test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

19 న కమిషనర్‌‌తో చర్చలు ఫలవంతం కాకపోతే నిరవధిక సమ్మె : సిఐటియు

18 మే, 2026

19 న కమిషనర్ తో చర్చలు ఫలవంతం కాకపోతే నిరవధిక సమ్మె : సిఐటియు
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 10:41 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (జివిఎంసి)లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల డిమాండ్లపై గతంలో కమిషనర్లు అంగీకరించిన ఒప్పందాలను నిర్దిష్ట గడువులోగా అమలు చేయకపోతే నిరవధిక సమ్మెకు దిగాల్సి వస్తుందని జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) నాయకులు హెచ్చరించారు. ఈనెల 19 న కమిషనర్ తో చర్చలు ఉన్నాయని,చర్చలు ఫలవంతం కాకపోతే నిరవధిక సమ్మె తప్పదని స్పష్టం చేశారు.జగదాంబ దరి సిఐటియు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ అధ్యక్షులు టి.నూకరాజు,ప్రధాన కార్యదర్శి ఉరుకూటి రాజు, గౌరవ అధ్యక్షులు పి.వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కొత్త కమిషనర్ కేతన్ గార్డ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పెండింగ్ సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించామన్నారు.అయితే ఇప్పటివరకు ఎలాంటి పురోగతి కనిపించలేదని వారు విమర్శించారు.గత వైసిపి,టిడిపి పాలకవర్గాలు కూడా కార్మికులను మోసం చేశాయని ఆరోపించారు. కౌన్సిల్‌లో ఆమోదించిన నీటి సరఫరా,వెటర్నరీ, పార్కులు,రిటైర్డ్ కార్మికులు, కారుణ్య నియామకాలు, లోడర్ల వేతనాల పెంపు వంటి అంశాలు ఇప్పటికీ అమలు కాలేదన్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, అప్పటి ఇన్‌చార్జి కమిషనర్ హరేంధిర ప్రసాద్‌తో 2025 మే 2 న జరిగిన ఒప్పందాన్ని కూడా అమలు చేయలేదని పేర్కొన్నారు. కార్మికుల హెల్త్ అలవెన్స్ బకాయిలు,విలీన కార్మికుల పిఎఫ్ సొమ్ము,సప్లిమెంటరీ కార్మికుల జీతాలు,ఇన్‌కమ్ ట్యాక్స్ మొత్తాలు,333 జిఓ ఏరియర్స్ ఇంకా చెల్లించలేదని యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. లోడర్లు,బదిలీ,కాంట్రాక్టు, ప్యాకేజీ,డైలీ వేజ్ కార్మికులకు జిఓ ప్రకారం వేతనాలు,పిఎఫ్, ఈఎస్ఐ,సెలవులు కల్పించడం లేదని ఆరోపించారు. రోజుకు చెత్త కంపులో పనిచేసే కార్మికులకు కేవలం రూ.450 కూలీ మాత్రమే ఇచ్చి బానిసల్లా పని చేయించుకుంటున్నారని విమర్శించారు.ఇప్పటికే మూడు నుంచి నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. విలీన కార్మికులకు “మినిమమ్ టైమ్ స్కేల్” ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చి సంవత్సరం గడిచినా అమలు చేయలేదన్నారు. మరణించిన,రిటైర్డ్ అయిన కార్మికుల కుటుంబ సభ్యులకు ముందుగా ఉద్యోగాలు ఇవ్వకుండా బయట వ్యక్తులను నియమించడం ద్వారా పోస్టుల విక్రయం జరుగుతోందని కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో అంగీకరించిన అన్ని డిమాండ్లను నిర్దిష్ట కాలవ్యవధిలో అమలు చేయాలని,లేదంటే ఈ నెల 21 తర్వాత నిరవధిక సమ్మెలోకి వెళతామని సిఐటియు నాయకులు హెచ్చరించారు.మీడియా సమావేశంలో యూనియన్ వర్కింగ్ జనరల్ సెక్రటరీ ఎం.వి. ప్రసాద్,వర్కింగ్ ప్రెసిడెంట్ జి.అప్పారావు,ఉపాధ్యక్షులు నాయుడు,నీటి సరఫరా విభాగ నాయకుడు కె. వెంకటరావు,యుజిడి నాయకులు ఈ.ఆదినారాయణ, శ్రావణ్ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్