‘విబి గ్రామ్ జి’ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమాలు
ఆగస్టులో పాదయాత్రలు.. సెప్టెంబర్ 15న చలో ఢిల్లీ
బికెఎంయు జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో నేతల పిలుపు
ప్రజాశక్తి – ఒంగోలు సిటీ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి దాని స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న ‘విబి గ్రామ్ జి ‘ చట్టాన్ని దేశ ప్రజలు అంగీకరించబోరని సిపిఐ జాతీయ నాయకులు హెచ్చరించారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రజాపోరాటాలు నిర్వహిస్తామని ప్రకటించారు. భారతీయ కిసాన్ మజ్దూర్ యూనియన్ (బికెఎంయు) జాతీయ కౌన్సిల్ సమావేశాలు గురువారం ఒంగోలులోని మల్లయ్య లింగం భవనంలో ప్రారంభమయ్యాయి. ‘ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలి – విబి గ్రామ్ జి రద్దు చేయాలి’ అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో 18 రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. సెమినార్‌కు బికెఎంయు జాతీయ అధ్యక్షుడు పెరియార్ స్వామి అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శులు అన్నీ రాజా, కె.రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య హాజరయ్యారు.
జాతీయ కార్యదర్శి అన్నీ రాజా మాట్లాడుతూ… నిరుద్యోగ, పేదరిక నిర్మూలన పేరుతో అధికారంలోకి వచ్చిన బిజెపి ప్రభుత్వం, ఇప్పుడు గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్నే బలహీనపరుస్తోందని విమర్శించారు. అవసరమైన నిధులు కేటాయించకుండా చట్టాన్ని నిర్వీర్యం చేసి, ఇప్పుడు ‘విబిగ్రామ్ జి’ పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావడం పేదల జీవన హక్కుపై దాడేనని పేర్కొన్నారు. గ్రామీణ కార్మికులకు 100 రోజుల పని హామీ ఇవ్వాల్సి ఉండగా అనేక ప్రాంతాల్లో 50 రోజులకే పరిమితం చేస్తున్నారని, కూలి బకాయిలు కూడా చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కె.రామకృష్ణ మాట్లాడుతూ… పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేస్తే ప్రజలు సహించరని హెచ్చరించారు. దేశంలో 40 శాతం మంది గ్రామీణ పేదలకు ఉపాధి హామీ చట్టం ఆధారమైందని పేర్కొన్నారు. విబి గ్రామ్ జి చట్టానికి వ్యతిరేకంగా ఆగస్టు ఆరు నుంచి 15 వరకు దేశవ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహించి, సెప్టెంబర్ 15న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పేదలపై భారాలు మోపుతున్నారని విమర్శించారు. బిజెపికి వ్యతిరేకంగా మాట్లాడే వారిపై ఇడి, సిబిఐ సంస్థలను ఉపయోగించి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
ఈశ్వరయ్య మాట్లాడుతూ… పేదల పొట్టకొట్టే విబి గ్రామ్ జి చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామన్నారు. సిపిఐతో పాటు ప్రజాసంఘాలు, ఇతర రాజకీయ పక్షాలను కలుపుకుని ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో బికెఎంయు గౌరవాధ్యక్షుడు జల్లి విల్సన్, జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్.వెంకట్రావు, మార్కాపురం జిల్లా సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)