ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. దానికి వందల కొద్దీ కొమ్మలు, ఎన్నో ఊడలు ఉండేవి. ఆ చెట్టు నీడన ఎన్నో పక్షులు, జంతువులు ప్రశాంతంగా జీవించేవి. ఆ మర్రిచెట్టుకు కొత్తగా ఒక చిన్న ఊడ మొలిచింది. అది చాలా సన్నగా, బలహీనంగా ఉండేది. పెద్ద పెద్ద ఊడలన్నీ ఆ చిన్ని ఊడను చూసి ఎగతాళి చేశాయి.
“నువ్వు చాలా సన్నగా ఉన్నావు. గాలి వస్తే చాలు, ఊగిపోతున్నావు. మాలాగా ఈ పెద్ద చెట్టును మోసే బలం నీకు ఎప్పటికీ రాదు” అని అవహేళన చేశాయి. ఆ మాటలకు చిన్ని ఊడ చాలా బాధపడి, ఏడుస్తూ మర్రిచెట్టు కాండం తాతతో మొరపెట్టుకుంది. “తాతగారూ! నేను అందరికంటే బలహీనంగా ఉన్నాను. నావల్ల ఈ చెట్టుకు ఏమైనా ఉపయోగం ఉందా? అసలు నేనిలా ఎందుకు పుట్టాను?” అంది. “కంగారు పడకు, చిన్ని ఊడా! ఏదీ రాత్రికి రాత్రే పెద్దదైపోదు. నీ దృష్టిని ఇతరుల మాటలపై కాదు, నీ లక్ష్యం వైపు పెట్టు. నీవు చేయాల్సిందల్లా ఒక్కటే. రోజురోజుకూ నెమ్మదిగా కిందికి సాగుతూ, ఎలాగైనా భూమిని తాకడానికి ప్రయత్నించు. అప్పుడు నీ శక్తి ఏంటో నీకే తెలుస్తుంది” అని నవ్వుతూ చెప్పాడు కాండం తాత.
తాత గారి మాటలు చిన్ని ఊడలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇక ఎవరి మాటలనూ పట్టించుకోకుండా, రోజురోజుకూ కిందికి పెరగడం ప్రారంభించింది. ఎండకు ఎండినా, వానకు తడిసినా తన ప్రయత్నాన్ని ఆపలేదు. కొన్ని నెలల తరువాత చిన్ని ఊడ ఎట్టకేలకు భూమిని తాకి, భూమిలోకి బలంగా తన వేర్లను పాతుకుంది. నేల నుండి నీటిని, పోషకాలను తీసుకోవడం ప్రారంభించింది. ఆశ్చర్యకరంగా, కొద్ది రోజుల్లోనే ఆ సన్నటి ఊడ ఒక బలమైన స్తంభంలా మారిపోయింది. మర్రిచెట్టుకు ఒక వైపున పడిపోకుండా అండగా నిలిచింది.
“చూశారా! రూపంలో చిన్నదైనా, పట్టుదలతో శ్రమిస్తే ఎంతటి పెద్ద బాధ్యతనైనా మోయవచ్చని ఈ చిన్ని ఊడ నిరూపించింది. మనల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడినా అధైర్యపడకూడదు. ఇతరుల మాటలను పట్టించుకోకుండా, మన లక్ష్యం వైపు పట్టుదలతో పయనిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము” అని మర్రితాత మిగిలిన ఊడలతో అన్నాడు. ఎగతాళి చేసిన పెద్ద ఊడలన్నీ సిగ్గుపడ్డాయి.
“తాతా! పరుల అవహేళనలను, హేళనలను పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే, ఒకరోజు తప్పకుండా విజయం మనల్ని వరిస్తుందనే గొప్ప నమ్మకం, ధైర్యం నీ వల్లే నాకు కలిగాయి” అంది చిన్న ఊడ. ఆ మాటలకు అంగీకార సూచనగా చెట్టుకున్న ఊడలన్నీ తలలూపాయి.
- కె.వి. సుమలత
94926 56255
నవ్విన నాప చేనే పండుతుంది!
26 మే, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది మే 26, 2026, 07:15 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)