test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆ పాటను రీక్రియేట్ చేయలేదు : పెద్ది మూవీలో సాంగ్ పై రామ్ చరణ్ క్లారిటీ

01 జూన్, 2026

That Song Was Not Recreated: Ram Charan Clarifies the Song in the Movie 'Peddi'
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 11:34 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

వినోదం : పెద్ది చిత్రంపై సోషల్ మీడియాలో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల సమయం దగ్గరపడుతుండటంతో చిత్రానికి సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలోని ప్రసిద్ధ గీతం అబ్బానీ తియ్యనీ దెబ్బ సాంగ్‌ను ‘పెద్ది’లో రీక్రియేట్ చేశారనే ప్రచారం అభిమానుల్లో చర్చనీయాంశమైంది.

అది ఐకానిక్ సాంగ్.. గౌరవిస్తున్నాం ….
అయితే ఈ వార్తలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్ స్పష్టత ఇచ్చారు. “కొన్ని విషయాలు ప్రేక్షకులు బిగ్ స్క్రీన్ మీదే చూసి తెలుసుకోవాలి. కానీ మేము ఆ పాటను రీక్రియేట్ చేయలేదు. కథకే ప్రధాన ప్రాధాన్యం ఇచ్చాం. అలాంటి అంశాలను జోడిస్తే సినిమా పూర్తిగా కమర్షియల్ మూడ్‌లోకి వెళ్లిపోతుంది. అది ఒక ఐకానిక్ సాంగ్ కాబట్టి దానిని అలాగే గౌరవిస్తున్నాం” అని తెలిపారు. దీంతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన చెక్ పెట్టినట్లైంది.

సినిమా చూస్తే ధైర్యంగా ఆలోచించడం ప్రారంభిస్తారు ….
ఇక సినిమా కథా నేపథ్యంపై కూడా రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రీడలను ప్రేమించే వారికి ‘పెద్ది’ ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుందని చెప్పారు. “స్పోర్ట్స్‌పై పూర్తి ఫోకస్‌తో ఉండే వాళ్లు ఈ సినిమాను తప్పకుండా చూడాలి. థియేటర్ నుంచి బయటకు వచ్చే సమయానికి ప్రేక్షకులు భావోద్వేగంతో నిండిపోతారు. జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా ముందుకు సాగాల్సిందే అనే గొప్ప సందేశాన్ని ఈ సినిమా ఇస్తుంది” అని అన్నారు. అలాగే బలహీన మనస్తత్వం ఉన్నవాళ్లు కూడా ఈ సినిమా చూసిన తర్వాత ధైర్యంగా ఆలోచించడం ప్రారంభిస్తారని పేర్కొన్నారు.

జీవన విలువలను చూపిస్తుంది …
ప్రస్తుత తరం తప్పకుండా తెలుసుకోవాల్సిన జీవన విలువలను ‘పెద్ది’ చూపిస్తుందని చరణ్ అభిప్రాయపడ్డారు. జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను ఎలా ఎదుర్కోవాలి, నిరాశల మధ్య ఎలా నిలబడాలి అనే విషయాలను సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశామని తెలిపారు. భావోద్వేగాలు, క్రీడా స్పూర్తి, జీవిత పోరాటం అన్నీ కలిసిన చిత్రంగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుందని చెప్పారు.

నాన్న పెద్ద స్ఫూర్తి ….
ఇక తన వ్యక్తిగత జీవితంపై మాట్లాడుతూ …. తండ్రి చిరంజీవి తనకు ఎంతో పెద్ద స్ఫూర్తి అని రామ్ చరణ్ పేర్కొన్నారు. “నాన్న లేకపోతే నా జీవితం లేదు” అని భావోద్వేగంగా చెప్పారు. అలాగే బాబాయ్ పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. రాజకీయాల్లో పవన్ కల్యాణ్ జీరో నుంచి ప్రారంభించి, ఇప్పుడు డిప్యూటీ సిఎం స్థాయికి చేరుకోవడం ఎంతో ప్రేరణనిచ్చిందన్నారు. ప్రతి మనిషి జీవితంలో ఒడుదొడుకులు సహజమని, వాటిని ధైర్యంగా ఎదుర్కొంటేనే ఉన్నత శిఖరాలను చేరుకోగలమని రామ్ చరణ్ అన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్