వాషింగ్టన్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ వల్ల భవిష్యత్‌లో తీవ్ర ఉద్యోగ సంక్షోభం పొంచి ఉందని అమెరికాకు చెందిన ఎఐ కంపెనీ ఆంథ్రోపిక్ సీఈవో డారియో అమోడెయ్ హెచ్చరించారు. ముఖ్యంగా అన్ని రంగాల్లో ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలను ఎఐ భర్తీ చేయబోతోందని తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో డారియో మాట్లాడుతూ …. రెండేళ్ల క్రితం ఒక తెలివైన హైస్కూల్ పిల్లాడి స్థాయిలో ఉన్న ఎఐ సాంకేతికత.. ఇప్పుడు ఒక తెలివైన కాలేజీ స్టూడెంట్, అంతకుమించి వేగంగా దూసుకెళుతోందని అభిప్రాయపడ్డారు. డాక్యుమెంట్లను సమరైజ్ చేయడం, కొత్త ఐడియాలతో ముందుకురావడం, ఫైనాన్షియల్ రిపోర్టులు తయారుచేయడం వంటి పనులను ఎఐ సులువుగా చేసేస్తోందన్నారు. దీనివల్ల ముఖ్యంగా ఫైనాన్స్, కన్సల్టింగ్, టెక్నాలజీ వంటి రంగాల్లో ఎంట్రీ లెవల్ ఉద్యోగాలు తీవ్ర ప్రభావితం అవుతాయని తెలిపారు.
ఐదేళ్లలో స్పష్టత ….
రాబోయే ఒకటి నుంచి ఐదేళ్ల లోపే ఎఐ ప్రభావం మార్కెట్‌లో స్పష్టంగా కనిపించవచ్చని డారియో అంచనా వేశారు. దీనివల్ల తీవ్రమైన ఉద్యోగ సంక్షోభం చవిచూడబోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. చాలామంది ఎఐ సంస్థల సిఇఒ లు, ఇతర కంపెనీల అధినేతలు ఈ విషయంపై వ్యక్తిగతంగా ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సాధారణ ప్రజలకు, ప్రభుత్వాలకు ఈ సమస్య తీవ్రత ఇంకా పూర్తిగా అర్థం కావడం లేదన్నారు.
ఎఐ టూల్స్ ఉపయోగించడంలో నైపుణ్యాలను పెంచుకోండి ….
ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందన్న ఆందోళనల వేళ … ఎఐ అభివృద్ధిని ఆపవచ్చునన్న సందేహాలపై డారియో వివరణ ఇచ్చారు. అమెరికా, చైనా కంపెనీల మధ్య ప్రస్తుతం తీవ్రమైన పోటీ నెలకొందని, ఈ కారణంగానే ఎఐ అభివృద్ధిని ఇప్పుడు ఆపడం సాధ్యం కాదని డారియో స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికన్ కంపెనీలు ఎఐ అభివృద్ధిని ఆపితే.. చైనా తమను అధిగమిస్తుందన్నారు. ఉద్యోగ ముప్పు నుంచి బయటపడాలంటే ఎఐ టూల్స్ ఉపయోగించడంలో నైపుణ్యాలను పెంచుకోవాలని ఉద్యోగులకు సూచించారు. ఆర్థిక అసమానతలను తగ్గించడానికి, కార్మికులను ఆదుకోవడానికి భవిష్యత్‌లో ఎఐ కంపెనీలపై ప్రభుత్వాలు ప్రత్యేక పన్నులు విధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని డారియో అభిప్రాయపడ్డారు.








కామెంట్‌లు (0)