test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అటు రంగస్థలం.. ఇటు విద్యావనం…

6 రోజుల క్రితం

అటు రంగస్థలం.. ఇటు విద్యావనం…
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 01, 2026, 05:05 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం


నాటకాన్ని ప్రేమించి, నటుడిగా శ్రమించి, నిరంతరం నాటక కళామతల్లి సేవలో పునీతమవుతున్న కళాకారుడు కూనపరెడ్డి సత్యనారాయణ. ఒక్కపక్క రంగస్థలంలో రాణిస్తూనే- మరోపక్క విద్యారంగంలోనూ విలువైన సేవలు అందిస్తున్నారు. విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ఐదు దశాబ్దాలకు పైగా రంగస్థల నటుడిగా ఆయన రాణిస్తున్నారు. నటనలో ఎన్టీఆర్‌, ఎస్‌విఆర్‌, ఎఎన్నార్‌లను అనుకరించే ఆయన పౌరాణిక నాటకాల ప్రదర్శనలను బాగా ఇష్టపడతారు. కంచుకంఠంతో డైలాగుల డెలివరీలో స్పష్టత ప్రదర్శిస్తారు. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి జీవిస్తారు. కళాకారుడిగా తనకు నచ్చి, మెచ్చిన నాటక రంగ ప్రదర్శనలు ఎక్కడ జరిగినా వెళ్లి పాల్గొంటారు. తనదైన శైలిలో హావభావాలు ప్రదర్శిస్తూ శభాష్‌ అని పిలిపించుకుంటారు.


కృష్ణాజిల్లా పెడన మండలం చెన్నూరు గ్రామానికి చెందిన కూనపరెడ్డి వెంకమ్మ, నాగేశ్వరరావు దంపతుల కుమారుడు సత్యనారాయణ. చెన్నూరు గ్రామం కళాకారులకు పుట్టినిల్లు. ఆ గ్రామంలో గతంలో ప్రతి ఇంట్లో ఒక కళాకారుడు ఉండేవారు. ఆయన తండ్రి నాగేశ్వరరావు శ్రీరామాంజనేయుద్ధంలో యయాతి, రామాంజనేయ యుద్ధంలో బూరికీర్తి, కురుక్షేత్రంలో ధర్మరాజు పాత్రల్లో దిట్ట. తండ్రిలోని గాత్రం, నటనాశైలిని పుణికిపుచ్చుకున్న సత్యనారాయణ తనకంటూ సరికొత్త ఒరవడితో నాటక రంగ కళాకారుడిగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గుర్తింపు పొందారు. ప్రముఖ రంగ స్థల నటులు ఆచంట వెంకటరత్నం నాయుడు గాత్రాన్ని సత్యనారాయణ అన్వయిస్తూ పద్యాలు అవలీలగా పాడతారు. విజయనగరానికి చెందిన బి.రామచంద్రరావు నాయుడు స్ఫూర్తితో ఆయన విశ్వామిత్ర పాత్రను ఎంపిక చేసుకున్నారు. విశ్వామిత్ర రాజరుషి పాత్రలో వికటాట్టహాసం కాకుండా అవసరం మేరకే రాగాలాపన చేస్తారు. డైలాగుల డెలివరీ లోనూ, పద్యాల ఆలాపనలోనూ స్పష్టతతో కంచుకంఠంతో ఆలపించేవారు. పదాన్ని విడమర్చి చెప్పటంలోనూ దిట్ట. మహానటులు ఎన్టీఆర్‌, ఎస్‌విఆర్‌ వంటి సినీరంగ ప్రముఖుల సినిమాలను వీక్షిస్తూ వారిని అనుకరించేవారు. డైలాగుల డెలివరీ అచ్చు వారిలాగే ఉండేది. పద్యాలు ఆలపించటంలోనూ, రాగాలు తీయటంలోనూ, హావభావాలను ప్రదర్శించటంలోనూ సరికొత్త ఒరవడి ప్రదర్శించారు.


సత్యనారాయణ తన 11వ ఏటనే పాఠశాలలోని వివిధ వేదికలపైన తన నటనను ప్రదర్శించి ఉపాధ్యాయులు, తోటి విద్యార్థుల నుంచి అభినందనలు అందుకున్నారు. తెలుగు పండితులు మద్దూరి రామ్మోహనరావు ఆయన నటనా కౌశలాన్ని ప్రోత్సహించి అనేక నాటికల ప్రదర్శనలకు అవకాశం కల్పించారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యను చెన్నూరు ప్రభుత్వ పాఠశాలలోనూ, ఐటిఐ, డిప్లమోను కాకినాడలో పూర్తిచేశారు. అనంతరం ధవళేశ్వరంలో సాంకేతిక విద్యకు సంబంధించిన శిక్షణను పూర్తిచేశారు. అటు కళాశాల ఉద్యోగం, ఇటు కళారంగంలో ప్రతిభను సుసంపన్నం చేసుకున్నారు. ఎందరో విద్యార్థులకు దిశా నిర్ధేశం చేస్తూ మార్గ దర్శకులుగా నిలిచారు. ఐటిఐ కళాశాలలో అధ్యాపక వృత్తి చేపట్టి కళాశాల ప్రిన్సిపల్‌గా స్థిరపడ్డారు. ఆ తర్వాత ఎస్‌పిఎఎం ఐటిఐ కళాశాలను స్థాపించి ఏటా వేలాదిమంది విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు.

అటు రంగస్థలం.. ఇటు విద్యావనం…

విశ్వామిత్రుడిగా నట విశ్వరూపం
ఏడు పదుల వయస్సులోనూ నాటక ప్రదర్శనల్లో చురుగ్గా పాల్గొంటూ తనలోని కళాపిపాసను బయటపెడుతున్నారు. ఎక్కడ నాటక కళాప్రదర్శనలు జరిగినా వెళ్లి వీక్షిస్తూ వాటిని ప్రోత్సహించటంలోనూ ఆయన ముందుంటారు. కళాకారుడిగా పలు పాత్రల్లో ఆయన నటించి మెప్పిస్తున్నారు. పాత్ర ఏదైనా పరిణిత నటనతో అందులో జీవించటం ద్వారా ఉత్తమ నటుడిగా అనేక పురస్కారాలు, అభినందనలు అందుకున్నారు. పౌరాణిక నాటకాల్లో సత్యహరిశ్చంద్రలో విశ్వామిత్రునిగా, రామాంజనేయ యుద్దంలో లక్ష్మణుడిగా ఆయన నటనా కౌశలం అద్భుతం. పల్లెపడుచు, చిల్లరకొట్టు చిట్టెమ్మ, పూలరంగడు సాంఘిక నాటకాల్లో ఆయన కనబర్చిన నటన అద్వితీయం. జై శ్రీ నాట్యమండలి అధినేత కీర్తిశేషులు కొడాలి వీరాంజనేయులు గారి కుమారుడు కొడాలి రాజా వద్ద పౌరాణిక నాటకాల్లో నటనా ప్రావీణ్యం పొంది దుద్దుకూరి సాయిబాబు, కోరుకొల్లు నాని ప్రోత్సాహంతో జూనియర్‌ డివి సుబ్బారావు, పద్మశ్రీ వై.గోపాలరావు, ఉప్పాల నాంచారయ్య, ఉప్పలపాటి సైదులు, పి.లక్ష్మణరావు, బెండపూడి రామారావు, కిలారు లక్ష్మి, జయ నిర్మల, బొబ్బిలి సావిత్రి, ఎ.వెంకటేశ్వరరావు, పి.వి.రామాంజనేయులు మొదలైన వారితో కలిసి నటించారు. పౌరాణిక సంస్థల దిగ్గజాల చేత కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చి మెప్పించారు.

అత్యుత్తమ పౌరులుగా…
విద్యావేత్తగా, విద్యాసంస్థ అధినేతగా విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దటంలో ఆయన తన వంతు పాత్ర పోషిస్తున్నారు. పదో తరగతి పూర్తిచేసిన విద్యార్థులకు ఉపాధి శిక్షణకు అవసరమైన కోర్సులు ఎంపిక చేసుకునేలా ‘స్పామ్‌’ ఐటిఐను ముదినేపల్లిలో ఏర్పాటు చేశారు. గత 30 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యాప్రమాణాలను పాటిస్తూ విద్యార్థులకు సాంకేతిక విద్యను అందిస్తున్నారు. కళా,సాంస్కృతిక, భాషా రంగాల్లో అపారమైన అనుభవం, ప్రజ్ఞ ఉన్న ఆయన నిరంతరం కొత్త విషయాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ తమ కళాశాలలో చదివే విద్యార్థినీ విద్యార్థులను ఉపాధి శిక్షణలో సరికొత్త ఒరవడి, నైపుణ్యాలను పెంపొందిస్తున్నారు. కోర్సు పూర్తయిన వెంటనే జీవనోపాధి పొందేలా ఉపాధి, నైపుణ్య కోర్సుల్లో వారిని ప్రోత్సహిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉపాధి కల్పనా శాఖల ద్వారా ఇచ్చే శిక్షణల్లోనూ పాల్గొనేలా చేస్తున్నారు.

 

రంగస్థలం అమితమైన ఇష్టం
నా తండ్రి, కీర్తిశేషులైన ప్రముఖ కళాకారుల వారసత్వంగా నటనారంగాన్ని ఎంచుకున్నా. విశ్వామిత్రుడుగా గుర్తింపు పొందా. పోషించిన ఏ పాత్రలోనైనా జీవించటం నా నైజం. నాటక రంగంపై ఉన్న మక్కువతోనే నేటికీ నాటక, నాటిక ప్రదర్శనల్లో పాల్గొంటున్నా. నిరంతరం కళామతల్లి ముద్దుబిడ్డగా జీవించటమే నాకిష్టమైన పని. భావితరాలకు ప్రాచీన నాటక కళలను తెలియజేసే లక్ష్యంతో కృషిచేస్తున్నా.
– కూనపరెడ్డి సత్యనారాయణ
ప్రిన్సిపల్‌, స్పామ్‌ ఐటిఐ కళాశాల, నాటక రంగ ప్రముఖులు, ముదినేపల్లి

– శేవా సెల్వరాజు
ప్రజాశక్తి ముదినేపల్లి విలేకరి,
ఏలూరు జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్