test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionపేదల భూములు, హక్కుల కోసం పోరాటాలు

30 మే, 2026

meeting
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 30, 2026, 11:54 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

  • బికెఎంయు జాతీయ కౌన్సిల్ తీర్మానం

ప్రజాశక్తి – ఒంగోలు సిటీ : భూమి, ఉపాధి, గృహ హక్కుల సాధన కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలని భారతీయ ఖేత్‌ మజ్దూర్ యూనియన్ (బికెఎంయు) జాతీయ జనరల్ కౌన్సిల్ సమావేశాలు తీర్మానించాయి. ఒంగోలులోని మల్లయ్య లింగం భవన్‌లో మూడు రోజులపాటు జరిగిన సమావేశాలు శనివారం ముగిశాయి. జాతీయ అధ్యక్షులు ఎన్‌.పెరియాస్వామి, జాతీయ ప్రధాన కార్యదర్శి గుల్జార్ సింగ్ గోరియా సహా 16 రాష్ట్రాల ప్రతినిధులు సమావేశాలకు హాజరయ్యారు. ఈ సభలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ మాట్లాడుతూ… రాష్ట్రంలో పేదల సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ, పేదల వద్ద ఉన్న భూములను చట్ట సవరణల ద్వారా లాక్కునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్ల ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీఆ దిశగా చర్యలు చేపట్టలేదన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలను అడ్డుకోవాలని సమావేశాలు డిమాండ్ చేశాయి. సామాజిక భద్రతా పింఛన్లను రూ.ఆరు వేలకు పెంచాలని, వ్యవసాయ కార్మికుల‌కు కూలీ రేట్లు పెంచాలని, దళితులపై దాడులను అరికట్టాలని, పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందించాలని తీర్మానాలు చేశాయి. ఆగస్టు ఆరు నుంచి 15 వరకు చేపట్టనున్న గ్రామీణ పాదయాత్రకు, సెప్టెంబర్ 22న నిర్వహించే ‘చలో ఢిల్లీ’ కార్యక్రమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిం చాయి. సంఘ సభ్యత్వ విస్తరణతో పాటు గ్రామ, మండల, నియోజకవర్గ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేసి 2027లో జరిగే రాష్ట్ర, జాతీయ మహాసభకు సిద్ధం కావాలని సమావేశాలు పిలుపునిచ్చాయి. సమావేశాల్లో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఆర్‌.వెంకట్రావు, రాష్ట్ర కార్యదర్శి సి.సుబ్రహ్మణ్యం, టి.కృష్ణప్ప తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్