బాపట్ల కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
ప్రజాశక్తి-పర్చూరు (బాపట్ల): మానసిక ఒత్తిడి నుంచి విముక్తి పొంది, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగాను జీవితంలో భాగం చేసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. పర్చూరు మండలం అద్దంకి నాంచారమ్మ దేవస్థానం ఆవరణలో శనివారం ‘యోగాంధ్ర’ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్, స్వయంగా ప్రజలు, అధికారులతో కలిసి పలు రకాల యోగాసనాలు వేసి అందరిలో స్ఫూర్తి నింపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా శరీరాన్ని, హృదయాన్ని నియంత్రించే అద్భుత సాధనం యోగా అని చెప్పారు. “నేను గత కొన్నేళ్లుగా రోజుకు ఒక గంట ధ్యానం, యోగా చేస్తున్నాను. నా ఆలోచనల్లో స్పష్టతకు, ఊబకాయం లేకుండా ఆరోగ్యంగా ఉండడానికి ఇదే నా రహస్యం” అని తన అనుభవాలను పంచుకున్నారు. అన్ని శాఖల అధికారుల సమష్టి కృషితో బాపట్ల జిల్లా పర్యాటక రంగంలో దూసుకుపోతోందని కలెక్టర్ తెలిపారు. గత రెండు నెలలుగా పర్యాటకుల సంఖ్య బాగా పెరిగిందని, దీనివల్ల హోటళ్లు, రెస్టారెంట్లు పెరిగి భూముల విలువలు పెరుగుతాయన్నారు. పర్యాటక అభివృద్ధి ద్వారా జిల్లా ప్రజల తలసరి ఆదాయం పెరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల ఆర్డీఓ ఏ.హరికుమార్ మాట్లాడుతూ.. యోగాతో ఏకాగ్రత, ఆత్మస్థైర్యం పెరుగుతాయన్నారు. పర్చూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి (ఉప కలెక్టర్) లవన్న మాట్లాడుతూ.. భారత సనాతన ధర్మంలో యోగా ఒక భాగమని చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎస్.విజయమ్మ మాట్లాడుతూ.. ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగా చేయడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి డాక్టర్ డి.చంద్రశేఖర్, తహసిల్దార్ బ్రహ్మయ్య, జిల్లా, మండల స్థాయి అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)