సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను నిరసిస్తూ ఈ నెల ఒకటి నుంచి 7వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యాన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య వెల్లడించారు. 9న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేపట్టనున్నట్లు తెలిపారు. విజయవాడలోని దాసరి భవన్‌లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మొక్కజొన్న, వర్జీనియా పొగాకు, దానిమ్మ, బత్తాయి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కేజీ బేసిన్‌లో ఉత్పత్తయ్యే చమురు, గ్యాస్‌లో 50 శాతం వాటాను రాష్ట్రానికి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆర్‌టిసిని ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, సంస్థకు చెందిన విలువైన ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా చేపట్టనున్న ప్రచార కార్యక్రమాలు, రాస్తారోకోలను ప్రజలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి దుర్గాభవాని, డి శంకర్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)