test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

'పెట్రో` పెంపుపై భగ్గుమన్న రాష్ట్రం

15 మే, 2026

cpm protest
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 15, 2026, 11:37 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- సిపిఎం ఆధ్వర్యంలో రాష్ర్టవ్యాప్తంగా ఆందోళనలు
- కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టిన సామాన్య ప్రజానీకం
ప్రజాశక్తి - యంత్రాంగం : పెట్రోలు, డీజిల్ ధరల పెంపుపై రాష్ట్రం భగ్గుమంది. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ సిపిఎం, సిఐటియు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఎక్కడిక్కడ నిరసనలు, ఆందోళనలు హోరెత్తాయి. మోటర్ సైకిల్ కు, ఆటోలకు తాడుకట్టి నిరసనలు తెలిపారు. సామాన్య ప్రజలు సైతం రోడ్డెక్కి కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పశ్చిమాసియా యుద్ధాన్ని బూచిగా చూపి గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలు పెచ్చడం దుర్మార్గమన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ధరలు పెంచబోమని నమ్మబలికిన మోడీ.. ఓట్లు పడగానే ధరలు పెంచి ప్రజలకు నమ్మకద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రజలపై భారాలు మోపే చర్యలు కేంద్ర ప్రభుత్వం విడనాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఎన్నికలు ముగియగానే, ప్రజలపై భారం మోపడం "ప్రజలపై యుద్ధం" వంటిదని పలువురు నాయకులు విమర్శిస్తున్నాయి.
విజయవాడ కలెక్టరేట్ సమీపంలోని పెట్రోల్ బంకు వద్ద మోటార్ సైకిల్‌ను రిక్షా బండికి కట్టి లాగుతూ నిరసన తెలిపారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్‌పై రూ.3.30, డీజిల్‌పై రూ.3.14 చొప్పున ధరలు పెంచి సామాన్య, మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచిందన్నారు. పన్నుల రూపంలోనే లీటరుకు రూ.45 నుండి రూ.46 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్నాయని వివరించారు. కేంద్రంలో భాగస్వాములుగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పటికైనా నోరు విప్పి రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఆర్ టిసి కాంప్లెక్స్ దరి గురజాడ విగ్రహం వద్ద ఆటో లాగి నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్‌‌టిసి కాంప్లెక్స్‌ ‌వద్ద ,పరవాడ సినిమా హాల్ జంక్షన్ వద్ద ఆందోళన చేపట్టారు. చోడవరంలో ఆటోలకు తాళ్లు కట్టి బస్టాండ్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకూ లాగారు. తిరుపతిలో సిపిఎం కార్యాలయం నుంచి సుందరయ్య నగర్ సర్కిల్ వరకు వినూత్న నిరసన ప్రదర్శన నిర్వహించారు. వాహనానికి కర్ర కట్టి మోసుకెళ్తూ, మరోవైపు సైకిల్ తొక్కుతూ నిరసన తెలిపారు. పెట్రోలు కొనలేం.. బండి నడపలేం, “ఇక మాకు సైకిలే దిక్కు”, “ధరలు తగ్గించాలి” అంటూ నినాదాలు చేశారు.
డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో గడియారస్తంభం సెంట‌ర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతపురంలో ఆటోలను ఎద్దుల బండికి కట్టుకుని లాగారు. సప్తగిరి సర్కిల్‌ ‌నుంచి టవర్‌‌క్లాక్‌ ‌వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ఆటోను తాళ్లతో లాగారు. మార్కాపురం పట్టణంలో మోటార్ బైకులను, ఆటోలను తాళ్లతో కట్టి లాగారు. బాపట్ల, చీరాల, రేపల్లెలో ఆందోళన చేపట్టారు. నెల్లూరు సిటీ ముత్తుకూరు గేట్ సెంటర్ నుండి నిరసన ర్యాలీ నిర్వహించారు. కడపలో నిరసన తెలిపారు. గుంటూరులో శంకర్‌ ‌విలాస్‌ ‌సెంటర్‌‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆల్ ఇండియా రోడ్డు ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నన్నపనేని శివాజీ పాల్గొన్నారు. కర్నూలు కలెక్టరేట్‌, నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఆందోళన చేపట్టారు. ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఆర్‌‌టిసి పెట్రోల్ బంక్ వద్ద ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. నూజివీడు, ముసునూరు, జంగారెడ్డిగూడెం, పశ్చిమగోదావరి జిల్లాపెంటపాడు మండలం అలంపురంలో ఆందోళన చేపట్టారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్