ప్రజాశక్తి – అనకాపల్లి : జివిఎంసి అనకాపల్లి జోన్‌లో ఖాళీగా ఉన్న పారిశుధ్య కార్మికుల పోస్టులను భర్తీ చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎవి.నాగేశ్వరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమస్యలపై జివిఎంసి అనకాపల్లి జోనల్ కార్యాలయం వద్ద రెండో రోజైన గురువారమూ కార్మికులు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనకాపల్లిలో మున్సిపాల్టీ కాలం నుంచి వారసత్వంగా కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. ఆ పద్ధతినే జివిఎంసి ఆధికారులు అమలు చేయాలన్నారు. ప్రస్తుతం కార్మికులపై పనిభారం తగ్గించాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పర్మినెంట్ కార్మికులకు పిఆర్‌సి, డిఎ, సరెండర్ లీవ్‌లతో పాటు పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని కోరారు. జోన్‌లో 15 మంది కార్మికులకు ఎనిమిది నెలల నుంచి వేతనాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. లోడర్స్ కార్మికులకు మూడు నెలలుగా బకాయి పడ్డ వేతనాలను వెంటనే ఇవ్వాలని కోరారు. మున్సిపల్ సేవలను ప్రయివేటుకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జిఒ ఇవ్వడం సరికాదన్నారు. దీని వల్ల కార్మికులకు ఉద్యోగ భద్రత ఉండదని, ప్రజలపై భారాలు పడతాయని అన్నారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.శంకరరావు, జిల్లా ఉపాధ్యక్లులు గంటా శ్రీరామ్, మండల కన్వీనర్ కాళ్ల తేలయ్యబాబు, వై.ఏసురాజు, పోలరావు పాల్గొన్నారు.
Print Editionపారిశుధ్య కార్మికుల పోస్టులు భర్తీ చేయాలి
3 రోజుల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 04, 2026, 11:41 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)