test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ముత్తాత వయస్సు చెప్పండి…!

26 మే, 2026

ముత్తాత వయస్సు చెప్పండి…!
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 27, 2026, 04:30 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

‘మీ కోసం తోట నుంచి మంచి మామిడి పళ్ళు తెచ్చాను. వెళ్లి నాన్నమ్మను అడిగి తినండి’ అంటూ బయట ఆడుకుంటున్న రాజు, రాణిని కేక వేసి పరంధామయ్య బజారుకు వెళ్లిపోయాడు. ఆ కేక విని ఇద్దరూ నాన్నమ్మ సుబ్బలక్ష్మి దగ్గరకు వచ్చారు. నాన్నమ్మ రెండు బాగా పండిన బంగినపల్లి మామిడిపళ్ళను కోసి ఇద్దరికీ తినమని ఇచ్చింది. ఆ ముక్కలు తింటూ రాజుకు ఒక సందేహం వచ్చింది.
‘నాన్నమ్మ! ఇప్పుడు మాకు నాన్న ఉన్నారు, నాన్నకు తాతయ్య ఉన్నారు కదా! మరి తాతయ్యకు కూడా నాన్న అయిన మా ముత్తాత బతికే ఉంటే ఆయన వయస్సు ఎంత ఉండేది?’ అని అడిగాడు.
నాన్నమ్మ సుబ్బలక్ష్మి లెక్కల టీచర్‌ కావడంతో పిల్లలతో, ‘నేను ఒక క్లూ చెప్తాను. మీ ఇద్దరూ ఆలోచించి మీ ముత్తాత వయస్సు, తాతయ్య వయస్సు ఎంతో చెప్పండి చూద్దాం!’ అంది. ‘అలాగే నాన్నమ్మ! చెప్పు, మేం కనుక్కుంటాం’ అంటూ రాజు, రాణి ఉత్సాహంగా ముందుకు వచ్చారు.
అప్పుడు నాన్నమ్మ మొదటి క్లూ ఇచ్చింది. ‘మీ ముత్తాత వయస్సుకు, మీ తాతయ్య వయస్సుకు 27 సంవత్సరాల తేడా ఉంటుంది. అలాగే మీ తాతయ్య వయస్సులోని అంకెలను తిరగేసి రాస్తే, మీ ముత్తాత వయస్సు వస్తుంది. ఆలోచించి చెప్పండి’ అంది.
రాజు, రాణి ఇద్దరూ ఆలోచనలో పడ్డారు. ఎంత ఆలోచించినా వారి బుర్రలకు ఆ సమస్య పరిష్కారం దొరకలేదు. వారి ముఖాలు చూసి జాలిపడి, ‘సరే, మీకు ఇంకో క్లూ కూడా ఇస్తున్నాను’ అంటూ రెండో ఆధారం చెప్పింది.
‘మీ ముత్తాత వయస్సును, తాతయ్య వయస్సును పైనుంచి కిందికి చూసినా (తలకిందులుగా చేసినా) లేదా కింది నుంచి పైకి చూసినా ఎటువంటి మార్పు ఉండదు. అంటే సేమ్ టు సేమ్ కనిపిస్తాయి. ఉదాహరణకు “88” అనే సంఖ్యను తిరగేసి చూసినా “88”లాగే కనిపిస్తుంది కదా! అలాంటి సంఖ్యలు అన్నమాట’ అని విడమర్చి చెప్పింది.
ఈసారి రాజు, రాణి గబగబా ఒక పేపర్‌, పెన్ను పట్టుకుని సంఖ్యలతో కుస్తీ పడటం మొదలుపెట్టారు.
‘మీరు ఆలోచిస్తూ ఉండండి… నేను మీకు ఇష్టమైన చక్కని సేమ్యా పాయసం తయారు చేస్తాను’ అని చెప్తూ నాన్నమ్మ వంటింట్లోకి వెళ్లిపోయింది.
ఒక అరగంట అయింది. వంటింట్లో నుంచి నెయ్యి, యాలకుల సువాసనలు వస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో రాజు, రాణి ఇద్దరూ హుషారుగా కేకలు వేస్తూ వంటింట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్లారు. పేపర్ మీద ముత్తాత, తాతయ్యల వయస్సులు రాసి నాన్నమ్మకు గర్వంగా చూపించారు.
నాన్నమ్మ ఆ పేపర్ చూసి ఆశ్చర్యపోయింది!
1. తలకిందులుగా చూసినా మారకుండా ఉండే రెండు అంకెల సంఖ్యలు 11, 88, 69, 96.
2. నాన్నమ్మ చెప్పిన మొదటి క్లూ ప్రకారం, తాతయ్య వయస్సును రివర్స్ చేస్తే ముత్తాత వయస్సు రావాలి. కాబట్టి ఆ రెండు సంఖ్యలు ఒకదానికొకటి రివర్స్ అయ్యేలా ఉండాలి. అవి 69, 96. ఆ సంఖ్యలు తలకిందులుగా చేసినా మారకుండా ఉన్నాయి. అలాగే వాటి మధ్య తేడా కూడా నాన్నమ్మ చెప్పినట్లే ఉంది.
ముత్తాత వయస్సు – తాతయ్య వయస్సు = 96 – 69 = 27 సంవత్సరాలు. (మొదటి క్లూ కూడా అక్షరాలా సరిపోయింది!)
కాబట్టి:
తాతయ్య వయస్సు: 69 సంవత్సరాలు
ముత్తాత వయస్సు: 96 సంవత్సరాలు
ఆ పేపర్ చూసి నాన్నమ్మ ఇద్దరి తలలు నిమిరి, ‘శభాష్! నా బుజ్జి కన్నలు చక్కగా జవాబు పట్టుకున్నారు’ అంటూ తీపి పాయసాన్ని గిన్నెల్లో పోసి ఇద్దరికీ ఇచ్చింది.

– మొర్రి గోపి, కవిటి, శ్రీకాకుళం జిల్లా.
ఫోన్: 88978 82202.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్