test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఎల్‌ఐసిలో మళ్లీ వాటాల విక్రయం..!

27 మే, 2026

lic
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 27, 2026, 11:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • వచ్చే నెలలో రూ.10వేల కోట్ల వాటా

న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసి)లో మరికొంత వాటాను ఉపసంహరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.10,000 కోట్లు (1 బిలియన్ డాలర్లు) సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ వాటా విక్రయానికి సంబంధించిన అధికారిక మార్కెటింగ్ ప్రక్రియను వచ్చే నెల జూన్‌లోనే ప్రారంభించే అవకాశం ఉందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ప్రణాళికల ప్రకారం.. జూన్ చివరి వారంలో లేదా జులై ప్రారంభంలో ఎల్‌ఐసిలో దాదాపు 2 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఒఎఫ్‌ఎస్‌) ద్వారా ప్రయివేటు మార్కెట్‌ శక్తులకు విక్రయించాలని ఆర్థిక శాఖ భావిస్తోంది. ఈ భారీ లావాదేవీని పర్యవేక్షించే బాధ్యతను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపమ్‌)‌ పలు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకులైన గోల్డ్‌మన్ శాక్స్ గ్రూప్, మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్, బిఎన్‌పీ పారిబాస్, ఐఐఎఫ్ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ లిమిటెడ్‌లకు అప్పగించింది. ​కాగా.. దీనిపై చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, మార్కెట్ పరిస్థితులను బట్టి వాటా విక్రయ సమయం, పరిమాణంలో మార్పులు ఉండవచ్చని సదరు వర్గాలు తెలిపాయి. దీనిపై ప్రభుత్వం గానీ.. ఎల్‌ఐసి లేదా సదరు బ్యాంకులు గానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.
​పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి కొనసాగుతున్న తరుణంలో ఈ వాటా విక్రయం జరగనుండటం మరింత ఆందోళకరం. ముడి చమురు ధరలు పెరగడం వల్ల దేశీయ దిగుమతి బిల్లు భారం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని, విదేశీ ప్రయాణాలను వీలైనంత వరకు పరిమితం చేసుకోవాలని ప్రధాని మోడీ ప్రజలకు సూచించారు. ముఖ్యంగా పశ్చిమాసియా పరిణామాలతో ఇటీవల స్టాక్‌ మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఎల్‌ఐసి షేర్‌ ‌కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్న వేళ వాటాలను ఉపసంహరించుకోవడం ద్వారా ప్రయివేటు ఇన్వెస్టర్లకు బంపర్‌ ఆఫర్‌ ఇవ్వడమే అవుతుందని నిపుణులు భావిస్తున్నారు. ఎల్‌ఐసిలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 96.5 శాతం వాటా ఉంది. సెబీ నిబంధనలను సాకుగా పెట్టుకుని 2032 లోపు విడతల వారీగా ఎల్‌ఐసిలో కనీసం 25 శాతం వాటాలను విక్రయించాలని మోడీ సర్కార్‌ ‌లక్ష్యంగా పెట్టుకుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్