అమరావతి : గత కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత చల్లటి కబురు అందించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించాయి. రాష్ట్రంలోని అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలను రుతుపవనాలు తాకినట్లు భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా వెల్లడించింది.
రాబోయే రోజుల్లో రుతుపవనాలు వేగంగా ముందుకు కదలనున్నాయి. ఈ నెల 10వ తేదీ నాటికి ఎపిలోని సగానికి పైగా భూభాగానికి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో రాగల రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తొలకరి జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికే కేరళలోకి ప్రవేశించాల్సిన నైరుతి రుతుపవనాలు, ఈసారి మూడు రోజులు ఆలస్యంగా గురువారం కేరళను తాకాయి. అయినప్పటికీ, ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు వరకు సాగే రుతుపవనాల సీజన్‌లో దేశంలో 90 శాతం మేర సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి స్పష్టం చేసింది. రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటికీ.. ఉక్కపోత, ఎండల తీవ్రత వెంటనే తగ్గే పరిస్థితి లేదని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా దక్షిణ కోస్తా ప్రాంతంలో వేడిగాలుల ప్రభావం మరికొద్ది రోజుల పాటు కొనసాగుతుందని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తొలకరి జల్లులు కురిసి, రుతుపవనాలు పూర్తిగా విస్తరిస్తేనే ఉష్ణోగ్రతలు అదుపులోకి వస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.








కామెంట్‌లు (0)