శత జయంత్యుత్సవాల్లో వక్తలు
ప్రజాశక్తి – గుంటూరు : అధ్యాపక ఉద్యమ నేత, శాసన మండలి మాజీ సభ్యులు ఎంజె.మాణిక్యరావు సామాజిక దార్శనికుడు అని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఎంజె మాణిక్యరావు శతజయంతి ఉత్సవాలు గుంటూరులోని ఎసి కాలేజీలో శనివారం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ, ఎంజె.మాణిక్యరావు మెమోరియల్ కమిటీ అధ్యక్షులు కెఎస్.లక్ష్మణరావు అధ్యక్షతన జరిగిన సభలో ఆచార్య నాగార్జునా యూనివర్సిటీ మాజీ వైస్‌ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ వి.బాలమోహన్‌దాస్ మాట్లాడారు. మాణిక్యరావు అధ్యాపకుల సంక్షేమంతోపాటు, పేదల సమస్యలపై కూడా పనిచేశారని, 11 ఏళ్లపాటు మండలి సభ్యుడిగా అనేక అంశాలపై గళమెత్తారని తెలిపారు. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యా సంస్థల పరిరక్షణకు మాణిక్యరావు చేసిన కృషి మరువలేనిదని అన్నారు. బాపట్ల మాజీ ఎంపి శ్రీరాం మాల్యాద్రి మాట్లాడుతూ కావలి జవహర్‌భారతి కాలేజీలో తను మాణిక్యరావు విద్యార్థినని, ఆయన విద్యార్థులను ఎంతో ప్రోత్సహించేవారని గుర్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ ఎఎస్ రామకృష్ణ మాట్లాడుతూ ఎయిడెడ్ విద్యాసంస్థలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆక్టా రాష్ర్ట అధ్యక్షులు కె.మోహనరావు మాట్లాడుతూ ఎయిడెడ్ డిగ్రీ కాలేజీల్లో పేద విద్యార్థులు తక్కువ ఫీజులతో విద్యను అభ్యసిస్తున్నారని, వాటిని రక్షించుకోవాలని అన్నారు. ఎసి కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ కె.మోజెస్ మాట్లాడుతూ ఎంజె మాణిక్యరావు వంటి గొప్ప నాయకుడు ఎసి కాలేజీలో పనిచేయటం గర్వకారణంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాణిక్యరావు స్మారక ప్రత్యేక సంచికను బాలమోహన్‌దాస్ ఆవిష్కరించారు. తొలుత కళాశాల నుండి ఉమెన్స్ కాలేజి కూడలి వరకూ ర్యాలీగా వెళ్లి అక్కడ మాణిక్యరావు విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో మాణిక్యరావు కుమారుడు విజయ్‌కుమార్, మనుమరాలు నీలిమ, డాక్టర్ సోమయ్య శాస్త్రి, మహేష్, దుర్గాప్రసాద్, బోసుబాబు, ప్రమీల పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)