test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఇరాన్ యుద్ధంపై ట్రంప్‌కు సెనేట్‌లో షాక్..

20 మే, 2026

trump
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 20, 2026, 09:08 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం


వాషింగ్టన్: ఇరాన్‌పై సైనిక చర్యకు సిద్ధమవుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు స్వదేశంలోనే రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. యూఎస్ సెనేట్‌లో ఇరాన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానానికి అధికార రిపబ్లికన్ పార్టీకి చెందిన పలువురు సభ్యులు మద్దతు ఇచ్చారు. ఈ తీర్మానాన్ని ముందుకు తీసుకువెళ్లే విధానపరమైన చర్యపై సెనేట్‌లో జరిగిన తొలి కీలక ఓటింగ్‌లో యుద్ధ వ్యతిరేక తీర్మానం 50-47 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్ బిల్ కాసిడీతో పాటు మరో ముగ్గురు అధికార పార్టీ సభ్యులు డెమోక్రాట్లతో కలిసి తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. ఇరాన్ అంశంపై వైట్‌హౌస్, పెంటగాన్ కాంగ్రెస్‌కు పూర్తి సమాచారం ఇవ్వకుండా వ్యవహరిస్తున్నాయని, స్పష్టత వచ్చే వరకు సైనిక చర్యకు మద్దతు ఇవ్వలేమని బిల్ కాసిడీ వ్యాఖ్యానించారు. అయితే, 100 మంది సభ్యులున్న సెనేట్‌లో ఈ తీర్మానం ఆమోదం పొందినప్పటికీ, అది చట్టంగా మారేందుకు ఇంకా పలు కీలక దశలను దాటాల్సి ఉంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ వీటో విధించే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, ఆ వీటోను అధిగమించాలంటే రిపబ్లికన్ల ఆధ్వర్యంలోని ప్రతినిధుల సభలో కూడా తీర్మానం ఆమోదం పొందాల్సి ఉంటుంది. అంతేకాకుండా, సభ మరియు సెనేట్ రెండింటిలోనూ మూడింట రెండు వంతుల మెజారిటీ అవసరం అవుతుంది.

ఇరాన్ యుద్ధ అంశంపై ఈ ఏడాది సెనేట్‌లో ఇలాంటి తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు జరిగిన ఏడు ప్రయత్నాలను ట్రంప్‌కు మద్దతుగా ఉన్న రిపబ్లికన్ సభ్యులు అడ్డుకున్నారు. ఇదే విధంగా ప్రతినిధుల సభలో కూడా యుద్ధ అధికారాలను పరిమితం చేసే మూడు తీర్మానాలు స్వల్ప ఓట్ల తేడాతో నిలిచిపోయాయి. దీంతో, యుద్ధంపై అమెరికా కాంగ్రెస్‌లో రాజకీయ విభేదాలు మరింత తీవ్రరూపం దాల్చుతున్నాయి. మరోవైపు యుద్ధం వల్ల అమెరికాపై పడుతున్న ఆర్థిక భారం, పెరుగుతున్న ఇంధన ధరలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.

ఇరాన్‌పై కొత్త వైమానిక దాడులకు ట్రంప్ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ, సౌదీ అరేబియా సహా గల్ఫ్ దేశాల విజ్ఞప్తితో వాటిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సమాచారం. అయితే చర్చలకు ఇరాన్ అంగీకరించకపోతే కఠిన చర్యలు తప్పవని ట్రంప్ హెచ్చరించారు. యుద్ధ పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతుండగా, అమెరికాలో ఇంధన ధరలు గ్యాలన్‌కు 4.53 డాలర్లకు చేరుకున్నాయి. దీంతో ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ యుద్ధ వ్యతిరేక తీర్మానంపై తుది ఓటింగ్ రాబోయే రోజుల్లో సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభలో కూడా జరగనుంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్