test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపర్యావ’రణం’లో స్త్రీ

15 మే, 2026

పర్యావ’రణం’లో స్త్రీ
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 15, 2026, 07:53 అపరాహ్నం | 4 నిమిషాల చదవడం

ఇంటా బయటా నిత్యం సతమతమయ్యే మహిళకు పర్యావరణంలో వస్తున్న మార్పులు మరింతగా బాధలను పెంచుతున్నాయి. ప్రకృతితో మనిషి సంబంధం గురించి మాట్లాడేటప్పుడు మహిళల గురించి చాలామంది ప్రస్తావించరు. కానీ ప్రకృతితో మహిళల సంబంధం శాశ్వతమైనది. వారి రోజువారీ జీవితం పర్యావరణంతోనే ముడిపడి ఉంటుంది. పర్యావరణంలో వస్తున్న తీవ్ర మార్పులు భవిష్యత్తు ప్రమాదాలుగా చాలామంది అభివర్ణిస్తారు. కానీ అవి మహిళల జీవితాలపై ఇప్పటికే ప్రభావాన్ని చూపిస్తున్నాయి.

ప్రకృతి వైపరీత్యాలకు ప్రజా జీవితం అల్లకల్లోలం అవుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ప్రధానంగా ఇలాంటి సందర్భాల్లో మహిళలు మరిన్ని ఇబ్బందులను ఎదుర్కొంటున్న వాస్తవం ప్రతి ఒక్కరూ గమనించాలి.


విజయవాడ వరద ముంపు


ఏడాదిన్నర క్రితం విజయవాడను ముంచెత్తిన వరద బీభత్సం ఇంకా మన కళ్ల ముందే ఉంది. 2024 ఆగస్టు 31న ఒకే రోజున (29 సెం.మీలకి పైగా) కురిసిన కుంభవృష్టికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బుడమేరు వరద ఉధృతికి లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వ అంచనాల ప్రకారం ఒక్క విజయవాడలోనే 2,70,000 మంది బాధితులున్నారు.

ఉదయం టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లి ఇంటికి తిరిగొచ్చేలోపే పీకల్లోతు నీళ్లు కట్టలు తెంచుకుని, వీధులను నింపుకుని ఇళ్లల్లోకి వచ్చేశాయి. చాలామంది ఇంకా నిద్ర నుండి మేల్కొనక ముందే వరద ఇంటిని ముంచేసింది. దిక్కుతోచని జనం ఎక్కడ సామాను అక్కడే వదిలేసి, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. నాటి పరిస్థితులను ప్రత్యక్షంగా చూసిన వాళ్లకు ఈ దృశ్యాలు ఇంకా కళ్ల ముందు మెదులుతూనే ఉంటాయి. ఈ ఉపద్రవానికి అనేక కుటుంబాలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. కుటుంబం మొత్తం రెక్కలు ముక్కలు చేసుకుని, కష్టపడి కట్టుకున్న ఇళ్లు కళ్ల ముందే చెదిరిపోయాయి. పైసా పైసా కూడేసి సమకూర్చుకున్న సామానుని బురద ముంచేసింది. ఇంత భయానక వేళ వరద ప్రభావిత ప్రాంతాల మహిళల కష్టాలు మాటల్లో చెప్పలేం. ఇల్లంతా బురద, సామానంతా బురద. కట్టుబట్టలతో రోడ్డున పడిన కుటుంబాలు ఎన్నో. ఈ బురదను వదిలించుకోవడం, మరోపక్క చాలీచాలని సామానుతో ఇంటిని నడిపించడం ఆ మహిళలను ఎంతో వేదనకు గురిచేసింది.

ఇంట్లో ఎవరికి ఏ అవసరమొచ్చినా ఆగమేఘాల మీద పనులు చేసి, అందరికీ అన్నీ సమకూర్చే గృహిణులు వరద వేళల్లో పిల్లలు ఆకలితో అలమటిస్తున్నా ఇంత అన్నం పెట్టలేక విలవిలలాడారు. వరద అనంతరం ఇన్‌ఫెక్షన్లు సోకి, ఎంతోమంది మహిళలు అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిపాలయ్యారు. భర్త, పిల్లల ఆరోగ్యం పాడై ఎంతో తల్లడిల్లారు. ఇన్‌ఫెక్షన్‌కి సింగ్‌నగర్‌లో ఒక మహిళ మృతి చెందితే, తన ఒక్కగానొక్క కూతురు దిక్కులేనిది అయ్యింది. పీకల్లోతు వరదలో బిడ్డని కనేందుకు ఒక గర్భిణీ అవస్థలు పడుతూ ఆస్పత్రికి వెళ్తున్న హృదయ విదారక దృశ్యాలు నాడు మీడియాలో కనిపించాయి.

ఆ ఒక్కరోజు కురిసిన వానకి రాష్ట్రంలో 6,44,536 ప్రజలు వరదల బారిన పడ్డారని అధికారులు అంచనా వేశారు. అంటే ఈ విషాదం ఎన్ని కుటుంబాల్లోని మహిళలకు తీరని వేదన మిగిల్చిందో అర్థం చేసుకోవచ్చు. ఈ బాధ, దు:ఖం వరద తర్వాత ఆ కుటుంబాలను వెంటాడుతూనే ఉంది. అనారోగ్యం, ఉపాధి కోల్పోవడం, పిల్లల స్కూలు ఫీజులు, పాడైపోయిన బట్టలు, వస్తువులు కొనుక్కోలేని దుస్థితి.. ఇలా ప్రతి ఒక్కటీ ఆ మహిళలకు తీరని కష్టాన్ని తెచ్చిపెట్టింది.


మత్య్సకార మహిళలు


మన రాష్ట్రంలోని 1000 కిలోమీటర్ల మేర సుదీర్ఘ తీరం వెంబడి నివసించే ఎందరో మత్య్సకార మహిళలు పర్యావరణ ప్రకోపాలకి నిత్యం గురవుతూనే ఉంటారు. తుపానుల సమయంలో ఈ మహిళల బాధలు సాధారణం కంటే రెట్టింపు అవుతాయి. వేటకి వెళ్లిన సహచరుని తుపాను మింగేస్తే, రెండు నెలల వేట నిషేధంతో కుటుంబం, పిల్లల భారమంతా ఆ ఇంటి మహిళపైనే పడుతుంది. కూలిపోయిన ఇంటిని నిలబెట్టేందుకు తానే నిట్టాడుగా నిలబడుతుంది.

మార్కెట్‌కు వెళ్లి చేపలు బాగు చేయడం, కేజీల కొద్దీ చేపల బుట్టను నెత్తి మీద పెట్టుకుని ఊరూరా తిరగడం ఆమె దినచర్యగా మారుతుంది. వేకువజామునే నిద్ర లేచి, వంటావార్పూ చేసి, పిల్లలను బడికి పంపించే మత్య్సకార మహిళలు పగలంతా కుటుంబపోషణ కోసం కష్టపడాలి. తెల్లవారితే ప్రారంభమయ్యే ఆమె చాకిరీ అర్ధరాత్రికీ పూర్తవ్వదు. వేటకి సముద్రంలోకి వెళ్లిన భర్త కోసం ఎదురుచూపులు ఆమెపై పడే అదనపు ఒత్తిడి.

వాతావరణ మార్పులతో చేపల లభ్యత తక్కువగా ఉన్నప్పుడు కుటుంబాన్ని పోషించుకునేందుకు ఈ మహిళలు హోటళ్లలో వంట, ఇళ్లల్లో పని, కూలిపని చేయాల్సి వస్తోందని ఈ సమస్యపై జర్నలిస్టిక్‌ అధ్యయనాలు చెబుతున్నాయి. ‘బ్లూ ఎకానమీ’ రిపోర్టు ప్రకారం ఆ మహిళలు రోజుకు 12-14 గంటలు పనిచేయాల్సి వస్తోంది. ఆరోగ్యపరంగా ఇది వారికి పెద్ద ప్రమాదం. నడుం నొప్పి, మెడ, కాళ్ల నొప్పులు, అలసట, మానసిక ఒత్తిడి పెరుగుతున్నాయని విశ్లేషణలు వచ్చాయి.


ఆదివాసీ సమాజాల్లో ప్రకృతిని సంరక్షించే ఆదివాసీ మహిళలకి పర్యావరణ


మార్పులు తీరని ముప్పును తెచ్చిపెడుతున్నాయి. ఒకప్పుడు పంటలు, దట్టమైన పచ్చదనంతో సమృద్ధిగా ఉన్న అల్లూరి సీతారామరాజు, పోలవరం, పార్వతీపురం మన్యం తదితర జిల్లాల్లోని ఎత్తయిన గిరిజన ప్రాంతాల్లో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజన రైతులు వర్షాధార పంటలపై ఆధారపడి జీవిస్తారు. వాతావరణంలో చోటుచేసుకుంటున్న అనూహ్య మార్పుల్లో పెరుగుతున్న వేడి, నేలలోని తేమను హరిస్తోంది. అకాల వర్షాలు పంటలను దెబ్బతీస్తున్నాయి. నీటి కొరతా తీవ్రమైంది. ఎపి-ఎస్‌ఎపిసిసి (2020) ప్రకారం కీలక పంటలు పండించే రబీ నెలల్లో వర్షపాతం స్థిరంగా తగ్గుతోందని అంచనా వేసింది. అకస్మాత్తుగా కురుస్తున్న భారీ వర్షాలు నేల కోతకు, వరదలకు కారణమవుతున్నాయి.

ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (2019) ప్రకారం అగ్నిప్రమాదాలు అధికంగా గురయ్యే అటవీప్రాంతంగా మన రాష్ట్రాన్ని గుర్తించారు. తూర్పు కనుమల వంటి ప్రాంతాలలో (కర్నూలు, తిరుపతి (శ్రీశైలం), విశాఖపట్నం) పొడి ఆకురాల్చే అడవులు ఉండడం ఈ పరిస్థితికి కారణం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అటవీ అగ్ని ప్రమాదాలు ఎక్కువగా వుంటాయని నివేదిక పేర్కొంది.

క్షీణిస్తున్న వనరులు, పునరావృతమయ్యే అటవీ మంటలు, దీర్ఘకాల పొడి కాలాలు తేనె, వెదురు, ఔషధ మూలికల సేకరణను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. జీవవైవిధ్యాన్ని తగ్గిస్తున్నాయి. తూర్పు గోదావరి వంటి జిల్లాల్లో పారిశ్రామిక ప్రాజెక్టులు, మైనింగ్‌, నిల్వ విద్యుత్‌ ప్రాజెక్టుల కోసం భారీ ఎత్తున భూసేకరణ, ఎర్రవరం, పెదకోట వంటి ప్రాజెక్టుల్లో స్పష్టంగా కనిపిస్తున్న స్థానభ్రంశం, జీవనాధార నష్టానికి కారణమవుతోంది.

ఉపాధి కోసం పురుషులు వలసలు వెళ్లి రోజువారీ కూలీకి మారిపోతున్నారు. ఈ పరిస్థితులు ఆ కుటుంబాల్లోని మహిళల పరిస్థితిని మరింతగా దిగజారుస్తున్నాయి. ఆహారం, మేత, కట్టెలను సేకరించడం మహిళలపై అదనపు భారాలను మోపుతోంది. నీటి వనరులు అదృశ్యమై గృహ అవసరాల కోసం నీటిని పొందడానికి సుదూరం వెళ్లాల్సివస్తోంది. ఈ అదనపు శ్రమ వారి శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది.

అకాల వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నప్పుడు ప్రసవం కోసం ఆస్పత్రికి వెళ్లడం గర్భిణీకి ప్రాణంతో చెలగాటం. రాళ్లూ రప్పల్లో, జారుతున్న నీళ్లల్లో, నొప్పులు పడుతూ లేస్తూ డోలీలో ప్రయాణిస్తూ ఆస్పత్రికి చేరుకునే దుస్థితి నేటికీ అక్కడ ఉంది. బిడ్డలకు అనారోగ్యం వస్తే దిక్కుండదు. సౌకర్యాలు లేక పురిట్లోనే బిడ్డను పోగొట్టుకున్న తల్లులు కోకొల్లలు. ఇటీవలె సెల్‌ఫోన్‌ వెలుతురులో కాన్పు అయిన ఘటన వారి దయనీయ జీవితాలకి నిదర్శనం.

రాష్ట్రం, దేశమే కాదు, ప్రపంచంలో ఎక్కడ చూసినా పర్యావరణ మార్పులకు తొలి బాధిత స్త్రీనే. గడ్డకట్టే మంచు, అడుగంటిపోయిన భూగర్భజలాలు, కార్చిచ్చు, వరదలు, కరువు, వ్యవసాయ సంక్షోభం, గాలి కాలుష్యం, నీటి కాలుష్యం, పర్యావరణ మార్పు ఏదైనా.. మహిళల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.


‘ఆమెని రక్షించడం అంటే ప్రకృతిని రక్షించడమే.!’

అన్న భావన అందరిలో రావాలి..!

అందుకు అందరం సమాయత్తం కావాలి..!!


జ్యోతిర్మయి

8332925496

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్