ముంబై : భారతీయ చలనచిత్ర సంగీత స్వర్ణయుగంలో తన మధురమైన స్వరంతో అలరించిన ప్రముఖ నేపథ్య గాయని సుమన్ కళ్యాణ్పూర్ (89) కన్నుమూశారు. కొంతకాలంగా వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, ఆదివారం రాత్రి ముంబై లోఖండ్‌వాలాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. సోమవారం మధ్యాహ్నం ముంబైలోని శాంటాక్రూజ్‌లో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతి పట్ల ఎన్సీపీ నేత శరద్ పవార్, మహారాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సహా పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
1937 జనవరి 28న ఢాకాలో జన్మించిన ఆమె (అసలు పేరు సుమన్ హెమ్మడి), 1954లో ‘మంగు’, ‘శుక్రాచి చాందిని’ చిత్రాలతో తన గాన ప్రస్థానాన్ని ప్రారంభించారు. హిందీ, మరాఠీ, బెంగాలీ, గుజరాతీ వంటి పలు భాషల్లో దాదాపు 700 నుండి 850కి పైగా పాటలు పాడారు. ఆమె గొంతు మాధుర్యం దిగ్గజ గాయని లతా మంగేష్కర్‌ను పోలి ఉండటంతో ఆమెను అభిమానులు ‘మరో లత’ అని పిలుచుకునేవారు.‘నా నా కర్తే ప్యార్ తుమ్హీ సే’, ‘ఆజ్ కల్ తేరే మేరే ప్యార్ కే’, ‘నా తుమ్ హమే జానో’ వంటి ఎన్నో అజరామరమైన గీతాలను ఆలపించారు. మహమ్మద్ రఫీతో కలిసి సుమారు 140 యుగళ గీతాలు పాడారు. సంగీత రంగానికి ఆమె చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం 2023లో ఆమెను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. ఇటీవలే మరో దిగ్గజ గాయని ఆశా భోంస్లే మరణించిన నేపథ్యంలో, ఇప్పుడు సుమన్ కళ్యాణ్పూర్ కన్ను మూయడం భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటుగా నిలిచింది.








కామెంట్లు (0)