మద్యం షాపులు కాదు మహిళలకు భద్రత చర్యలు పెంచాలి
ప్రజాశక్తి-విశాఖ కలెక్టరేట్ : పర్యాటక రంగం అభివృద్ధి పేరుతో విశాఖ, చీరాల సముద్ర తీరాలలో 'బీచ్ షాక్‌ల' ద్వారా మద్యం అమ్మకాలకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ ఐద్వా విశాఖ జిల్లా కమిటీ శనివారం గురజాడ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు ఆర్.ఎన్.మాధవి, వై. సత్యవతి,జిల్లా ఉపాధ్యక్షులు బి.పద్మ, సిఐటియు జిల్లా నాయకురాలు పి.మణి మాట్లాడుతూ.. మహారాష్ట్ర,గోవా,ఒడిశా రాష్ట్రాల్లో ప్రోత్సహిస్తున్న మద్యం సంస్కృతిని విశాఖకు తీసుకువచ్చి సముద్రతీరాలను మద్యపాన కేంద్రాలుగా మార్చే ప్రయత్నం అత్యంత దుర్మార్గమైనదని, మహిళా వ్యతిరేకమైనదని పేర్కొన్నారు. విశాఖ, చీరాల బీచ్‌లలో ప్రయోగాత్మకంగా బీచ్ షాక్ లు పెడతామని, తర్వాత రాష్ట్రమంతా ఏర్పాటు చేస్తామని నిస్సిగ్గుగా చెప్తున్నారంటే వీళ్ళు మహిళా రక్షకులా? భక్షకులా?అర్ధం కావట్లేదన్నారు. బీచ్‌లో మద్యం అమ్మకాల పేరుతో యువతను మరింతగా మద్యానికి అలవాటు చేసే విధానాలు అవలంబించడం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ దివాళాకోరు వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు బీచ్ ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు సాగిస్తే మహిళలు, విద్యార్థినులు, కుటుంబాలు విశాఖ బీచ్ రోడ్డుపై స్వేచ్ఛగా సంచరించే పరిస్థితి ఉంటుందా అని ప్రశ్నించారు. పర్యాటకం పేరుతో మహిళల భద్రతను,స్వేచ్ఛను తాకట్టు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. సామాన్య ప్రజలు తమ కుటుంబాలతో కలిసి ప్రశాంతంగా గడపడానికి ఉన్న ఏకైక ఉచిత ప్రజా వేదిక సముద్ర తీరం.. అలాంటి ప్రకృతి సంపదను కూడా మద్యపాన కేంద్రంగా మార్చడం దురదృష్టకరమన్నారు. విశాఖ బీచ్ టూరిస్ట్ బీచ్ కాదని,బీచ్ షాక్ లు పెట్టీ గోవా కల్చర్ తీసుకురావడం ప్రమాదకరమని అన్నారు. విశాఖను ఈ స్థాయికి దిగజారుస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపిలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నాడు సారా వ్యతిరేక ఉద్యమాలకు తలొగ్గి మద్యనిషేధం అమలు చేసిన ఎన్టీ రామారావు వారసులమని చెప్పుకునే టిడిపి నాయకత్వం నేడు మద్యం అనుకూల విధానాలు అవలంబించడం ముమ్మాటికీ ద్వంద్వ నీతి అని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే ఈ ప్రజా వ్యతిరేక "బీచ్ షాక్" నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విశాఖపట్నం శాంతిభద్రతలను కాపాడాలని,బీచ్‌లను మద్యపాన కేంద్రాలుగా మార్చే ప్రతిపాదనను రద్దు చేయాలని ఐద్వా డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా యువతను, మహిళలను, ప్రజాసంఘాలను పెద్ద ఎత్తున ఏకం చేసి, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉధృతమైన ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా నాయకులు ఎస్. కొండమ్మ, సిహెచ్ సుమిత్ర, ఆర్.విమల, జి.లక్ష్మీ,వి.ప్రభావతి, కె.వేణు,కె.కుమారి,జి.మణి, బి.రమణి,బి. ఈశ్వరమ్మ,కె.మణి, కె.మంగవేణి, బి.సత్యవతి, కమలమ్మ, వివిధ ప్రజాసంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)