ప్రజాశక్తి – మార్టూరు (బాపట్ల) : సివిల్ సప్లయిస్ పాయింట్లలో దినసరిగా కూలీలుగా పనిచేస్తున్న హమాలీల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుందని సిఐటియు బాపట్ల జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల హనుమంతరావు విమర్శించారు. గురువారం హమాలీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్టూరు పెద్ద మార్కెట్ ఆవరణలో ఉన్న సివిల్ సప్లయిస్ గోడౌన్ వద్ద హమాలీలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బత్తుల హనుమంతరావు మాట్లాడుతూ.. నేటి వరకు ఏప్రిల్ నెల బిల్లులు చెల్లించలేదని తెలిపారు. దినసరి కూలీలుగా పనిచేస్తున్న హమాలీలకు బిల్లులు చెల్లించకుండా అధికారులు కాలయాపన చేస్తుంటే వారు ఎలా జీవించాలని ప్రశ్నించారు. హమాలీలకు కూలి రేట్లు ఒప్పందం గత సంవత్సరం డిసెంబర్ 31 తో ముగిసి ఐదు నెలలు గడుస్తున్నప్పటికీ నేటికీ కూలీ రేట్లు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కాలయాపన చేస్తుందని విమర్శించారు. ఇప్పటికైనా హమాలీలకు ప్రతి నెల 5 వ తేదీ న హమాలీల బిల్లులు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
హమాలీల సమస్యలు పరిష్కరించాలి
21 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 21, 2026, 05:15 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)