test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

మంగంపేట బెరైటీస్ పరిరక్షణకై 20న చలో ఏపిఎండిసి..

18 మే, 2026

మంగంపేట బెరైటీస్ పరిరక్షణకై 20న చలో ఏపిఎండిసి..
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 18, 2026, 01:15 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ కందారపు మురళి పిలుపు


ప్రజాశక్తి రైల్వేకోడూరు: మంగంపేట బెరైటీస్ (ముగ్గురాయి) పరిశ్రమను కాపాడుకునేందుకు ఈనెల 20న నిర్వహించబోయే ‘చలో ఏపీఎండీసీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బెరైటీస్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి పిలుపునిచ్చారు. ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైల్వేకోడూరు ప్రాంతానికి జీవనాడిగా ఉన్న ఈ పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పౌడర్ రూపంలో మాత్రమే ముగ్గురాయిని ఎగుమతి చేసే విధానం ఉండగా, ఇప్పుడు విచ్చలవిడిగా రాయి రూపంలోనే తరలిస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల 20 ఏళ్లపాటు సాగాల్సిన ఖనిజ నిల్వలు కేవలం రెండేళ్లలోనే హారతైపోయే ప్రమాదం ఉందన్నారు. ఈ విధానం వల్ల నియోజకవర్గంలోని 170కి పైగా పల్వరైజింగ్ మిల్లులు, వాటిపై ఆధారపడిన వేలాది మంది కార్మికులు, ఏపీఎండీసీలోని 600 మందికి పైగా ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించిందని గుర్తు చేశారు. కొత్త పరిశ్రమల గురించి గొప్పలు చెబుతున్న ముఖ్యమంత్రి, ఉన్న పరిశ్రమను నాశనం చేయడం సమంజసం కాదన్నారు. ధరల నిర్ణయంలో కూడా తీవ్ర వివక్ష జరుగుతోందని మురళి విమర్శించారు. ఒక టన్ను ఖనిజం వెలిగితీయడానికి రెండు వేల రూపాయలకు పైగా ఖర్చవుతుంటే, గత ప్రభుత్వ హయాంలో కుదిరిన ఒప్పందాన్నే కొనసాగిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఒకే ఒక్క ప్రైవేట్ కంపెనీకి బల్క్ టెండర్ కింద కేవలం 1188 రూపాయలకే కేటాయించిందని, అదే స్థానిక మిల్లులకు మాత్రం 1600 రూపాయలకు విక్రయిస్తోందని ఆరోపించారు. ఈ భారీ ధరల వ్యత్యాసం వెనుక ఉన్న అవినీతిపై సమగ్ర న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అలాగే నిల్వలు అయిపోతున్నాయనే నెపంతో ఇక్కడి ఉద్యోగులను రాష్ట్రంలోని ఇతర కేంద్రాలకు తరలించే కుట్ర జరుగుతోందని, నిర్వాసితులకు ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని అన్నారు. చివరగా, తాము చేస్తున్న ఈ శాంతియుత ప్రజా పోరాటాన్ని అణచివేయడానికి పోలీసులు, సెక్షన్ 30 చట్టాల పేరుతో ప్రభుత్వం నిర్బంధాలు, బెదిరింపులకు పాల్పడటం సరికాదని హితవు పలికారు. రాజకీయాలకు అతీతంగా స్థానిక ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు అందరూ తరలివచ్చి ఈనెల 20న జరిగే ‘చలో ఏపీఎండీసీ’ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని మురళి విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్