test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మూగబోయిన పల్లె గొంతుక

4 రోజుల క్రితం

bharat raja
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 11, 2026, 01:13 పూర్వాహ్నం | 4 నిమిషాల చదవడం


​​​చెన్నై : ‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా... పల్లె కోనేటి తామర్లు విచ్చేనమా..’ అంటూ పల్లె మాటను మంత్రం చేసి, ‘ఈ మమతే ..ఈ సమతే మంగళవాద్యం’అంటూ గ్రామీణ జీవన బంధాలను వెండితెరపై ఆవిష్కరించిన భారతీయ సినిమా దిగ్గజ దర్శకుడు భారతీ రాజా (84)ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన బుధవారం తెల్లవారుజామున చెన్నైలో తుది శ్వాస విడిచారు. ‘అలలు కలలు ఎగిసి ఎగిసి అలసి సొలసి పోయే...’అంటూ ఆయనే చిత్రీకరించినట్లు గ్లామర్ ప్రపంచానికి, ఇండోర్ సెట్లకు పరిమితమైన సినిమాను పల్లెటూరి మట్టిలోకి, సహజమైన వెలుగులోకి తీసుకురావడానికి నిర్విరామంగా కృషి చేసిన ఆయన ఇక శాశ్వత విశ్రాంతిలోకి జారుకున్నారు. తాను స్వయంగా హేతువాది ఆయిన ఆయన తన సినిమాల్లోనూ అభ్యదుయ భావజాలానికి పెద్దపీట వేశారు. కులాంతర ప్రేమలకు మద్దతివ్వడం, గ్రామీణ మూఢనమ్మకాలపై ఎలుగెత్తడం, మానవత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం, మతాచారాల కంటే సామాజిక న్యాయానికి పట్టం కట్టడం, మహిళలు సాంప్రదాయ బంధనాల్లో కాకుండా స్వతంత్ర వ్యక్తులుగా కనిపించడం వంటి దృశ్యాలు ఆయన సినిమాల్లో సర్వసాధారణం. భారతీ రాజా మరణ వార్తతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. యావత్ భారత సినీ పరిశ్రమకు ఆయన భౌతికంగా లేకపోవటం తీరనిలోటని పలువురు సంతాపం తెలిపారు. కేవలం కథల్లోనే కాకుండా, మేకింగ్‌లో కూడా హేతుబద్ధతను పాటించారు. అప్పటివరకు తన సినిమాల ద్వారా "ఆరాధన అనేది కేవలం అభిమానంగానే ఉండాలి కానీ, అది మూఢభక్తిగా మారకూడదు" అని నమ్మి, తన ఫ్యాన్ అసోసియేషన్లను కూడా రద్దు చేయమనడం ఆయన హేతుబద్ధ ఆలోచనకు నిదర్శనమని సీని రంగ ప్రముఖులు గుర్తు చేసుకున్నారు.

రియలిజం పితామహడు..
చలనచిత్ర రంగాన్ని స్టూడియోల నాలుగు గోడల నుంచి పల్లెటూరి పచ్చదనం, మట్టి వాసనల వైపు నడిపించిన ‘రియలిజం పితామహుడు’గా ఖ్యాతి పొందిన దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా. . తమిళనాడులోని అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నసామి. 1977లో వచ్చిన ’16 వయతినిలే’ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. శ్రీదేవి, రజినీకాంత్ వంటి నటులకు ఈ సినిమా పునాది వేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ చేయగా ఇక్కడా ఘన విజయం సాధించింది. 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’తో ఆయన దర్శకుడిగా మారారు. ‘సీతాకోక చిలుక’, ‘ఆరాధన’, ‘జమదగ్ని’, ‘ఈతరం ఇల్లాలు’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు ఆయన సుపరిచితుడే. దర్శకుడిగానే కాదు, నటుడిగానూ అలరించారు. తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ హేతువాది, దర్శకుడు వేలు ప్రభాకరన్‌  ఆలోచనలు భారతీరాజాతో సహా చాలా మంది దర్శకులకు హేతువాద స్ఫూర్తినిచ్చాయి. సమాజంలో మూఢనమ్మకాలు, కుల వ్యవస్థలను ప్రశ్నిస్తూ.. వాస్తవికత, హేతుబద్ధమైన ఆలోచనలను ఆయన తన జీవితం ద్వారా, ప్రసంగాల ద్వారా ప్రచారం చేశారు. దీనివల్ల స్ఫూర్తి పొందిన భారతీరాజా వంటి ఎందరో సృష్టికర్తలు తమ కళలో సామాజిక చైతన్యాన్ని, హేతువాద భావాలను ప్రతిబింబించారు.

సంచలనం సృష్టించిన వేదం పుదిదు
. వేదం పుదిదు సినిమా ఆయన కెరీర్‌లో అత్యంత సాహసోపేతమైన రాజకీయ, సామాజిక చిత్రం.మనుధర్మ ఆధిపత్యాన్ని, సమాజంలోని మతపరమైన కపటత్వాన్ని, కుల వివక్షను ఒక చిన్నపిల్లాడి పాత్ర ద్వారా అత్యంత హేతుబద్ధంగా, సూటిగా ప్రశ్నించడం సంచలనం సృష్టించింది.
అలైగళ్ ఓయివతిల్లైలో ఒక హిందూ అబ్బాయి, క్రైస్తవ అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ ద్వారా సమాజంలోని మతాంతర వివాహాల చుట్టూ ఉండే సంకుచితత్వాన్ని, మత పిచ్చిని ఎండగట్టారు. ముదల్ మరియాదై లో శివాజీ గణేశన్ ప్రధాన పాత్ర పోషించగా, సమాజం విధించిన కుల కట్టుబాట్లను దాటి ఒక అగ్ర కులానికి చెందిన వ్యక్తికి, తక్కువ కులానికి చెందిన యువతికి మధ్య ఉన్న పవిత్రమైన బంధాన్ని చూపించారు. కరుత్తమ్మలో పల్లెటూళ్లలో జరిగే 'ఆడ శిశు హత్యాకాండ' అనే భయంకరమైన సామాజిక ఆచారానికి వ్యతిరేకంగా తీసిన అత్యంత ప్రభావవంతమైన చిత్రం ఇది. ఈ సినిమా ఆ రోజుల్లో సమాజంలో పెద్ద చైతన్యాన్ని తెచ్చింది. సామాజిక స్పృహతో తీసిన సినిమాలకు దేశవ్యాప్తంగా గొప్ప గుర్తింపు కూడా లభించింది. ఆయన ప్రతిభకు సాక్ష్యంగా ఆరు జాతీయ చలన చిత్ర అవార్డులు సైతం దక్కాయి.

​స్టూడియోల సామ్రాజ్యాన్ని దాటి
భారతీరాజా కేవలం ఒక దర్శకుడు మాత్రమే కాదు.. సౌత్ ఇండియన్ సినిమాలో ఒక ట్రెండ్ సెట్టర్. 1970ల నాటికి సినిమాలు అంటే భారీ సెట్లు, మెలోడ్రామా, కృత్రిమమైన లైటింగ్ మాత్రమే ఉండేవి. కానీ, భారతీరాజా ఆ ఫార్ములాను పూర్తిగా బద్దలు కొట్టారు. అవుట్‌డోర్ షూటింగ్స్, సహజమైన పల్లెటూరి పాత్రలు, కమర్షియల్ హంగులు లేని ప్యూర్ ఎమోషన్స్‌తో ఆయన సరికొత్త సినిమా స్కూల్‌ను సృష్టించారు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి లాంటి నటీనటుల కెరీర్‌ను మలుపు తిప్పిన ‘16 వయతినిలే’ (1977) చిత్రంతో భారతీరాజా ప్రస్థానం మొదలైంది. ఈ సినిమానే తెలుగులో 'పదహారేళ్ల వయసు'గా రీమేక్ అయి ఇక్కడా సంచలనం సృష్టించింది.

​'సీతాకోకచిలుక' సృష్టించిన సంచలనం!
చాలా మందికి భారతీరాజా తమిళ దర్శకుడిగానే తెలుసు. కానీ తెలుగు చలనచిత్ర పరిశ్రమపై ఆయన ముద్ర చాలా గాఢమైనది. నేరుగా తెలుగులో ఆయన చేసిన సినిమాలు ఇక్కడి క్లాసిక్ హిట్స్‌గా నిలిచాయి.సీతాకోకచిలుక (1981): మతాల ప్రాతిపదికన సాగే ప్రేమకథను ఎంత అద్భుతంగా తెరకెక్కించవచ్చో ఈ సినిమాతో నిరూపించారు భారతీరాజా. ఈ చిత్రానికి గాను ఆయన ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. ఆరాధన (1987)లో చిరంజీవి, సుహాసిని కాంబినేషన్‌లో వచ్చిన ఈ మ్యూజికల్ హిట్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన లవ్ స్టోరీగా నిలిచిపోయింది. అలాగే సూప‌ర్ స్టార్ కృష్ణ‌తో జ‌మ‌ద‌గ్ని మూవీ తీశారు. రీమేక్స్ & డబ్బింగ్స్లో ఆయన క్లాసిక్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘టిక్ టిక్ టిక్’ (కమల్ హాసన్), సైకో థ్రిల్లర్ ‘సిగప్పు రోజాక్కళ్’ (తెలుగులో ‘ఎర్ర గులాబీలు’) టాలీవుడ్‌లో హారర్/సస్పెన్స్ జానర్‌కు పునాది రాళ్లుగా మారాయి.

​భారతీరాజా మృతికి సినీ పరిశ్రమ సంతాపం
భారతీరాజా మృతి పట్ల సినీ రంగానికి చెందిన ప్రముఖులైన తమిళనాడు సిఎం విజయ్, కమల్ హాసన్, రజనీకాంత్, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి, మోహన్ బాబు, రజనీకాంత్, పవన్ కళ్యాణ్, ఆంధ్రపదేశ్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు అంబటి మధు మోహన కృష్ణ, ఉపాధ్యక్షులు విజయేంద్రవర్మ, కార్యదర్శి జెవి మోహన్ గౌడ్ తదితరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సంతాపం ప్రకటించారు. భారతీయ చలనచిత్ర రంగం ఒక గొప్ప దర్శకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పల్లెటూరి మట్టి పరిమళాన్ని, మానవ సంబంధాల సౌందర్యాన్ని, ప్రేమలోని అమాయకత్వాన్ని, సామాన్య ప్రజల భావోద్వేగాలను అద్భుతంగా వెండితెరపై మలచి అందించిన గొప్ప సృజనశీలి భారతీరాజా అని కొనియాడారు. ఆయన రూపందించిన చిత్రాలు కోట్ల మంది హృదయాల్లో నిలిచిపోవడమే కాకుండా, ఎన్నో తరాల వారికి స్ఫూర్తిగా నిలిచాయని గుర్తుచేసుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక పురస్కారాలు అందుకున్న భారతీరాజా.. సినీ రంగానికి చేసిన సేవలు అపారమైనవని శ్లాఘించారు. ఈ సందర్భంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఆరాధన’ చిత్రంలో నటించే అదృష్టం తనకు దక్కిందని చిరంజీవి స్మరించుకున్నారు. సినిమాపై భారతీరాజా గారికి ఉన్న అంకితభావం నాలోనూ ఎంతో స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు. కేవలం తమిళ పరిశ్రమకే పరిమితం కాకుండా తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో తన అద్భుత సృజనాత్మకతతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న గొప్ప దర్శకుడని పవన్ కళ్యాణ్ కొనియాడారు.

భారతీరాజా మృతికి సిపిఎం సంతాపం
ప్రముఖ దర్శకులు, నటుడు భారతీరాజా మృతికి సిపిఎం ఆంధ్రప్రదేశ్ కమిటీ సంతాపాన్ని తెలిపింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు బుధవారం ప్రకటన విడుదల చేశారు. తమిళంలోనూ, తెలుగులోనూ జనాదరణ కలిగిన అభ్యుదయ, సందేశాత్మక చిత్రాలను ఆయన తెరకెక్కించారని తెలిపారు. అనేకమంది కొత్త నటులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని, ఆయన మృతి కళా రంగానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్