నిప్రమాదాలు, కరువులాంటి విపత్తులకి కోట్లాది మంది ప్రజలు ప్రభావితం అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డిఎంఎ), రాష్ట్ర స్థాయిలో ‘ఎస్‌డిఎంఎ’; జిల్లా స్థాయిలో ‘డిడిఎంఎ’ ముందస్తు చర్యలు తీసుకునే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. అయితే ఈ చర్యలు ప్రజల జీవితాలను ఎంతవరకు కాపాడగలుగుతాయి అనేదే ప్రశ్న.
జ్యోతిర్మయి
8332925496








కామెంట్‌లు (0)