test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సచివాలయాలే లక్ష్యంగా చోరీలు.. ఇంజినీరింగ్ విద్యార్థి అరెస్ట్!

11 మే, 2026

chitoor police
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 11, 2026, 07:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

చిత్తూరు: ఆన్‌లైన్ బెట్టింగ్‌ల మాయలో పడి జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాకుండా, విలాసాల కోసం వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ఇంజినీరింగ్ విద్యార్థిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు 30 ప్రింటర్లు, 3 ల్యాప్‌టాప్‌లు మరియు ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు నగరి ఇన్‌చార్జ్ డీఎస్పీ జె.రామ్‌బాబు పర్యవేక్షణలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఎస్‌.ఆర్‌.పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని మఠం క్రాస్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సి.మహేష్‌బాబు (22) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా అతని వద్ద ఒక ప్రింటర్ లభ్యమైంది. విచారణలో అతను చెప్పిన నిజాలు విని పోలీసులు షాక్‌కు గురయ్యారు. తిరుపతిలో నివాసం ఉంటున్న మహేష్ బాబు, గత కొంతకాలంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని ప్రభుత్వ సచివాలయాలను లక్ష్యంగా చేసుకున్నాడు. అర్ధరాత్రి సమయంలో కట్టర్ సహాయంతో కార్యాలయాల తలుపులు పగులగొట్టి లోపలికి ప్రవేశించేవాడు. దొంగిలించిన ఎలక్ట్రానిక్ వస్తువులను OLX యాప్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువులుగా తక్కువ ధరకే విక్రయించేవాడు. తక్కువ ధరకు వస్తుండటంతో కొనుగోలుదారులు కూడా ఏమాత్రం అనుమానించకుండా కొనేవారని పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితుడిపై ఇప్పటికే వివిధ జిల్లాల్లో 18 కేసులు నమోదై ఉన్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైన మహేష్, ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అలవాటు పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసిన ఎస్‌.ఆర్‌.పురం పోలీసులు, అతని వద్ద నుండి భారీగా చోరీ సొత్తును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ ఆపరేషన్‌లో ప్రతిభ కనబరిచిన కార్వేటినగరం సిఐ, ఎస్‌.ఆర్‌.పురం ఎస్‌ఐ మరియు సిబ్బందిని జిల్లా పోలీసు యంత్రాంగం అభినందించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్