test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పరవాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలి : ఎస్ఎఫ్ఐ

20 గంటల క్రితం

sfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 07, 2026, 04:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి –పరవాడ (అనకాపల్లి):  పరవాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీని తక్షణమే ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆదివారం పరవాడలోని సబ్‌స్టేషన్ జంక్షన్ సమీపంలో విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు ఉన్నత విద్యా సదుపాయం కల్పించాలంటూ నినాదాలు చేశారు. ఈ నిరసనను ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ మండల కన్వీనర్ జి. పావని మాట్లాడుతూ, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన పరవాడ మండలంలో ఇప్పటికీ ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా విచారకరమన్నారు. ఇక్కడ కాలేజీ లేకపోవడం వల్ల స్థానిక విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ప్రతిరోజూ గాజువాక, విశాఖపట్నం వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఆర్థికంగా, ప్రయాణ పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లబోదిబోమన్నారు. పరవాడ పరిసర ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీ అందుబాటులో లేకపోవడం వల్ల ఎంతోమంది పేద విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థినులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారిందని పావని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, పరవాడలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ కాలేజీ ఏర్పాటుపై ప్రభుత్వం స్పందించకుంటే రాబోయే రోజుల్లో విద్యార్థులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు భువన, ప్రియా, లక్ష్మి, తేజతో పాటు స్థానిక విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్