ప్రజాశక్తి -ఆనందపురం (విశాఖపట్నం) : విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం లొడగలవానిపాలెం జాతీయరహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రంగా గాయపడగా, ముగ్గురు మహిళా డ్యాన్సర్లకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలు రైడర్స్ డ్యాన్స్ బృందానికి చెందిన రెండు వాహనాలు తగరపువలస ఉత్సవాల్లో పాల్గొని గాజువాకకు తిరిగి వెళ్తుండగా బృందంలోని ఒక సభ్యుడికి వాంతులు కావడంతో వీరి వాహనాలు పక్కన ఆపారు. అదే సమయంలో విజయనగరం నుంచి వేపగుంట వైపు కోళ్ల లోడ్‌తో వెళ్తున్న బొలెరో వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తులో ఉండి అతివేగంగా వచ్చి ఆగి వున్న సుజుకి ఎర్టిగా, టాటా సుప్రియో వాహనాలను బలంగా ఢీకొట్టారు. దీంతో డివైడర్ సమీపంలో ఉన్న పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. లిఖిత, ప్రియ, హారికలకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన పండును వెంటనే వెంకోజిపాలెంలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆనందపురం సిఐ వాసునాయుడు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో డ్యాన్సర్ పండుకు తీవ్ర గాయాలు
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 11:05 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)