ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాలలో సెక్యూరిటీ సేవలందిస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవులు అమలు చేయాలని, అక్రమంగా విధులకు దూరం చేసిన గార్డ్స్ ని డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ …. సిఐటియు ఆధ్వర్యంలో జిజిహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద మార్చి 25న ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు 57వ రోజైన బుధవారం కూడా నిర్వహించారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు మాట్లాడుతూ …. జిజిహెచ్ ఆర్ఎంసి లలో సెక్యూరిటీ సేవల కాంట్రాక్టు ప్రారంభమై ఏడాది కావస్తున్నా సెక్యూరిటీ గార్డ్స్ జీతం కేవలం 12,099 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 13,960 రూపాయలు చెల్లించాలన్నారు. గతం నుండి అమలవుతున్న 13 క్యాజువల్ లీవులు రద్దు చేసి జీతాల్లో కోత విధిస్తున్నారని తెలిపారు. సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ ఏర్పాటు చేసుకున్న కొంతమందిని విధులకు దూరం చేసారని తెలిపారు. ఈ నేపథ్యంలో మార్చి 25 న రిలే నిరాహారదీక్ష ప్రారంభించామన్నారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవడం వల్ల జిజిహెచ్ అధికారులు స్పందించారన్నారు. తాజాగా బుధవారం ఉదయం కార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థ స్థానిక ఇంచార్జ్ కార్మికులతో చర్చలు ప్రారంభించారని తెలిపారు. సెక్యూరిటీ గార్డ్స్ న్యాయమైన డిమాండ్స్ పరిష్కారం అయ్యే వరకు ఆందోళన సాగిస్తామన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యమానికి అండగా నిలిచిన కార్మిక సంఘాలకు ఉద్యమ అభినందనలు తెలిపారు. 57 వ రోజు దీక్షల్లో సెక్యూరిటీ గార్డ్స్ లంకే ధర్మ, కె.భాగ్యలక్ష్మి, శేరు దుర్గ, పోతుల దేవి లు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో ధర్మారావు , శ్రీనివాస్, బాలరాజు , సోమరాజు , భాస్కరరావు , షఫీఖాన్, కామేష్, ధనలక్ష్మి, ఆదినారాయణ, సత్యవతి, రవి , రామకృష్ణ, ప్రేమ్, విక్టర్ తదితరులు పాల్గొన్నారు.
57 వ రోజు – జిజిహెచ్ ఆర్ఎంసి సెక్యూరిటీ గార్డ్స్ రిలే నిరాహార దీక్ష
20 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 20, 2026, 05:37 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)