దేశవ్యాప్తంగా భారీ వర్షాలు: వాతావరణ శాఖ
త్రివేండ్రం: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు స్వల్ప ఆలస్యంతో కేరళంలోకి ప్రవేశించేందుకు సిద్ధమవుతున్నాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండి) తాజా అంచనాల ప్రకారం ఈ నెల 4న కేరళం తీరాన్ని రుతుపవనాలు తాకే అవకాశం ఉంది. దేశంలో అధికారికంగా వర్షాకాలం ప్రారంభం కానుంది. రుతుపవనాల రాకతో దక్షిణ భారత రాష్ట్రాల్లో వచ్చే ఆరు నుంచి ఏడు రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ముఖ్యంగా కేరళంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో 7 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. అరేబియా సముద్రం మీదుగా తేమతో కూడిన గాలులు బలపడుతుండటంతో రుతుపవనాల కదలిక వేగవంతమవుతోంది. దీని ప్రభావంతో కేరళంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని హెచ్చరించింది.
అయితే రుతుపవనాల ప్రారంభంతో పాటు పలు ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలోని వాయువ్య, మధ్య, తూర్పు ప్రాంతాలతో పాటు దక్షిణ ద్వీపకల్ప ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈదురుగాలుల వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని అంచనా వేసింది. దీంతో విద్యుత్ స్తంభాలు, తాత్కాలిక నిర్మాణాలు, వ్యవసాయ పంటలకు నష్టం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు పాటించాలని సూచించింది.








కామెంట్‌లు (0)