test1
సోమవారం, 15 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరు రెట్లు పెరిగిన డాలర్ల పోక..

29 మే, 2026

rbi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 12:11 పూర్వాహ్నం | 3 నిమిషాల చదవడం

– ముంచెత్తుతున్న రూ.500 నకిలీ నోట్లు
– జిడిపి వృద్ధి రేటు 6.9 శాతమే
– ఆర్‌‌బిఐ వార్షిక నివేదిక వెల్లడి
ముంబయి : మోడీ ఆర్థిక విధానాలు విదేశీ మారకం నిల్వలకు చిల్లు పెడుతున్నాయి. వాణిజ్య లోటు పెరగడం, విదేశీ అప్పుల చెల్లింపులతొ దేశం నుండి డాలర్లు భారీగా బయటకు తరలిపోతున్నాయి. ఈ పరిణామంపై ప్రభుత్వం, కేంద్ర బ్యాంకు ఆందోళనలో ఉన్నాయని స్పష్టమవుతోంది. గడిచిన ఆర్థిక సంవత్సరం 2025-26లో దేశం నుండి బయటకు వెళ్లిన మొత్తం డాలర్ల పరిమాణం.. లోపలికి వచ్చిన వాటి కంటే 30.8 బిలియన్ డాలర్లు ఎక్కువ (దాదాపు రూ.2.90 లక్షల కోట్లు)గా ఉంది. ఇది 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆరు రెట్లకు పైగా పెరగడం తీవ్ర ఆందోళకరం.
​ ఆర్‌బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా నేతృత్వంలోని సెంట్రల్ బోర్డ్ ఆమోదించిన ‘ఆర్‌‌బిఐ వార్షిక నివేదిక 2025-26’ను శుక్రవారం విడుదల చేసింది. ఆ వివరాలు.. 2023-24 వరకు డాలర్‌ చెల్లింపులు మిగులుగా ఉన్నాయి. గడిచిన రెండేళ్లలో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో పెరిగిన వాణిజ్య లోటుకు తోడు భారత్‌‌లోకి వచ్చే నికర విదేశీ పెట్టుబడులు భారీగా క్షీణించాయి. దీంతో 2025-26లో చెల్లింపుల సమతుల్యత లోటు మరింత పెరిగింది. ఈ లోటును పూర్తిగా ఆర్‌బిఐ విదేశీ మారక నిల్వల నుండి చెల్లించారు. దీనివల్ల దేశ విదేశీ మారక నిల్వలు గణనీయంగా తగ్గాయి. ‌మరోవైపు 2026 మే 22తో ముగిసిన వారానికి భారత విదేశీ మారక నిల్వలు మరోసారి భారీగా క్షీణించాయి. ఈ ఒక్క వారంలోనే నిల్వలు 7.51 బిలియన్ డాలర్లు తగ్గి 681.38 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ ఒడిదొడుకులు, అంతర్జాతీయ పరిణామాల మధ్య రూపాయి విలువను స్థిరంగా ఉంచేందుకు ఆర్‌బిఐ డాలర్లను విక్రయించడం దీనికి ప్రధాన కారణంగా ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

​రూ.500 నోట్లకు డిమాండ్‌..
రూ.2,000 నోట్ల ఉపసంహరణ తర్వాత మార్కెట్‌లో రూ.500 నోట్లకు డిమాండ్ భారీగా పెరిగింది. 2025-26లో బ్యాంకింగ్ వ్యవస్థలో చలామణిలో ఉన్న రూ.500 నోట్ల సంఖ్య 11.2 శాతం పెరిగింది. 2025 మార్చి నాటికి 6,34,458 లక్షలుగా ఉన్న ఈ నోట్ల సంఖ్య, 2026 మార్చి నాటికి 7,05,482 లక్షలకు చేరుకుంది. విలువ పరంగా చూస్తే ఇవి రూ.31.72 లక్షల కోట్ల నుండి రూ.35.27 లక్షల కోట్లకు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో సంఖ్యాపరంగా 41.2 శాతం వాటా, విలువ పరంగా ఏకంగా 86 శాతం వాటా ఒక్క రూ.500 నోటుదే కావడం గమనార్హం. . సంఖ్యాపరంగా రూ.10 నోటు 16.1 శాతం వాటాతో రెండో స్థానంలో ఉంది. మొత్తంగా చూస్తే బ్యాంకింగ్ వ్యవస్థలో చలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువ 11.9 శాతం, సంఖ్య 10.5 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థలో నగదుకు ఉన్న డిమాండ్‌ను సూచిస్తోంది.

​ఏడాదిలో నకిలీ నోట్లు 20 శాతం పెరుగుదల
బ్యాంకింగ్ వ్యవస్థను నకిలీ నోట్ల బెడద తీవ్రంగా వేధిస్తోందని ఆర్‌బిఐ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా రూ.500 నకిలీ నోట్ల చలామణి గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 20 శాతం పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 1,17,722 నకిలీ రూ.500 నోట్లను గుర్తించగా.. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 1,41,907 నోట్లకు చేరింది. వీటితో పాటు 2025-26లో 30,591 నకిలీ రూ.200 నోట్లను కూడా అధికారులు గుర్తించారు. మొత్తంగా బ్యాంకింగ్ వ్యవస్థలో నకిలీ నోట్ల బెడద 5.7 శాతం మేర పెరిగినట్లు ఆర్‌బిఐ పేర్కొంది. మరోవైపు, 2023 మే నెలలో ఉపసంహరించుకున్న రూ.2 వేల నోట్లలో.. 2026 మార్చి 31 నాటికి 98.45 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు కేంద్ర బ్యాంకు తన నివేదికలో స్పష్టం చేసింది. నకిలీ నోట్లను నివారించడంలో బిజెపి సర్కార్‌ ‌విఫలమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

​​వృద్ధి రేటు 6.9 శాతంగా ఉండొచ్చు..
ప్రపంచవ్యాప్తంగా రాజకీయ, ఆర్థిక అనిశ్చితులు సవాలు విసురుతున్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ అత్యంత బలంగా నిలబడనుందని ఆర్‌‌బిఐ పేర్కొంది. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం, ఎగుమతుల మందగమనం వంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ మెరుగైన దేశీయ డిమాండ్ కారణంగా ప్రస్తుత 2026-27లో భారత వృద్ధి రేటు 6.9 శాతంగా నమోదు కానుందని అంచనా వేసింది. 2025-26లో కేంద్ర ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో రూ.2.87 లక్షల కోట్ల మిగులు నిధిని డివిడెండ్‌గా బదిలీ చేసేందుకు ఆర్‌బిఐ బోర్డు ఆమోదం తెలిపింది. ఇది ఇంతక్రితం ఏడాది బదిలీ చేసిన రూ.2.69 లక్షల కోట్ల కంటే 6.7 శాతం ఎక్కువ. దేశీయ పెట్టుబడులు, బంగారం, విదేశీ పెట్టుబడులు భారీగా పెరగడంతో 2026 మార్చి 31 నాటికి ఆర్‌బిఐ బ్యాలెన్స్ షీట్ పరిమాణం ఏకంగా 20.61 శాతం పెరిగి రూ.91.97 లక్షల కోట్లకు చేరింది. ఆర్‌బిఐ వద్ద ప్రస్తుతం ఉన్న మొత్తం బంగారం నిల్వలు 880.52 మెట్రిక్ టన్నులకు పెరిగాయి. కరెన్సీ నోట్ల ముద్రణ కోసం ఆర్‌బిఐ చేసిన ఖర్చు భారీగా తగ్గింది. నోట్ల ముద్రణ కోసం 2024-25లో రూ.6,372.82 కోట్లు ఖర్చు అవ్వగా, డిజిటల్ లావాదేవీల పురోగతి నేపథ్యంలో ఈసారి ఆ ఖర్చు రూ.4,875.20 కోట్లకు తగ్గింది. ఇక దేశంలో సామాన్యుడిని వేధించే ద్రవ్యోల్బణం 4.6 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఆర్‌బిఐ అంచనా వేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్