test1
సోమవారం, 08 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసోలార్‌ పార్కుల ఏర్పాటు పేరుతో రిలయన్స్‌‌కు భారీ భూ పందేరం

10 మే, 2026

solar
వెబ్ డెస్క్

ప్రచురించబడింది మే 10, 2026, 10:00 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

  • మూడు మండలాల్లో 90 వేల ఎకరాలు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం!

ప్రజాశక్తి- అనంతపురం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లాలో రిలయన్స్‌ సంస్థకు భారీగా భూ పందేరానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఓబుళదేవరచెరువు, నల్లమాడ, ఆమడగూరు మండలాల పరిధిలోని సుమారు 90 వేల ఎకరాల భూములను సోలార్‌ ‌పార్కుల ఏర్పాటు పేరుతో లీజు పద్ధతిలో కట్టబెట్టాలని చూస్తోంది. ఇందుకుగానూ మూడు మండలాల్లో 14 గ్రామాలను ఎంపిక చేసింది. ఈ గ్రామాల్లో సోలార్ పార్కుల ఏర్పాటుకు ఉన్న అవకాశాలపై ఇది వరకే న్యూ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ ఫీజిబులిటీ రిపోర్టును రూపొందించింది. ఇప్పుడు ప్రభుత్వం రిలయన్స్‌‌కు మార్గం సుగుమం చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటోంది. సోలార్ పరిశ్రమల వల్ల ఉపాధి ఏ మేరకు లభిస్తుందన్నది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇప్పటి వరకున్న సోలార్ ప్లాంట్లలో ఉపాధి అంతంత మాత్రమే. రిలయన్స్‌ వంటి ‌బడా కార్పొరేట్‌ ‌సంస్థ మరింత ఆధునాత టెక్నాలజీతో సోలార్‌ ‌పార్కులను ఏర్పాటు చేయనుంది. దీంతో, ఉపాధి నామమాత్రమే కానుందనే చర్చ సాగుతోంది.
శ్రీ సత్యసాయి జిల్లాలో నల్లమాడ మండలం రెడ్డిపల్లి, గోపేపల్లి, దొన్నికోట, కురమాల, ఓబుళదేవరచెరువు మండలంలో నరసంబొట్లపల్లి, డబరువారిపల్లి, తిప్పేపల్లి, సున్నంపల్లి, ఓబుళదేవరచెరవు, వెంకటాపురం, ఆమడగూరు మండలంలో ఎస్.కురపల్లి, జెకె.కొత్తపల్లి, తుమ్మల, పూలకుంటపల్లి గ్రామాలు సోలార్ పార్కుల ఏర్పాటుకు అనువైనదిగా గుర్తించారు. ఏ గ్రామంలో ఎంత భూమిని కట్టబెట్టేందుకు వీలుందన్న అంశాలను కూడా ఆ నివేదికలో పొందుపర్చారు. మొత్తం 64,343 ఎకరాలను రియలన్స్‌‌కు అప్పగించేందుకు వీలుందని పేర్కొన్నారు. ఇందులో జిరాయితీ భూములు 46,184 ఎకరాలు, అసైన్డు భూములు 6,031 ఎకరాలు , ప్రభుత్వ భూములు 12,128 ఎకరాలు ఉన్నాయి. ఇవి కాకుండా మరో 12 వేల ఎకరాలు అటవీ భూములతోపాటు కొండలు, గుట్టలు అనువుగా ఉన్నాయని మొత్తం 90 వేల ఎకరాలు అవసరమని ఆ నివేదికలో పొందుపర్చారు. ప్రభుత్వ సహకారంలో రైతుల నుంచి లీజు ‌పద్ధతిలో భూములను రిలయన్స్‌ సంస్థ లాక్కోవడానికి రంగం సిద్ధమైంది.

​ భూములు పోతే గ్రామాలు ఖాళీయేనా?

భూములు పోతే గ్రామాలు ఖాళీ అయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. సోలార్ పార్కుల కోసం లీజు పద్ధతిలో భూములను కంపెనీలు లాక్కొంటున్నాయి. ఏడాదికి రూ.30 వేల చొప్పున భూ యజమానికి లీజు ఇచ్చేందుకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతుల నుంచి భూములను ప్రభుత్వ సహకారంతో గుంజుకుంటున్నాయి. ఈ భూములు సోలార్ కంపెనీలకు ఇచ్చాక గ్రామాల్లో ఉపాధి లేకుండాపోతోంది. ఇప్పటికే ఎన్‌పి కుంట మండలంలో వెయ్యి మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ రావడంతో పక్కనున్న గ్రామాలు ఖాళీ అయ్యాయి. కదిరి ప్రాంతంలో నాగిరెడ్డి పల్లి గ్రామంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సోలార్ పార్కులు భారీ ఎత్తున వస్తోన్న నేపథ్యంలో గ్రామాలకు గ్రామాలు ఖాళీ కానున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్