సమాజాభివృద్ధికి అంకితం కావాలని ఆకాంక్ష
ఉత్సాహ పూరితంగా ఎస్‌వికె భవనం ప్రారంభం
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : శేషగిరి విజ్ఞాన కేంద్రం ప్రశ్నించే గొంతులకు కేంద్ర బిందువుగా ఉండాలని, సమాజాభివృద్ధికి అంకితం కావాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. ఈ భవనం కేవలం యుటిఎఫ్ కార్యక్రమాల కోసమే కాదని, వివిధ సంఘాలు, సామాజిక తరగతుల శక్తి కూడగట్టే కేంద్రంగా, బహుముఖ కార్యక్రమాలకు వేదికగా నిలవాలని ఆకాంక్షించారు. ఇటువంటి లక్ష్యంతో ఈ విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించే లక్ష్యంగా ఉపాధ్యాయులు ముందుకు రావడం మంచి పరిణామమని అన్నారు. విజయనగరంలోని కెఎల్ పురంలో నిర్మించిన శేషగిరి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవం మంగళవారం వేలాదిమంది ఉపాధ్యాయులు, ఉద్యోగులు, వివిధ ప్రజా సంఘాల నాయకుల హర్షధ్వానాల మధ్య ఘనంగా ప్రారంభమైంది. ఉపాధ్యాయ ఉద్యమనేత కీర్తిశేషులు కోరెడ్ల శేషగిరి 5వ వర్థంతిని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా యుటిఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు మీసాల అప్పలనాయుడు యుటిఎఫ్ జెండాను ఆవిష్కరించారు. యుటిఎఫ్ ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన ఎస్‌వికె భవనాన్ని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌ఎస్ ప్రసాద్ రిబ్బన్ కట్‌చేసి ప్రారంభించారు. అనంతరం గ్రౌండ్ ఫ్లోర్‌లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కెఎస్ లక్ష్మణరావు ఆవిష్కరించారు. రెండవ అంతస్తులో సమావేశం హాల్‌ను శేషగిరి తల్లి కోరెడ్ల సూర్యకాంతం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యుటిఎఫ్ కార్యాలయాన్ని రాష్ట్ర కోశాధికారి రెడ్డి మోహనరావు, గెస్ట్ హౌస్ రూములను యుటిఎఫ్ సీనియర్ నాయకులు డి.రాము తదితరులు ప్రారంబించారు. అనంతరం సభ ప్రారంభానికి ముందు శేషగిరి చిత్రపటానికి మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, యుటిఎఫ్ నాయకులు కెఎస్‌ఎస్ ప్రసాద్, శేషగిరి తల్లి సూర్యకాంతం, కుటుంబ సభ్యులు, యుటిఎఫ్ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు.








కామెంట్‌లు (0)