కార్మికుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి
విజయవాడ : విశాఖ స్టీల్‌ప్లాంట్ ఘోర ప్రమాదంలో మరణించిన 9 మంది కార్మికులకు సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం ప్రకటించింది. ఊహించని ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. అనేకమంది తీవ్రంగా గాయపడటం పట్ల సిపిఎం రాష్ట్ర కమిటీ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. మరణించిన మృతుల కుటుంబాలకు ప్రగాడ సానుభూతిని ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలని వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసింది. గాయపడిన ప్రతి ఒక్కరికి రూ.50 లక్షలు ప్రకటించాలని, తక్షణం మెరుగైన వైద్య సహాయం అందించాలని కోరింది. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని ప్రయివేటీకరిచేందుకు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ ప్లాంటు పూర్తిగా దెబ్బతింటున్నదని పేర్కొంది. అందువల్ల ఈ మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపింది. కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి దీనిపై ప్రజలకు పూర్తి వివరణ ఇవ్వాలని కోరింది. తక్షణమే ఈ ప్రమాద కారణాలపై విచారణ జరపాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ప్రభుత్వ ప్యాకేజీ ప్రకటిస్తున్నామని, ఆధునికరిస్తున్నామని చేసిన ప్రకటనలు ఆర్భాటానికేనని తేలిపోయిందని పేర్కొంది. కాలం చెల్లిన యంత్రాలను వాడడం, నాసిరకం మెటీరియల్ వాడడం, ఎప్పటికప్పుడు వాటిని మెయింటనెన్సు చేయకపోవడం ఫలితంగా తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని తెలిపింది. క్వాలిటీ చెక్‌చేసేవారు లేకపోవడం, పాత వారిని తొలగించి అనుభవం లేని కొత్త కాంట్రాక్టు కార్మికులను అదీ తక్కువ మందిని పెట్టడం, యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఆగ్రహించింది. ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని , కార్మికుల సంఖ్యను పెంచి ఆధునీకరించడానికి అవసరమైన నిధులు కేటాయించాలని డిమాండ్ చేసింది.







కామెంట్‌లు (0)