\ప్రజాశక్తి -చిత్తూరు : పెరిగిన పెట్రోల్ గ్యాస్ డీజిల్ ధరల వ్యతిరేకిస్తూ 9న జరిగే రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో భాగంగా చిత్తూరు జిల్లాలో కూడా జయప్రదం చేయాలని గురువారం చిత్తూరు సిపిఎం కార్యాలయంలో జరిగిన వామపక్షాల సమావేశం పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు లు మాట్లాడుతూ.. కేంద్రంలోని మతోన్మాద బిజెపి ప్రభుత్వం యుద్ధం పేరుతో దేశంలో ఉన్న ప్రజలపై బారాల మీద భారాల మోపుతున్నదని ధ్వజమెత్తారు. మే నెలలో 11 రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచారంటే ఏ స్థాయిలో బారం వుందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన వెంటనే ప్రజలపై భారాల మీద భారాలు మోపడం సిగ్గుచేటని అన్నారు. కేంద్ర సంస్థలను అడ్డం పెట్టుకొని ఐదు రాష్ట్రాల్లో కొద్ది లబ్ధి పొందడంతో భారీ స్థాయిలో ప్రజలపై భారం మోపడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజల ఆమోదిస్తున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలపై భారాలు మోపడానికి సిద్ధమవుతున్నారని మండిపడ్డారు. ఓ పక్క అమెరికా భారతదేశంపై సుంకాల మీద సుంకాల భారం వేస్తుంటే మరోపక్క మోడీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ లపై భారీగా ధరలు పెంచుతోందని అన్నారు. దీంతో నిత్యావసరాలు సహా అన్ని వస్తువుల ధరలపై ప్రభావం చూపుతోందని తెలిపారు. ఈ భారాలపై వామపక్షాల ఆధ్వర్యంలో వారం రోజుల పాటు విస్తృత ప్రచారం నిర్వహించి, తొమ్మిదిన అన్నిచోట్ల రాస్తా రోకో చేస్తామని అన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లాలో సిపిఎం ,సిపిఐ, సిపిఐ- ఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఐ ఎంఎల్ -లిబరేషన్ నాలుగు పార్టీల ఆధ్వర్యంలో 9న నిరసన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఆయిల్ కంపెనీలన్ని కార్పొరేట్ల చేతుల్లోనే ఉన్నాయని, దీంతో వారికి లాభం చేకూర్చడానికి ప్రజలపై భారాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కోట్లు కార్పొరేటర్లకు రాయితీలిస్తూ ప్రజలపై మాత్రం భారాలు మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. మన రాష్ట్రంలోని కృష్ణ, గోదావరి సహా దేశంలో ఉత్పత్తి అవుతున్న చమురును గుజరాత్, మహారాష్ట్రలకు తరలించి, అక్కడి నుండి దేశమంతటా అమ్ముకొని రిలయన్స్ లాంటి కంపెనీలు భారీగా లాభపడుతుంటే, మనం మాత్రం ఆయిల్ కోరతతో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్యాస్ ఆయిల్ లో చట్టబద్ధంగా 50% వాటా రాష్ట్రానికి రావాలని, దీనిని సాధిస్తే మన రాష్ట్రానికి ఆదాయం కూడా వస్తుందని అన్నారు. టిడిపి, జనసేన, వైసిపి పార్టీలు ఈ హక్కు కోసం ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం మచిలీపట్నం చమురు సహజవాయువు బావులను వేదాంతకి ఇస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ సేవలో మోడీ ఉంటే, మోడీ భజనలో టిడిపి, జనసేన, వైసిపి పార్టీల నేతలు ఉన్నారని అన్నారు. కూటమి ప్రభుత్నాన్ని ప్రజలు నిలదీయాలని వామపక్షాలు పిలుపునిస్తున్నాయని అన్నారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు సురేంద్ర బాలసుబ్రమణ్యం, విద్యార్థి నాయకుడు మసూద్ తదితరులు పాల్గొన్నారు.
పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వ్యతిరేకిస్తూ 9న రాస్తారోకో
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 04, 2026, 06:11 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)