వామపక్ష నేతల డిమాండ్
9న రాష్ట్రవ్యాప్త రాస్తారోకోలను జయప్రదం చేయండి : వి.శ్రీనివాసరావు పిలుపు
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి: కేజీ బేసిన్ లో ఉత్పత్తి అవుతున్న గ్యాస్ మనదే అని, దాని పై హక్కు కూడా మనదేనని వామపక్ష పార్టీల నేతలు అన్నారు. 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సు ప్రకారం కెజి బేసిన్‌లో ఉత్పత్తి అయ్యే గ్యాస్ లో రాష్ట్రానికి 50 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వివిధ వామపక్ష నేతలు శనివారం కేజీ బేసిన్ గ్యాస్ ప్రాంతంలో పర్యటించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం గాడిమొగలోని రిలయన్స్ ప్రైవేటు సంస్థ వద్ద ఈ సందర్భంగా ఆందోళన చేపట్టారు. రిలయన్స్ దోపిడీని అరికట్టాలని, 50 శాతం వాటా ఇవ్వాలని, వామపక్ష పార్టీల ఐక్యత వర్ధిల్లాలని, పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని తదితర డిమాండ్లతో నినాదాలు చేశారు.అనంతరం ఒఎన్‌జిసి సంస్థ వద్ద , కాకినాడ లోనూ నిర్వహించిన విలేకరుల సమావేశంలో వామపక్ష నేతలు మాట్లాడుతూ ‘మన గ్యాస్.. మన హక్కు’ అని నినదించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేజి బేసిన్ గ్యాస్‌లో రాష్ట్రానికి రావాల్సిన వాటా కోసం పోరాటం చేయాలన్నారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గ్యాస్ పై మనకే హక్కు ఉండాలని, 50 శాతం వాటా ఇవ్వాలని, గ్యాస్, ఆయిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 9న రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకోలు నిర్వహించనున్నట్లు చెప్పారు. అంతర్జాతీయంగా గ్యాస్, ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయి బ్లాక్ మార్కెట్లో సైతం అమ్ముతున్న సంక్షోభం నెలకొందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలోని కేజీ బేసిన్‌లో లభిస్తున్న ఆయిల్, గ్యాస్ మీద మన రాష్ట్రానికి ఎలాంటి హక్కు లేకపోవడం శాపంలా మారిందన్నారు. ఒక వైపు ప్రపంచ మార్కెట్ ను అమెరికా శాసిస్తుంటే, రెండో వైపున మన దేశంలో, మన రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నింటినీ రిలయన్స్ కంపెనీ శాసించటం వల్ల ప్రజలకు ఈ దుస్థితి పట్టిందన్నారు. ఐదారునెలలుగా ప్రజలకు గ్యాస్ దొరకడం అత్యంత కష్టతరంగా మారిందన్నా రు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు అంబాని, రిలయన్స్ వంటి పెద్ద కంపెనీలకు కొమ్ము కాస్తూ దేశ సంపదను దోచిపెడుతున్నాయని విమర్శించారు. ఒఎన్‌జిసి, కేంద్ర ప్రభుత్వం కలిసి రూ.వేల కోట్లు పెట్టుబడులు పెట్టి, గ్యాస్ నిక్షేపాలు కనుగొన్న తర్వాత ఎటువంటి పెట్టుబడి పెట్టని రిలయన్స్ కి పెత్తనం దక్కిందన్నారు. రోజుకు 21 వేల టన్నుల గ్యాస్ ఇక్కడ తయారవుతుందని, మన రాష్ట్ర అవసరాలకు నాలుగు వేల టన్నులు సరిపోతుందని, ఇందులో సగం మన రాష్ట్రానికి ఇవ్వాలని 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసు చేసిందన్నారు. ఆ ప్రకారం మనకు రూ.200 కే గ్యాస్ సిలిండర్ లభిస్తుందని, రూ. పది వేల కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని తెలిపారు. అందువల్లే వామపక్ష పార్టీలు మన గ్యాస్, మన హక్కు అని, కేజీ బేసిన్‌లో రిలయన్స్ చేస్తున్న దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు. ఈ ప్రాంతంలో లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి, 50 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రిలయన్స్ సంస్థ ఇప్పటి వరకు 3 వేల ఉద్యోగాలు మించి ఇవ్వలేదన్నారు. పైగా ఆ సంస్థ కార్యకలాపాల వల్ల కాలుష్యం పెరుగుతోందన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు మాట్లాడుతూ, సంపద సృష్టిస్తానని ఎన్నికల సందర్బంగా చంద్రబాబు చెప్పారని, అయితే రాష్ట్రంలో ఉన్న సంపదను సిఎం అయిన తర్వాత కూడా కాపాడ లేక పోతున్నారని విమర్శించారు. ప్రధాని మోడీతో పోట్లాడి మనకు రావాల్సిన 50 శాతం వాటాను రాబడితే సంపద సృష్టించ వచ్చాన్నారు. ఈ నేపథ్యంలో 9న చేపట్టనున్న రాస్తారోకో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ మాట్లాడుతూ, మన రాష్ట్రం నుండి తీసుకుపోతున్న గ్యాస్‌తో గుజరాత్‌లో తక్కువ ధరకే గ్యాస్ ఇస్తున్నారని చెప్పారు. ఈ అక్రమ దోపిడీని అరికట్టాలని,ఈ దోపిడీ ఇక చెల్లదని రాష్ట్ర ప్రజలు ఎలుగెత్తి చాటాలన్నారు. సిపిఐ (ఎంఎల్) రాష్ట్ర కమిటీ సభ్యుడు జాస్తి కిషోర్ బాబు మాట్లాడుతూ, రిలయన్స్ దోపిడీని గుర్తించిన తర్వాత అంతర్జాతీయ నిపుణులు వచ్చి రూ.155 కోట్ల డాలర్ల పెనాల్టీ వేశారన్నారు. దీనిపై సుప్రీం కోర్టులో కూడా తాజాగా కేసు నడుస్తుందన్నారు. యుద్ధం జరిగి మొత్తం దేశమంతా గ్యాస్, ఆయిల్ వనరులకు సంబంధించిన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో తాజా త్రైమాసికంలో రూ. 27 వేల కోట్ల లాభాన్ని రిలయన్స్ కంపెనీ ప్రకటించగలిగిందన్నారు. సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు రామకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న ఆయిల్ రాష్ట్ర ప్రజలకే దక్కాలనే ఉద్దేశ్యంతో పది వామపక్ష పార్టీలు కలిసి రిలయన్స్ దోపిడీ చేస్తున్న ప్లాంట్ ను సందర్శించినట్టు చెప్పారు. ఈ పర్యటనలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎవి. నాగేశ్వరరావు, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు ఎ. సూర్యనారాయణ, సిపిఐ (ఐఎంఎల్) జిల్లా నాయకులు జె.వెంకటేశ్వర్లు, జె. పాండవులు, సిపిఎం జిల్లా కార్యదర్శి కరణం ప్రసాదరావు, జిల్లా నాయకులు దువ్వా శేషబాబ్జి, పి. రాజశేఖర్, కెఎస్ శ్రీనివాస్, జి. బేబీ రాణి, టేకుమూడి ఈశ్వరరావు, వి. రాజబాబు, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, కోనసీమ జిల్లా కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, బలరాం, సిపిఐ నాయకులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)