గత మూడేళ్లుగా వేసవి సీజన్ పెద్ద సినిమాలు లేకుండానే గడిచిపోతోంది. ఈ ఏడాది కూడా దాదాపు అలాంటి పరిస్థితులే ఉండగా, ‘పెద్ది’ సినిమా కాస్త ఊరటగా కనిపిస్తోంది. థియేటర్ల యాజమాన్యాలు, నిర్మాతల మధ్య కొనసాగుతున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదానికి కూడా సీనియర్ నటుడు చిరంజీవి జోక్యం చేసుకోవడంతో తెరపడిన విషయం తెలిసిందే. పెద్ద సినిమాలన్నీ అటు షూటింగ్‌లు పూర్తి కాక, ఇటు ఐపీఎల్ రావడంతో వాయిదాలు ప్రకటించాయి. వేసవిలో చిన్న, డబ్బింగ్ సినిమాల జోరే ఎక్కువగా కనిపించింది. ఈసారి బాక్సాఫీస్ వద్ద సమ్మర్ హవా పెద్దగా కనిపించలేదు. రామ్‌చరణ్ ‘పెద్ది’తో ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. పెద్దితో పాటు జూన్‌లో పలు సినిమాలు థియేటర్లలో విడుదలై సందడి చేయబోతున్నాయి.
‘పెద్ది’ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రామ్‌చరణ్ అభిమానులు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయిక. ఎన్టీఆర్‌తో కలిసి ఆమె నటించిన చిత్రం ‘దేవర’. ఆ సినిమా తర్వాత ఆమె నటించిన రెండో సినిమానే ‘పెద్ది’. రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా, జూన్ 4న విడుదల కానున్న ‘పెద్ది’ సినిమాకు ప్రీ-బుకింగ్స్ ఓపెన్ కాగా, ఓవర్సీస్‌లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. మరోవైపు జూన్ 3 రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈ షోకు టికెట్ ధర రూ. 600 (జీఎస్‌టితో కలిపి)గా నిర్ణయించింది. సినిమా విడుదలయ్యే 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రస్తుతమున్న టికెట్ ధరలపై సింగిల్ స్క్రీన్‌లలో రూ. 100 చొప్పున, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున పెంచుకునేందుకు అవకాశమిచ్చింది. ఈ సినిమాలో జగపతిబాబు, బొమన్ ఇరానీ, దివ్యేందు కీలక పాత్రల్లో నటించారు. జూన్ నెలలో విడుదలయ్యే పెద్ద సినిమా ఇదే కావడంతో అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.
హై జవానీ తో ఇష్క్ హోనా హై (హిందీ మూవీ): బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించారు. హీరో వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 5న విడుదలవుతోంది.
11న సింగ్ గీతం: లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ సినిమా ‘సింగ్ గీతం’. అయాన్, అహల్యా బమ్రూ, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించారు. నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ మూవీ జూన్ 11న విడుదలవుతోంది.
19న మా ఇంటి బంగారం: డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత సమంత ప్రధాన పాత్రలో నటించిన తొలి చిత్రం ‘మా ఇంటి బంగారం’. సామ్ భర్త రాజ్ ఈ చిత్రానికి కథ అందించగా, ‘ఓ బేబీ’ ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహించింది. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది. జూన్ 19న ‘మా ఇంటి బంగారం’ థియేటర్లలోకి వస్తోంది.
ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు: ‘కోరుకున్న ప్రియుడు’, ‘పెళ్లి’ వంటి సినిమాలతో హీరోగా అప్పట్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న వడ్డే నవీన్, కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఆయన ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ మూవీతో పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా ద్వారా కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు. వడ్డే నవీన్ హీరోగా నటించడంతో పాటు నిర్మాతగా వ్యవహరించిన ఈ మూవీ జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
దీవానా: ‘శుభం’ ఫేమ్ హర్షిత్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం ‘దీవానా’. స్నేహ మణిమేగలై కథానాయిక. శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించిన ఈ మూవీ ‘మా ఇంటి బంగారం’తో పోటీపడుతూ జూన్ 19న విడుదలవుతోంది.
కాక్‌టైల్ 2 (హిందీ మూవీ): షాహిద్ కపూర్ హీరోగా, కృతి సనన్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘కాక్‌టైల్ 2’. ఇది 2012లో వచ్చిన ‘కాక్‌టైల్’ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కింది. జూన్ 19న విడుదలవుతోంది.
26న లెనిన్: నాగార్జున చిన్న కుమారుడు, హీరో అఖిల్ అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘లెనిన్’. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాతోనైనా అఖిల్ హిట్ కొడతాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం జూన్ 26న విడుదలవుతోంది.
26న వెల్‌కమ్ టు ద జంగిల్ (హిందీ చిత్రం): ఇది ‘వెల్‌కమ్’ సినిమా ఫ్రాంచైజీలో వస్తున్న మూడో భాగం. ఇందులో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, బాబీ డియోల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
మరికొన్ని సినిమాలు .
స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు జూన్ 22న ఉంది. ఈ క్రమంలో జూన్ 19న ఆయన చివరి మూవీ ‘జన నాయకన్’ను విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. మరి ఈసారైనా సెన్సార్ ఆటంకాలు దాటుకుని ‘జన నాయకన్’ విడుదలవుతుందో లేదో చూడాలి.
‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’ సినిమాలో విరాట్‌కర్ణ కథానాయకుడిగా నటించారు. నభా నటేశ్, ఐశ్వర్య మేనన్ కథానాయికలు. అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్.ఐ.కె స్టూడియోస్ పతాకంపై కిశోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మాతలు. అభిషేక్ పిక్చర్స్ సమర్పిస్తోంది. ఈ చిత్రం జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది.నటుడు ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా ‘జి.డి.ఎన్’. ‘జి.డి. నాయుడు’ అనేది ఉపశీర్షిక. ఈ సినిమాకు కృష్ణకుమార్ రామకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.








కామెంట్‌లు (0)