ప్రజాశక్తి-రాజంపేట : కడప జిల్లా రాజంపేట మండల పరిధిలోని రెండు వేరువేరు ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. రాజంపేట పట్టణంలోని ఉస్మాన్ నగర్ బైపాస్ వద్ద గురువారం అర్ధరాత్రి సమయంలో బస్సు, కారు ఢీకొన్న ఘటనలో కారులో ప్రయాణిస్తున్న తిరుపతి ఆటోనగర్ కు చెందిన పూర్ణచంద్ర రాజు (52) అక్కడికక్కడే మృతి చెందగా ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. బత్తల బాలాజీ, పూర్ణచంద్ర రాజు, కృష్ణమనేని శశిధర్ లు గురువారం రాత్రి తిరుపతి నుండి కడపకు కారులో వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గాయపడిన వారికి అదే వైద్యశాలలో చికిత్స అందజేసి వారి బంధువులకు సమాచారం అందజేశారు. అలాగే శుక్రవారం తెల్లవారుజామున మండల పరిధిలోని వెంకట రాజంపేట వద్ద కడప నుండి ఓబులవారిపల్లెకు వెళుతున్న సిమెంట్ లారీని తిరుపతి నుండి తాడిపత్రికి వెళుతున్న ఇతియోస్ కారు ఢీకొన్న ఘటనలో ఓబులవారిపల్లె మండలం గాడివారిపల్లె గ్రామానికి చెందిన కోటకొండ సుబ్బమ్మ (56) అక్కడికక్కడే మృతి చెందారు. ఓబులవారిపల్లె మండలం వడ్డె పల్లెకు చెందిన మహాలక్ష్మి, జి.ప్రసాద్, పి.శివయ్య, వెంకటసుబ్బమ్మ, ఎరుకులమ్మ, లారీ డ్రైవర్ ఈశ్వరయ్య లు రాజంపేటలోని వివాహానికి హాజరయ్యేందుకు ఓబులవారిపల్లె క్రాస్ రోడ్డు వద్ద అదే కారులో ఎక్కగా వారు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వెంకట రాజంపేట గ్రామస్తులు, హుటాహుటిన కారు వద్దకు చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. 108 వాహనం కోసం ఫోన్ చేసినా గంటసేపైనప్పటికీ వాహనం రాకపోవడంపై గ్రామస్తులతోపాటు అదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ బాధ్యులు పూల భాస్కర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బస్సు ఢీకొని మహిళ మృతి
విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ లో వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈమె విజయనగరం మండలం రాకోడు గ్రామానికి చెందిన బోధంకి నారాయణమ్మ 76సంవత్సరాలు, మనవడు సురేష్ ఇచ్చిన పిర్యాదు పై SI రవి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ సిఐ చౌదరి తెలిపారు.








కామెంట్‌లు (0)