న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచింది. పెట్రోల్‌పై లీటరుకు 86 పైసలు, డీజిల్‌పై 83 పైసలు పెంచినట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. వారంలో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. తాజా పెంపుతో కొచ్చిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.109.60కు, డీజిల్ ధర రూ.98.45కు చేరుకుంది. ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచిన కేంద్రం, ఇప్పుడు మరోసారి భారాన్ని మోపింది. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను కనీసం రూ.15 వరకు పెంచాల్సిన అవసరం ఉందని కేంద్రానికి సూచించినట్లు సమాచారం. అయితే ఒకేసారి భారీ పెంపు చేస్తే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురయ్యే అవకాశం ఉండటంతో, దశలవారీగా ధరలు పెంచే వ్యూహాన్ని కేంద్రం అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022లో రష్యా-ఉక్రెయిన్ వివాదం అనంతరం కూడా కేంద్రం ఇదే విధానాన్ని అనుసరించింది. 2022 మార్చి 22 నుంచి ఏప్రిల్ 16 మధ్య ఇంధన ధరలను 14 సార్లు పెంచి, పెట్రోల్, డీజిల్ ధరలను సుమారు రూ.10 వరకు పెంచింది. అప్పట్లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 110 డాలర్లను దాటడం ఇందుకు కారణంగా పేర్కొన్నారు. అయితే 2022 సెప్టెంబరులో ముడి చమురు ధర 80 డాలర్ల కంటే దిగువకు వచ్చినప్పటికీ, అప్పట్లో పెంచిన ధరలను తగ్గించడంలో కేంద్రం ముందుకు రాలేదనే విమర్శలు వినిపించాయి.
ప్రస్తుతం పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్ పరిస్థితుల కారణంగా ముడి చమురు ధరలు మళ్లీ పెరిగాయని కేంద్రం సమర్థిస్తోంది. మార్చి చివర్లో ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్లను దాటగా, ఏప్రిల్ మధ్య నాటికి అది 83 డాలర్లకు తగ్గింది. అనంతరం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నప్పటికీ, దీర్ఘకాలంగా 100 డాలర్లకు పైన కొనసాగడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హోర్ముజ్ జలసంధి ద్వారా ముడి చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడటం, అలాగే ఇరాన్, రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా ఆంక్షలు ప్రభావం చూపడం వల్ల అంతర్జాతీయ ఇంధన సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.









కామెంట్‌లు (0)