కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకోవాలి
ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. బలరాం
ప్రజాశక్తి -జీలుగుమిల్లి (ఏలూరు) : ఏలూరు జిల్లాలో పొగాకు రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని, ప్రస్తుతం జరుగుతున్న వేలంలో కిలోకు రూ.200 కూడా ధర పలకకపోవడం దారుణమని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి. బలరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం జీలుగుమిల్లి మండల కేంద్రంలోని సోయం గంగులు ప్రజా సంఘాల కార్యాలయంలో, మండల కార్యదర్శి సిరిబత్తుల సీతారామయ్య అధ్యక్షతన నిర్వహించిన రైతు సంఘం సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ.. పొగాకు రైతులు పెట్టుబడుల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసి పంటను సాగు చేస్తున్నారన్నారు. గత ఏడాది కిలో పొగాకు రూ.360 వరకు ధర పలకగా, ప్రస్తుతం వేలం కేంద్రాల్లో కేవలం రూ.200 నుంచి రూ.240 మధ్యే కొనుగోలు చేస్తున్నారని ఆయన వాపోయారు. ఉత్పత్తి వ్యయాలు విపరీతంగా పెరిగిన తరుణంలో, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కిలోకు సగటున రూ.360 ధర లభించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ (STC) మరియు పొగాకు బోర్డు తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలతో పాటు ఎరువుల ధరలు కూడా రైతుల నడ్డి విరుస్తున్నాయని బలరాం విమర్శించారు. ముఖ్యంగా యూరియా ధరలు కిలోకు రూ.6 నుంచి రూ.15 వరకు పెరగడం రైతులపై అదనపు భారాన్ని మోపుతోందని అన్నారు. వ్యవసాయానికి కనీస మద్దతు ధర (MSP) కల్పించకపోతే, భూమినే నమ్ముకున్న రైతాంగం బతుకుదెరువు కష్టతరమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం అమలవుతున్న యూరియా పంపిణీ విధానంలో మార్పులు తీసుకురావాలని ఆయన కోరారు. కార్డుల ఆధారంగా కాకుండా, నేరుగా పంటలు సాగు చేస్తున్న రైతులకు యూరియా అందించాలని, దీనివల్ల చిన్న, సన్నకారు మరియు కౌలు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని సూచించారు.
ఏలూరులో ఏపీ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు
జులై 3, 4, 5 తేదీల్లో ఏలూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయని బలరాం తెలిపారు. జులై 3న వేలాది మంది రైతుల భారీ ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభకు జాతీయ స్థాయి నాయకులు హాజరవుతారని తెలిపారు. జులై 4, 5 తేదీల్లో సీఎంఎస్ హాల్‌లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులతో మహాసభలు. ఈ మూడు రోజుల పాటు జరిగే మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి కారం భాస్కర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గూడెల్లి వెంకట్రావు, సీఐటీయూ మండల కార్యదర్శి చిట్టిబొమ్మ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)