ఒకసారి విక్రమాదిత్యుడు తన ఆస్థానంలోని నవరత్నాలతో (ఆస్థాన విద్వాంసులు) కొలువు తీరిన సమయంలో ఒక సందేహాన్ని వెలిబుచ్చాడు. ‘‘మన రాజ్యంలో ఏ విషయంలోనైనా నాకు ఇబ్బంది కలిగించినా ఆనందపడే వారెవరైనా ఉన్నారా?’’ అని అడిగాడు. పైగా చక్కని సమాధానం చెప్పిన వారికి వంద బంగారు నాణేలు బహుమతిగా ఇస్తానన్నాడు. అందరూ ఎవరికి వారు ‘‘అటువంటి వారెవరూ లేరు’’ అనే సమాధానమిచ్చారు. కానీ నవరత్నాలలో విదూషకుడు వినయంగా లేచి నిలబడి, వినమ్రంగా నమస్కరించి, ‘‘అయ్యా! నేనున్నానండి, తమరికి ఇబ్బంది కలిగించినా ఆనందించే వాడిని’’ అన్నాడు. అందరూ విదూషకుడి పని అయిపోయిందని బిత్తరపోయి చూస్తున్నారు. ‘‘ఎలా?’’ అని గంభీరంగా ప్రశ్నించాడు విక్రమాదిత్యుడు. ‘‘ఏమీ లేదు మహాప్రభూ! వేడి చేసిన బంగారపు లోహపు బిళ్లలపై తమ మోము గల ప్రతిమను అద్ది, తమ మోముకు ఇబ్బంది కలిగించి బంగారు నాణేలు తయారు చేస్తున్నా, అటువంటి విలువైన బంగారు నాణేలు పొందగలగడం నాకు ఆనందమే కదా ప్రభూ!’’ అన్నాడు. అతని చమత్కారమైన సమాధానానికి మెచ్చి విక్రమాదిత్యుడు వంద బంగారు నాణేలు బహుమతిగా అందజేశాడు.
- కొమ్ముల వెంకట సూర్యనారాయణ 99496 02721.







కామెంట్‌లు (0)