రోజువారీ వేతనం రూ.260 మాత్రమే
విజయనగరం జిల్లాలో ఉపాధి కార్మికుల దుస్థితి
ఎండ వేడిమికి ఆరుగురు మృత్యువాత
ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి పనుల్లో విజయనగరం జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. కూలిరేటులో మాత్రం 20వ స్థానానికి పరిమితమైంది. జిల్లాలో రోజుకు సగటున 2.43 లక్షల మంది కార్మికులు ఉపాధి పనులకు వెళ్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు) 2.36 లక్షల కుటుంబాలకు చెందిన 3.12 లక్షల మంది కార్మికులు హాజరైనట్టుగా అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ విషయంలో విజయనగరం జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచినప్పటికీ, రూ.307 సాధారణ వేతనానికి గాను కేవలం రూ.260 మాత్రమే కార్మికులకు దక్కుతోంది.
మార్కాపురం, ప్రకాశం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, బాపట్ల, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో అంతకన్నా తక్కువ వేతనాలు అందుతున్నాయి. పనులు చేయడంలో వెనుకబడి ఉన్న 19 జిల్లాల్లో విజయనగరం కన్నా మెరుగైన వేతనాలు అందుతున్నాయి. ముఖ్యంగా విజయనగరం జిల్లాకు ఆనుకుని ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాలో రూ.300, కోనసీమలో రూ.297, పోలవరం జిల్లాలో రూ.296 చొప్పున సగటు వేతనాలు అందుతుండడం గమనార్హం.
తీవ్రమైన ఎండతో మృత్యువాత
సాగునీటి వనరులు లేకపోవడం వల్ల వ్యవసాయ పనులు తగ్గిపోవడం, పారిశ్రామికంగానూ జిల్లా వెనుకబడి ఉండడం వంటి కారణాలతో చదువుకున్న యువత సైతం ఉపాధి పనులబాట పట్టింది. దీంతో, విజయనగరం జిల్లాలో లక్షలాది కుటుంబాలు కేవలం ఉపాధి పనులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. ఈ క్రమంలో తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయడం లేదు. వేడి తట్టుకోలేక ఈ నెల 12న గజపతినగరం మండలం గంగచోళ్లపెంటకు చెందిన గుదే సత్యం (60) మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 30న వేపాడ మండలం సోంపురంలోని టేకుమానుచెరువులో పని ప్రాంతంలో కొటాన రాములమ్మ మరణించించారు. మరో నలుగురు కార్మికులు కూడా వడదెబ్బకు గురై మరణించారు.
శ్రమకు దక్కని ప్రతిఫలం
ఉపాధి హామీ అధికారిక కూలి రేటు రోజుకు సుమారు రూ.307గా ఉన్నప్పటికీ, కార్మికుల చేతికి వచ్చే సగటు వేతనం మాత్రం జిల్లాల వారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. విజయనగరం జిల్లాలో సగటు వేతనం రూ.260 వస్తున్నట్టు అధికారులు లెక్కలు కట్టినప్పటికీ, మే నెలలో అందింది రూ.258 మాత్రమే. ఇంతకన్నా తక్కువ వేతనం అందుకుంటున్నవారు కూడా అక్కడక్కడ ఉన్నారని సమాచారం. శ్రమకు తగ్గట్టుగా కూలిరేట్లు పెంచకపోవడం, పనుల కొలతల విధానంలో లోపం ఇందుకు మూల కారణాలని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు పూర్తిస్థాయిలో జరగలేదనే పేరుతో తమకు పూర్తి వేతనం చెల్లించడం లేదని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి హామీకి నిధులు, పనిదినాలు, కూలి పెంచాలని సిపిఎం, వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాయి.
రెండు పూటల పనికి రూ.200 : – చల్ల తిరుపతి, ఉపాధి కార్మికుడు, పాత బగ్గాం, గజపతినగరం మండలం, విజయనగరం జిల్లా
గత రెండు నెలల్లో ఉదయం7 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు ఉపాధి పనులు చేస్తున్నాం. కానీ, రూ.200 మంచి కూలి రావడం లేదు. తీవ్రమైన ఎండలో మట్టిపని చేయడం చాలా కష్టం. కూలాడితే తప్ప కుండాడని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి తప్పడం లేదు. పని ప్రదేశాల్లో కనీసం నీరు, నీడ వంటి సదుపాయాలు కూడా లేవు.









కామెంట్‌లు (0)