ప్రజాశక్తి – వేలేరుపాడు రూరల్ (ఏలూరు జిల్లా) : ఏలూరు జిల్లా వేలేరుపాడులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో అక్కాచెల్లెళ్లు సజీవ దహనమయ్యారు. ఈ విషాద ఘటనకు సంబంధించి స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక బజార్ సెంటర్‌లో కల్లు విక్రయిస్తూ పలగాని సావిత్రి (60) జీవనం సాగిస్తున్నారు. తనకు తోడుగా ఉంటుందని భావించి సూర్యాపేట జిల్లాలో ఉంటున్న అక్క సిగ పుల్లమ్మ (64)ను ఇటీవల సావిత్రి తీసుకువచ్చారు. ఇద్దరూ కలిసి వేలేరుపాడులో ఉంటున్నారు. ఈ క్రమంలో తమ ఇంట్లో నిద్రిస్తుండగా సోమవారం అర్ధర్రాతి ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. స్థానికులు గుర్తించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించే క్రమంలో మరో ఇంటికి మంటలు వ్యాపించాయి. మంటల తీవ్రతకు ఇంట్లోని గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో అగ్నికీలలు భారీగా ఎగసిపడ్డాయి. మంటలను అదుపుచేసేందుకు స్థానికులకు సాధ్యపడకపోవడంతో కుక్కునూరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలను అదుపు చేశారు. అప్పటికే పుల్లమ్మ, సావిత్రి సజీవదహనమయ్యారు. వారు నిద్రిస్తున్న మంచంపైనే బూడిదయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అక్కాచెల్లెళ్లు సజీవ దహనం
5 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 03, 2026, 12:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం







కామెంట్‌లు (0)