ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, రంగరాయ వైద్య కళాశాలలో సెక్యూరిటీ సేవలందిస్తున్న కార్మికులకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జీతాలు పెంచాలని, క్యాజువల్ లీవులు అమలు చేయాలని, అక్రమంగా విధులకు దూరం చేసిన గార్డ్స్ ని డ్యూటీలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ …. సిఐటియు ఆధ్వర్యంలో జిజిహెచ్ సెక్యూరిటీ కార్యాలయం వద్ద మార్చి 25 న ప్రారంభమైన రిలే నిరాహార దీక్షలు 55వ రోజైన సోమవారం కూడా నిర్వహించారు. సిఐటియు నగర కన్వీనర్ మలక వెంకటరమణ దీక్షలను ప్రారంభించారు. ఈ సందర్బంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ …. జిజిహెచ్ ఆర్ఎంసి లలో సెక్యూరిటీ సేవల కాంట్రాక్టు ప్రారంభమై ఏడాది కావస్తున్నా సెక్యూరిటీ గార్డ్స్ జీతం కేవలం 12,099 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం 13,960 రూపాయలు చెల్లించాలన్నారు. గతం నుండి అమలవుతున్న 13 క్యాజువల్ లీవులు ఈ కాంట్రాక్టు వచ్చాక రద్దు చేసి జీతంలో కోత విధిస్తున్నారని తెలిపారు. అదేవిధంగా కార్మికులు పే స్లిప్ అడిగినా ఇవ్వడం లేదన్నారు. కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ సిఐటియు ఆధ్వర్యంలో యూనియన్ ఏర్పాటు చేసుకోవడం వల్ల కక్ష్య సాధింపు గా ఐదుగురిని విధులకు దూరం చేసారని తెలిపారు. యాజమాన్యాన్ని రప్పించాల్సిన బాధ్యత జిజిహెచ్ అధికారులదే అన్నారు. ఈనెల 21 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు కార్మిక శాఖ కార్యాలయంలో జాయింట్ మీటింగ్ ఉందన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఆందోళన కొనసాగుతుందని తెలిపారు. 55వ రోజు దీక్షల్లో సెక్యూరిటీ గార్డ్స్ లంకే ధర్మ, కె.భాగ్యలక్ష్మి, శేరు దుర్గ, పోతుల దేవి లు కూర్చున్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు తో పాటు ధర్మారావు , శ్రీనివాస్, బాలరాజు , సోమరాజు , భాస్కరరావు , షఫీఖాన్, కామేష్, ధనలక్ష్మి, ఆదినారాయణ, సత్యవతి, కృష్ణ వేణి తదితరులు పాల్గొన్నారు.
55 వ రోజు – జిజిహెచ్, ఆర్ఎంసి సెక్యూరిటీ గార్డ్స్ రిలే నిరాహార దీక్షలు
18 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 18, 2026, 05:43 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)